6, డిసెంబర్ 2020, ఆదివారం

రామాయణమ్..145

 రామాయణమ్..145 

.........

నేను ఒకప్పుడు వేయి ఏనుగుల బలముతో,పర్వతమంత ఆకారముతో సంచరిస్తూ మునుల ఆశ్రమాల మీదకు దండుగా వెళ్లి వారివారి యజ్ఞాలను భంగము కావిస్తూ ఉండేవాడిని .

.

ఒకసారి విశ్వామిత్ర మహర్షి ఆశ్రమములో కలిగిన అనుభవము చెపుతాను విను .

.

ఆ మహర్షి ఒకప్పుడు గొప్ప యజ్ఞం చేయ సంకల్పించి యాగరక్షణార్ధము దశరథ మహారాజు వద్దకు వెళ్లి ఆయన కొడుకును తనతో పంపమన్నాడు .అందుకు ఆ రాజు వీడింకా పసిబాలుడు ,నా చతురంగబలాలు తీసుకొని నేనే వస్తాను అని అన్నాడు.

అందుకు మహర్షి నిరాకరించి ,నా యజ్ఞ విధ్వంసానికి పూనుకునే రాక్షసులు సామాన్యులుకారు ,వారిని వధించాలంటే రాముడొక్కడే శరణ్యము కావున రాముని పంపు అని ఆయనను ఒప్పించి పసిబాలుడైన రాముని తెచ్చుకుని కాపలా పెట్టుకున్నాడు.

.

 రాముడికి అప్పటికింకా పసితనపు చాయలు పోలేదు విశాలమైన నేత్రాలు,శోభాసంపన్నుడు అయిన రాముడికి మీసము కూడా మొలవలేదు ,

.

ఒకటే వస్త్రము చుట్టుకొని ,జుట్టుముడిపెట్టుకొని బంగారుమాల ధరించి ,చిత్రముగా ఉన్న ధనస్సును చరుచుకుంటూ ఆశ్రమము వాకిట అటూఇటూ తిరుగుతున్నాడు.

.

నేను అప్పుడు మహర్షి ఆశ్రమము లోపలికి ప్రవేశిస్తూ ఉండగానే నన్ను గమనించి ఏ మాత్రమూ తొట్రుపాటు,భయమూ లేకుండా ధనస్సుకు నారి కట్టాడు .

.

ఆ! వీడేమిచేస్తాడు బాలుడు అని లక్ష్యపెట్టక తొందరగా విశ్వామిత్రుడి యజ్ఞవేదిక వద్దకు వెళ్ళాను .

.

 నాకు ఇప్పటికీ గుర్తు ! ఒకేఒక్క బాణము రయ్యిన దూసుకుంటూ వచ్చి నూరు యోజనముల దూరములోఉన్న సముద్రములో నన్ను పడవేసినది .

.

ఆ కరుణా సముద్రుడు ఎందుకు దయతలచాడో కానీ !నాకు తెలియదు ,నన్ను మాత్రము ప్రాణాలతో విడిచిపెట్టాడు.

.

సముద్రములో పడ్డ నేను కొంతసేపటికి తేరుకొని బ్రతుకుజీవుడా అని లంకకు చేరుకున్నాను.

.

అప్పటికి రాముడు అస్త్రవిద్య పూర్తిగా నేర్చుకొని యుండలేదు.

.

ఈ మధ్య కాలములో జరిగిన సంఘటన ఒకటి చెపుతాను విను .

.

నేను మనవాళ్ళు ఇద్దరితో కలిసి ఒక క్రూరమైన మృగ రూపము ధరించి అడవిలో మునులను భయపెడుతూ సంచరిస్తున్నాను .

.

భార్యా ,తమ్ముడితో కలిసి అడవిలో రాముడు ఉండటము చూశాను .

.

వాళ్ళను చూడగానే పూర్వము నాకు జరిగిన అవమానము గుర్తుకు వచ్చి వారిని భక్షించాలని తలచి మెల్లగా వారి ఆశ్రమ ప్రాంతములోనికి చేరుకున్నాము.

.

ఎట్లా పసిగాట్టాడో పసిగట్టాడు రాముడు !

.

మూడు బాణాలు ధనస్సుకు తొడిగాడు 

.

అవి మాకోసమే అని అర్ధమయ్యింది

.

 అవి ధనుస్సు నుండి వెలువడేలోగానే నేను తప్పించుకున్నాను .

.

పాపము వారిరువురికీ రాముడి బాణము గురించిన జ్ఞానము లేకపోవటము చేత వాటి బారినపడి మృతులయ్యారు.

.

కాబట్టి రావణా ,హాయిగా సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన ఎందుకు పెట్టుకుంటావు ,నీవాళ్ళంతా రకరకాల ఉత్సవాలు చేసుకుంటూ ప్రతి రోజూ ఆనందముగా ఉంటున్నారు ,వారికి ఆ ఆనందము కలకాలము ఉండేటట్లు చూడు .

.

నిష్కారణముగా రాముడికి అపకారము చేసి ఆయన కోపానికి గురి కాకు .

.

అవివేకంతో వ్యవహరించి మొత్తము రాక్షస జాతినే ఎందుకు పాడు చేసుకుంటావు !అని పలికాడు మారీచుడు.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: