12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మన మహర్షులు- 18

 మన మహర్షులు- 18


గర్గ మహర్షి 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


గర్గుడు బ్రహ్మమానస పుత్రుడు.

గర్గ మహర్షికి స్వయంగా శివుడే గురువు. ఆయన దగ్గర వేలకు వేలు శిష్యులు వేదాలు, శాస్త్రాలు నేర్చుకునే వాళ్ళు,


 హైహయవంశం వాళ్ళు, యాదవులు ఇంకా ఎంతోమంది రాజులు గర్గుడిని కులగురువుగా పెట్టుకున్నారు


ఒకసారి గర్గుడు శిష్యుల్ని తీసుకుని దేవకీ వసుదేవుల కోరిక ప్రకారం వ్రేపల్లె వచ్చాడు. యశోద కృష్ణుడికి పాలిస్తూ ఒక బంగారు ఆసనం మీద కూర్చుంది. శిష్యులతో సహా వచ్చిన గర్గ మహర్షిని చూసి యశోద సత్కారం చేసి కూర్చోమని చెప్పి మహర్షీ ! మీరెవరో గొప్ప తేజస్సుతో మనిషిరూపంలో ఉన్న విష్ణుమూర్తిలా ఉన్నారు. మీ పేరు చెప్తారా? అని అడిగి "స్వామీ! ఈ చిన్ని కృష్ణుణ్ని దీవించండి" అంది యశోద


గర్గుడు యశోదానందుల్ని చూసి తల్లీ ! నేను గర్గ మహర్షిని, మీకిద్దరికి ఏకాంతంలో నేను వచ్చిన పని చెప్తాను అన్నాడు


గర్గుడికి సాష్టాంగ నమస్కారం చేసి చెప్పండి అని రహస్య మందిరానికి తీసికెళ్ళారు యశోదానందులు, 


గర్గ మహర్షి వాళ్ళతో కృష్ణుణ్ణి గురించి ఇలా చెప్పాడు. ...


మీ యింట్లో ఉన్న ఈ చిన్నవాడు దేవకీ వసుదేవుల కొడుకు. రోహిణికి పుట్టినవాడు ఇతనికి అన్న అవుతాడు. కంసుడు చంపేస్తాడనే భయంతో మీకు పుట్టిన కూతుర్ని తీసికొని ఈ పిల్లవాడిని ఇక్కడ ఉంచారు. ఈ పిల్లవాడు సాక్షాత్తూ నారాయణుడే! దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి మనిషి రూపంలో పుట్టాడు నారాయణుడు

రాధేశ్వరడు, భార్గవీకాంతుడు, నలినాక్షుడు, నరనారాయణులు, కపిలుడు మొదలైన

వారు విష్ణుమూర్తి అంశతో పుట్టినవాళ్ళే. అంతమంది కలిసి ఒకటిగా ఈ పిల్లవాడు పుట్టాడు .


ఇతడు పుట్టగానే నిజస్వరూపం దేవకీ వసుదేవులకి చూపించాడు. ఇతడు ప్రతియుగంలోనూ పేరు రంగు మార్పులతో పుడతాడు, కృతయుగంలో తెల్లగాను త్రేతాయుగంలో ఎర్రగాను, ద్వాపరయుగంలో పీతవర్ణంతోను ఇపుడు కృష్ణవర్ణంతో కృష్ణుడు అని పిలవబడతాడు అని చెప్పాడు గర్గ మహర్షి -


ఈ కృష్ణ అనే పేరులో ఎంత గొప్పతనం ఉందో చెప్తాను వినండని గర్గ మహర్షి యశోదానందులకిలా చెప్పాడు. కకారం బ్రహ్మవాచకం, ఋకారం అనంతవాచకం, షకారం

శంకరవాచకం, ణకారం ధర్మవాచకం, అకారం విష్ణువాచకం, విసర్గం నరనారాయణ వాచకం, కృష్ణ నామం స్వరశక్తిమయం. ఈ పేరు పలకడం వల్ల మోక్షం కలుగుతుంది అని చెప్పాడు


కృష్ణుడికి ఇంకా ఎన్ని పేర్లున్నాయో చెప్పాడు గర్గ మహర్షి, శ్రీకృష్ణుడు, పీతాంబరుడు కంసధ్వంసి, విష్ణరశ్రవుడు, దేవకీనందనుడు, శ్రీమంతుడు, యశోదానందనుడు, హరి సనాతనుడు, అచ్యుతుడు, విష్ణుడు, సర్వేశ్వరుడు, సర్వరూపధరుడు, సర్వాధారుడు, సర్వగతి, సర్వకారణకారుడు, పరిపూర్ణతముడు, పరబ్రహ్మ, గోవిందుడు, గరుడధ్వజుడు రాధాబంధుడు, రాధికాంతరాత్మ, రాధికాజీవనుడు మొదలయినవి. ఈ పేర్లు వేదాల్లో కూడ ఉన్నాయనీ, ఈ పేర్లు పలకడం వల్ల పాపాలన్నీ పోతాయని చెప్పాడు గర్గ మహర్షి


 ఈ పిల్లవాడి అన్న పేరు బలరాముడు. రాధాకృష్ణులు గోలోకంలో ఉన్న శ్రీదామ రాధికలే! అని కృష్ణుడు చెయ్యబోయే అన్నీ పనుల గురించి విపులంగా చెప్పి జాతకర్మ నామకర్మ, అన్నప్రాశన అన్ని చేయించాడు గర్గ మహర్షి.


 ఆ తర్వాత కొంతకాలానికి గర్గ మహర్షి బలరామకృష్ణులకి ఉపనయనం చేసి సాందీపని మహర్షి దగ్గరకు వాళ్ళని శిష్యులుగా పంపించాడు.


హైహయవంశం వాడయిన కార్తవీర్యార్జునుడికి గొప్ప వైరాగ్యం వచ్చి రాజ్యం వదిలేసి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోతానన్నాడు. 

అతని కులగురువు గర్గుడు ఎంత చెప్పినా వినలేదు. అయితే నువ్వు దత్తాత్రేయుడి గురించి తపస్సు చెయ్యి అన్నాడు గర్గుడు.


 కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి కోసం తపస్సు చేసి వరం పొంది ఆ గర్వంతో జమదగ్ని మహర్షి హోమధేనువుని తెచ్చేసుకున్నాడు.


 ఆ మహర్షిని హింస పెట్టవద్దని గర్గుడు ఎంత చెప్పినా వినలేదు కార్తవీర్యార్జునుడు.ఆ తర్వాత పరశురాముడి చేతిలో మరణించాడు.


ఒకసారి గర్గ మహర్షిని యాదవులు అవమానించారు. గర్గుడికి కోపం వచ్చి "మూర్ఖులారా ! నావలన పుట్టిన కాలయవనుడు మిమ్మల్ని నానాబాధలు పెడ్తాడని" శపించాడు యాదవులు తమ తప్పు తెలుసుకుని బాధపడి బ్రతిమాలుకున్నారు. కృష్ణుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పాడు గర్గ మహర్షి.


యవనరాజు దగ్గర ఉన్న గర్గ మహర్షి తనకు సేవలు చేస్తున్న అప్సరసకి కాలయవనుడనే కొడుకుని ప్రసాదించాడు.  యవన మహారాజు కాలయవనుడ్ని పెంచాడు. కాలయవనుడు యాదవుల్ని నానా బాధలు పెడ్తుంటే కృష్ణుడు అతడ్ని చంపేశాడు.


గర్గ మహర్షి “గర్గసంహిత" రాశాడు. ఖగోళశాస్త్రాన్ని రాసిన ఈయన జ్యోతిష్యంలో కూడ గొప్పవాడు.


గర్గ మహర్షి ఎంత గొప్పవాడో తెలుసుకున్నాముగా .... ధర్మప్రవక్తగా, వేదశాస్త్రాలు తెలిసిన వాడుగా, ఖగోళశాస్త్ర గ్రంథకర్తగా, జ్యోతిషశాస్త్ర పండితుడుగా ఎంత గొప్పవాడో చూశారా మరి......


స్వయంగా భగవంతుడికి జాతకర్మ, నామకరణం, ఉపనయనం, చేశాడంటే ఎంత గొప్పవాడో కదా మరి...


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: