*మూడు నిద్రల మహిమ..*
"చాలా దూరం నుంచి వస్తున్నాము..మాలకొండలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని, అమ్మవారిని దర్శించుకున్నాము..తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాము..కార్లో మాలకొండ ఘాట్ రోడ్డు లో క్రిందకు వస్తుంటే..ఈ క్షేత్రం దర్శించమని రోడ్డు ప్రక్కగా పెట్టివున్న బోర్డ్ చూసాము..అక్కడినుంచి పదకొండు కిలోమీటర్లే కదా..అని చూద్దామని ఇక్కడకు వచ్చాము..స్వామివారి సమాధిని చూడొచ్చు కానీ దగ్గరకు వెళ్ళనివ్వరు అని మీ పూజారి గారు చెప్పారు..ఇంకొక గంటకు పల్లకీసేవ కూడా ఉంటుందని అన్నారు..మేము ఈరోజు రాత్రికి ఇక్కడ ఉండేవిధంగా అనుకోని రాలేదు..మాలకొండ నుంచే వెనక్కి వెళ్లిపోవాలని మా ఆలోచన..మేము ఉండటానికి ఒక రూమ్ ఏమైనా ఇప్పించగలరా?..రేపుదయాన్నే ఖాళీ చేసి మా ఊరు వెళ్లిపోతాము..ప్లీస్ అండీ.." అంటూ ఆ అమ్మాయి ప్రాధేయపడింది..ఆ అమ్మాయి భర్త మాత్రం ప్రక్కనే మౌనంగా వున్నాడు..
"మీరెంత బ్రతిమిలాడినా రూములు మాత్రం ఖాళీ లేవు..ఆ విషయం లో నేనేమీ చేయలేను..దాదాపుగా అన్ని రూములూ బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చేసారని అనుకుంటున్నాను..ఎవరైనా రాకుండా వుండి..తాము రావటం లేదని మాకు కాల్ చేస్తే..ఆ రూమ్ మీకు కేటాయిస్తాను.." అని నేను జవాబు చెప్పేలోపలే.."అయ్యా..విజయవాడ నుంచి మురళీధర్ గారు రావడం లేదని ఫోన్ చేశారు.." అని మా సిబ్బంది నాతో అన్నారు.."అమ్మా..కేవలం మీ అదృష్టం..ఆ రూమ్ మీరు తీసుకోండి.." అన్నాను..ఆ అమ్మాయి ముఖం సంతోషం తో వెలిగిపోయింది.."థాంక్స్ అంకుల్.." అని చెప్పింది..
ఆరోజు సాయంత్రం పల్లకీసేవ లో ఆ ఇద్దరు కూడా పాల్గొన్నారు..ఆ అమ్మాయికి మన హిందూ ఆచారాల మీద కొద్దిగా నైనా అవగాహన వున్నది కానీ..ఆ అమ్మాయి భర్తకు మాత్రం బొత్తిగా లేదు..ఆచమనానికి..తీర్ధానికీ..తేడా తెలియని వాడు..పల్లకీసేవ పూర్తి అయిన తరువాత..ఆ దంపతులు ఇద్దరూ నా వద్దకు వచ్చారు.."చాలా బాగా జరిగింది అంకుల్..మేము సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు గా పనిచేసేవాళ్ళము..రెండేళ్ల క్రితం మేమే ఒక కంపెనీ పెట్టుకున్నాము..పర్వాలేదు..బాగానే నడుస్తోంది..గత ఐదారు నెలలుగా సరైన కాంట్రాక్టులు రావడం లేదు..మా వద్ద ఓ ముప్పై మంది పనిచేస్తున్నారు..ఇంతవరకూ ఎవ్వరికీ జీతాలు ఇవ్వకుండా ఆపలేదు..కానీ ఇప్పుడున్న పరిస్థితే ఇంకా కొన్నాళ్ళు కొనసాగితే..కొంతమంది సిబ్బందిని తొలగించాల్సి వస్తుంది..ప్రధానంగా రెండు కాంట్రాక్టుల కోసం మేము ఆరాటపడుతున్నాము..అవి మాకు వస్తే..మరో మూడేళ్లు మేము తిరిగి చూసుకోకుండా కంపెనీ నడపొచ్చు..మరో పది రోజులే గడువు ఉన్నది..ఈరోజు మాలకొండ లో కూడా మొక్కుకున్నాము..ఏదో బలమైన శక్తి ఇక్కడకు లాగినట్టుగా..వెనక్కు వెళ్లాలని అనుకున్న మేము..ఈ క్షేత్రానికి వచ్చాము..ఇక్కడ పల్లకీసేవ లో పాల్గొన్నాము..మాకు మంచి జరుగుతుందని అనిపిస్తున్నది.." అని చెప్పింది.."నాకు కూడా చాలా బాగా అనిపించిందండీ.." అని ఆ అమ్మాయి భర్త చెప్పాడు..
ఆదివారం ఉదయం ప్రభాతసేవ పూర్తి కాగానే..ఆ దంపతులు ఒక ఫైల్ చేతిలో పట్టుకొని మందిరం లోకి వచ్చారు.."మెమనుకుంటున్న కాంట్రాక్టు తాలూకు ఫైల్ ఇది..స్వామివారి సమాధి వద్దకు వెళ్ళినప్పుడు..ఆ సమాధికి ఈ ఫైల్ తాకిస్తాము..మేలు జరుగుతుందేమో అని ఒక ఆశగా ఉంది అంకుల్.." అన్నది ఆ అమ్మాయి.."అలాగే నమ్మా.." అన్నాను..మరి కొద్దిసేపటి లోనే..ఆ దంపతులు స్వామివారి సమాధి దర్శనం చేసుకొని ఇవతలికి వచ్చారు..స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద అర్చన చేయించుకొని..మంటపం లోకి వెళ్లి.. చాలాసేపు ఇద్దరూ తమలో తామే ఏదో చర్చించుకుని..నా వద్దకు వచ్చి.."అంకుల్..మేము ఈరోజు, రేపు కూడా ఇక్కడే ఉంటాము..ఎల్లుండి ఉదయం స్వామివారి సమాధి దర్శించుకొని మా ఊరు వెళ్లిపోతాము.." అన్నారు.."హఠాత్తుగా ఎందుకు అలా అనిపించింది.."? అన్నాను.."ఏమో అంకుల్..ఇతనే ఆ విధంగా పట్టు పట్టాడు..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి రాగానే..తనకెందుకో ఇక్కడ మూడు నిద్రలు చేయాలని అనిపించిందట..నాతో చెప్పాడు..నిజానికి చాలా పనులున్నాయి..కానీ ఇతను మాత్రం ఇక్కడ వుండిపోదాము అంటున్నాడు..సరే అన్నాను.." అన్నది..అతని వైపు చూసాను.."అవునండీ..ఇంకో రెండు రోజులు ఉంటాము.." అని ముక్త సరిగా సమాధానం చెప్పాడు.."మీ ఇష్టం.." అన్నాను..
అనుకున్న విధంగానే మరో రెండురోజులూ వున్నారు..మొత్తం మూడు రాత్రులు స్వామివారి మంటపం లోనే నిద్ర చేశారు..మంగళవారం నాటి ఉదయం పది గంటల వేళ..మరొక్కసారి స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని..నాతో వెళ్లిస్తామని చెప్పి..వెళ్లిపోయారు..పదిహేను రోజుల తరువాత.."ప్రసాద్ గారూ..నేను ఉపేంద్ర ను మాట్లాడుతున్నాను..రెండువారాల క్రితం మొగిలిచెర్ల క్షేత్రం లో మూడు రాత్రులు నిద్రచేసిన దంపతులము..గుర్తు ఉన్నదా..రేపుదయం అక్కడికి వస్తున్నాము.." అని ఫోన్ చేసాడు..వెంటనే గుర్తుకొచ్చారు..ప్రక్కరోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆ దంపతులు కార్లో వచ్చారు..నేరుగా నా వద్దకు వచ్చి.."మేమనుకున్న కాంట్రాక్ట్ మాకే వచ్చింది..రెండోది కూడా దాదాపుగా మాకే ఖరారు అయ్యింది..స్వామివారు మామీద దయ చూపారు..మా మూడు నిద్రలు వృధా పోలేదు.." అని గబ గబా అతను చెప్పాడు.."స్వామివారిని దర్శించుకొని వస్తాము.." అని అడిగారు..లోపలికి వెళ్లి స్వామివారి సమాధిని దర్శించుకొని ఇవతలికి వచ్చి.."శని ఆదివారాల్లో ఇక్కడకు ఎక్కువమంది వస్తుంటారు కదా..మేమూ కళ్లారా చూసాము..ఒక వారానికి అయ్యే అన్నదానము ఖర్చు ఎంతో చెపితే ఇచ్చేస్తాము.." అన్నారు..
మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి గురించి ఏమాత్రం అవగాహన లేని ఆ దంపతులిద్దరూ..ఇక్కడకు రావడమేమిటి?..మూడు నిద్రలు చేయడమేమిటి?..తమ కోర్కె నెరవేరిందని సంతోషపడటమేమిటి..? శ్రీ స్వామివారి అవ్యాజ కరుణకు ఆ దంపతులు నోచుకోవడమేమిటి..? అంతా ఒక మాయలాగా అనిపిస్తుంది మేము ఆలోచించుకుంటే..
వీటన్నిటికీ సమాధానం ఒక్కటే..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి