10, మే 2021, సోమవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*ఆశ్రమనిర్మాణానికి సన్నాహాలు..*


*(ఇరవై మూడవ రోజు)*


బావిలో నీరు పుష్కలంగా పడింది..ఆమాటే శ్రీధరరావు గారు మాలకొండ వెళ్ళినప్పుడు శ్రీ స్వామివారికి చెప్పారు..శ్రీ స్వామివారు ఎప్పటిలాగే ప్రసన్నంగా చూసారు..అలాగే ఒక మనిషిని ప్రత్యేకంగా చిన మీరాశెట్టి గారి వద్దకు ఈ విషయం తెలియచేసి రమ్మని గొట్టిగుండాల గ్రామానికీ పంపించారు..


ఇక ఆశ్రమ నిర్మాణానికి మీరాశెట్టి గారు సమాయత్తం కావాలి..శ్రీ స్వామివారు నిర్ణయించిన శంఖుస్థాపన ముహూర్తం దగ్గరపడుతోంది..ఈలోపలే మీరాశెట్టి గారి దంపతులు మొగలిచెర్ల వచ్చారు..శ్రీధరరావు గారితో, ప్రభావతి గారితో అన్ని విషయాలూ మాట్లాడి..శంఖుస్థాపన రోజు చేయవలసిన పూజా కార్యక్రమాలు.. అందుకు కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేసుకోవడం మొదలైన విషయాలన్నీ తీరుబడిగా చర్చించుకున్నారు..శ్రీ స్వామివారి ద్వారా శ్రీధరరావు దంపతులకు పరిచయం అయిన రెండవ వారు శ్రీ మీరాశెట్టి దంపతులు..అంతకుముందు శ్రీ చెక్కా కేశవులు గారు పరిచయం కావడం..కుటుంబంలో ఒకరుగా కలిసిపోవడం గుర్తుండేవుంటుంది..


సరిగ్గా శ్రీ స్వామివారు నిర్ణయించిన రోజే మీరాశెట్టి దంపతులు..మొగలిచెర్ల గ్రామ సమీపాన గల ఫకీరు మాన్యం అనబడే ఒక బీడు భూమిలో..ఒక సాధకుడు తన తపోసాధన కొరకు కావాల్సిన ఆశ్రమ నిర్మాణానికి శాస్త్రోక్తంగా శంఖుస్థాపన చేశారు..


ఆరోజు శ్రీధరరావు దంపతులు గానీ..మీరాశెట్టి దంపతులు గానీ..చెక్కా కేశవులు గారు గానీ..భవిష్యత్ లో ఆ భూమి ఒక పుణ్యక్షేత్రం అవుతుందనీ.. వేలాదిమంది తమ కోర్కెలు తీర్చుకోవడానికి అక్కడికి వచ్చి.. స్వాంతన పొంది భక్తి భావంతో తిరిగివెళతారనీ ఊహించలేదు..వారి మనసులో... ఒకానొక సాధకుడి తపస్సుకు తమవంతు సహాయ సహకారాలు నిస్వార్థ బుద్ధితో అందిస్తున్నామని మాత్రమే ఉంది..


మీరాశెట్టి గారు ఈ శంఖుస్థాపన కొరకు తనకున్న ముఖ్యమైన బంధువులనూ పిలిచారు..ఆరోజు అందరూ అక్కడే భోజనాలు చేసి వెళ్లిన తరువాత..మీరాశెట్టి గారు శ్రీధరరావు గారితో..తానూ తన భార్యా ప్రతి వారంలో రెండు మూడు రోజులు వుండి పనులు పర్యవేక్షిస్తామనీ..మిగిలిన రోజుల్లో శ్రీధరరావు గారిని చూడమని చెప్పి గొట్టిగుండాల గ్రామానికి వెళ్లిపోయారు..


నిజానికి మీరాశెట్టి దంపతుల త్యాగం వెలకట్టలేనిది..వారుండే గొట్టిగుండాల గ్రామం నుంచి..ఆశ్రమ నిర్మాణ స్థలం వరకూ మధ్యలో సుమారు 13, 14 కిలోమీటర్ల దూరం ఉంది..యాభై ఏళ్ళ పైబడిన వయసులో ఆ భార్యాభర్తలు ఇద్దరూ అంతదూరం నడచి వచ్చేవారు..స్థలం చదును చేయించడం దగ్గరనుంచీ ప్రతి పనీ చూసుకునే వారు..రాత్రికి మొగలిచెర్ల చేరి, శ్రీధరరావు గారింట్లో బస చేసేవారు..ఆరోజుల్లో వారు పడిన కష్టం కళ్లారా చూసిన వారికే అర్ధమవుతుంది..ఆ దంపతులకు సంతానం లేదు..శ్రీ స్వామివారికి ఈ రకంగా సేవ చేస్తే సంతానం కలుగుతుందేమో నన్న భావన రాకుండా.."మీకు సంతాన యోగం లేదు!.." అని శ్రీ స్వామివారు ఎప్పుడో తేల్చి చెప్పారని మీరాశెట్టి గారే పలుమార్లు చెప్పేవారు..ఏ కోరికా లేకుండా నిష్కామంగా శ్రీ స్వామివారి సేవలో గడిపారు..


స్థలం అంతా చదును చేసాక.. పునాది త్రవ్వకాలు మొదలుపెట్టారు..శ్రీధరరావు గారు మాలకొండకు వెళ్లినప్పుడల్లా..మొగలిచెర్ల లో జరుగుతున్న పురోగతి శ్రీ స్వామివారికి చెప్పేవారు..పునాదులు తీయడం అయిపోయిన తరువాత..తాను శ్రీధరరావు దంపతులతో మాట్లాడదలచానని శ్రీ స్వామివారు ఒక మనిషి ద్వారా చెప్పిపంపారు..శ్రీధరరావు దంపతులు తరువాత శనివారం నాడు మాలకొండకు వెళ్లి..పార్వతీదేవి మఠం వద్ద శ్రీ స్వామివారిని కలిసారు..


సాయంత్రం వేళ..శ్రీ స్వామివారు ప్రశాంతంగా పద్మాసనం వేసుకొని కూర్చుని వున్నారు..శ్రీధరరావు గారు, ప్రభావతి గారు ఎదురుగా కూర్చున్నాక..అంతవరకూ జరిగిన పని..మీరాశెట్టి దంపతుల సంకల్పం..గురించి శ్రీధరరావు గారు చెప్పారు..శ్రద్ధగా విన్న శ్రీ స్వామివారు.."నేను ఇప్పుడు మీవెంట అక్కడికి వచ్చి..అక్కడే ఉండి..ఆశ్రమ నిర్మాణాన్ని స్వయంగా చూసుకుంటాను!.." అన్నారు..


ఒక్కసారిగా శ్రీధరరావు దంపతులు ఉలిక్కిపడ్డారు..ఆశ్రమం పూర్తికావడానికి కనీసం నాలుగైదు నెలలు పడుతుంది..ఈయన ఇప్పుడే వస్తే..వసతి ఎక్కడ?..ఇలా హఠాత్తుగా వచ్చేస్తే..ఏర్పాట్లు ఏం చేయాలి?..శతవిధాల శ్రీ స్వామివారికి నచ్చచెప్పబోయారు..శ్రీ స్వామివారు వీళ్లిద్దరి కీ తన చిరునవ్వే సమాధానంగా చూస్తూ వున్నారు..


శ్రీ స్వామివారు మెల్లిగా లేచి..తాను కూర్చున్న అరుగు మీద నుంచి క్రిందకు దిగి..పార్వతీ అమ్మవారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి..దండము, కమండలమూ..జింకచర్మమూ..అన్నీ ఒక ప్రక్క పెట్టి..ఒక చిన్న వస్త్రాన్ని మొలచుట్టూ కట్టుకొని..ప్రక్కన సర్దుకున్న దండ కమండలాలను, జింక చర్మాన్ని తీసుకొని..వీళ్లిద్దరి దగ్గరకు వచ్చి..


"ఇక వెళదాం పదండి!.." అన్నారు..


నిర్ఘాంతపోయి చూస్తున్న శ్రీధరరావు ప్రభావతి గార్లు..ఏం చెయ్యాలో..ఏం చెప్పాలో..పాలుపోక..యాంత్రికంగా శ్రీ స్వామివారి వెంట..పార్వతీదేవి మఠం ముందువైపున్న మెట్ల మార్గం వైపు కదిలారు..


మంత్రోపదేశం..తాత్కాలిక విడిది..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: