5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మొగలిచెర్ల

 *వృద్ధ దంపతులు..*


"మీరు ప్రత్యేకించి మా కోసం రూము ఇవ్వకపోయినా పర్వాలేదు..మేమిద్దరం సర్దుకుపోతాము..మంటపం లో పడుకుంటాము..ఎంతవరకు మనకు ప్రాప్తమో అంతవరకే అనుభవించాలి..దేవుడు కేటాయించిన దానినే సంతోషంగా స్వీకరించాలి..మనది కానీ వస్తువు మన దగ్గర నిలువదు..దానికోసం నువ్వు ఎంత కాపలా కాసినా..చివరకు అది చేరవలిసిన చోటుకే చేరుతుంది..ఈ సత్యం అవగతం కావడానికి మా ఇద్దరికీ యాభై ఏళ్ళు పట్టింది.." అని ఆ వృద్ధ దంపతులలో ఉన్న భర్త చెప్పారు..డెబ్బై ఏళ్ల వయసులో ఆ ఇద్దరూ ఎంతో ఉషారుగా వున్నారు..ముఖం లో సంతోషమే తప్ప, మచ్చుకు కూడా నైరాశ్యం లేదు..ఆ దంపతులది బెర్హంపూర్..బరంపురం అని మనం పిలుస్తాము..తెలుగు వాళ్లే..కానీ అక్కడే స్థిరపడ్డ తెలుగు కుటుంబాలలో వీళ్లదీ ఒకటి..


"మీరు శ్రమ పడవద్దు..ఒక రూము కేటాయిస్తాను..అందులో వుండండి..ఈ క్షేత్రం గురించి మీకెలా తెలుసు..అందులోనూ మీరుండేది ఒరిస్సాలో.." అన్నాను కుతూహలం పట్టలేక..ఆయన నా వైపు నవ్వుతూ చూసి.."మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహ స్వామి..ఆ స్వామివారి క్షేత్రాలను ఒక్కొక్కటిగా దర్శనం చేసుకుంటూ ఉన్నాము..పోయిన సంవత్సరం పెంచలకోన లో వెలసిన లక్ష్మీ నారసింహుడిని దర్శనం చేసుకున్నాము..అక్కడ మాల్యాద్రి గురించి అదే మాలకొండ గురించి విన్నాము..అప్పుడు మాకు కుదరలేదు..ఈ సంవత్సరం వీలుచూసుకొని..అందులోనూ శనివారం నాడు మాత్రమే మాలకొండలో దర్శనం కనుక అలా ఏర్పాటు చేసుకొని వచ్చాము..అక్కడ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం చేసుకున్నాక..మా కారు లో కూర్చోబోతుండగా..ఎవరో ఒక సాధువు లాగా వున్నాడు..అతను మా దగ్గరకు వచ్చి.."ఇక్కడ దగ్గరలోనే అవధూత దత్తాత్రేయుడి గుడి ఉంది..అక్కడికి వెళ్ళండి..మీకు శుభం జరుగుతుంది.." అన్నాడు..అతనిని విచారిస్తే..ఈ స్వామివారి గురించి చెప్పాడు..దగ్గరే కదా అని ఇటు వచ్చాము.." అన్నారు..


"ఈరోజు స్వామివారి పల్లకీసేవ ఉన్నది..అందులో పూజ చేయించుకోండి..రేప్పొద్దున్నే స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్ళొచ్చు.." అన్నాను.."బాబూ..ఇక్కడ సమాధి చెందిన అవధూత చాలా సిద్ధపురుషుడని విన్నాను..మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే..ఆ కోరిక తీరుతుందని అందరూ చెపుతున్నారు..నిజమేనా..?" అని అడిగారు.."అదొక విశ్వాసం..సర్వస్య శరణాగతి చెందితే..స్వామివారు తప్పక కరుణిస్తారు..నా కళ్లారా చాలామంది బాగుపడటం చూసాను.." అన్నాను.."ఓహో..అలాగా.." అన్నారు..ఆ తరువాత పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఇద్దరూ పెద్దవాళ్లే అయినా..పల్లకీ తో పాటు మందిరం చుట్టూ..ఇతర భక్తుల తో కలిసి ప్రదక్షిణాలు చేశారు..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం స్వామివారి సమాధి దర్శనం చేసుకొని నాతో వెళ్ళొస్తామని చెప్పి..వాళ్ళ ఊరు వెళ్లిపోయారు..


మరో పది నెలల తరువాత..ఆ దంపతులు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి..అదీ శనివారం నాడే వచ్చారు..ఈసారి తమ కుమారుడిని కోడలిని వెంటపెట్టుకొని వచ్చారు..మధ్యాహ్నం మూడు గంటల వేళ, నా దగ్గర కూర్చుని.."బాబూ..పోయినసారి మేమొచ్చినప్పుడు నువ్వు..సర్వస్య శరణాగతి చెందితే..స్వామివారు కరుణిస్తారు.." అని చెప్పావు గుర్తుందా?..మేమిద్దరమూ ఆ మాట నమ్మి..మా మనుమరాలి పెళ్లి గురించి మొక్కుకున్నాము..ఆ అమ్మాయికి ముప్పై ఏళ్ళు నిండాయి..వివాహం కాలేదు..నా కుమారుడు, కోడలు బాగా వ్యధ చెందుతున్నారు..ఈ స్వామివారి వద్ద మేము మొక్కుకొని వెళ్లిన నెలన్నర కు అమ్మాయికి కేరళ నుంచి సంబంధం వచ్చింది..వాళ్ళూ తెలుగు వాళ్లే..మాట్రీమోనీ ద్వారా చూసారట..సంప్రదించారు..ఆ అబ్బాయికి ముప్పై రెండేళ్లు..వాడికి వివాహం కాలేదని వాళ్ళూ మథన పడుతున్నారు..మొత్తం మీద పిల్లలిద్దరూ ఒకళ్ళకొకళ్ళు నచ్చారు..నెల తిరక్కుండానే పెళ్లి చేసాము..ఇప్పుడు ఇద్దరూ కాపురం చేసుకుంటున్నారు..పైగా అమ్మాయి గర్భవతి కూడా..స్వామివారి మహిమే అని మా ఇద్దరికీ అర్ధం అయింది..మా కుమారుడికి చెప్పాము..వాళ్ళూ వస్తామని చెపితే..అందరం కలిసే వచ్చాము.." అన్నారు.."నా కళ్ళముందే..ఫలానా బరంపురం వాళ్లకు కూడా..స్వామివారి సమాధి దర్శనం తరువాత వాళ్ళ కోరిక నెరవేరింది..అని నువ్వు గట్టిగా..మాకు చెప్పినట్టే..అందరికీ చెప్పొచ్చు.." అని నవ్వుతూ చెప్పారు..ఆ వృద్దాప్యం లో ఆ దంపతుల ఓపిక కు నాకు ముచ్చటేసింది..పైగా ఇద్దరూ ఎంతో సంతోషంగా వున్నారు..


సంవత్సరం క్రితం వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేసి.."అమ్మా నాన్న మొగలిచెర్ల రావాలని ఒకటే పట్టుబడుతున్నారు..నాకు వీలు కావడం లేదు..ఇంతకుముందు లాగా వాళ్ళను ఒంటరిగా పంపలేము..బాగా పెద్దవాళ్ళై పోయారు..స్వామివారి విభూతి పంపండి..త్వరలోనే అందరమూ వస్తాము.." అన్నాడు..విభూతి పోస్ట్ లో పంపాము..మరో మూడు నెలలకు ఆ దంపతులను తీసుకొని అతను వచ్చాడు..స్వామివారి సమాధి దర్శనం చేసుకున్న తరువాత.."బాబూ..ఈసారి స్వామివారిని మేమిద్దరమూ ఒకే కోరిక కోరాము..ఇప్పటి వరకూ మంచి జీవితాన్ని గడిపాము..మంచి మరణాన్ని ప్రసాదించమని వేడుకున్నాము..ఇక స్వామి దయ..మా ప్రాప్తం.." అని చెప్పారు..ఆ దంపతుల ముఖం లో అదే చిరునవ్వు..అదే ప్రశాంతత..ఆరోజు సాయంత్రం తిరిగి వెళ్లిపోయారు..


మరో మూడు నెలలకు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి....."నాన్నగారు నెల క్రితం మరణించారండీ..ఏ ఇబ్బందీ పడకుండా ఒక్కరోజు కూడా అనారోగ్యం పాలు కాకుండా..నిద్రలోనే తుది శ్వాస విడిచారు..ఆయన కోరుకున్నట్టే అనాయాస మరణం లభించింది.."అని చెప్పాడు..వార్త విన్నప్పుడు బాధ వేసినా..ఆయన కోరుకున్నది అదే కదా..అని అనిపించింది..చివరి వరకూ స్వామివారినే నమ్మి వున్నారు..స్వామివారూ వాళ్ళు కోరుకున్నది ప్రసాదించారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: