1, ఆగస్టు 2021, ఆదివారం

బలరాముని తల్లి

 🕉 భూమిని మోసే ఆదిశేషుని అవతారంగా చెప్పబడే బలరాముని తల్లి చేసిన పుణ్యం ఏమిటి ? 🕉


👉బలరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అంశావతారం. 

కొన్ని పురాణాలలో ఆయనను ఆదిశేషుని అవతారంగా చెబుతారు. మరి అటువంటి బలరాముని కన్న తల్లి మరి ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి ? 


👉రోహిణిదేవి గర్భంలో సంకర్షణుడిగా అవతరించిన ఆయన దేవకీ వసుదేవుల సప్తమ గర్భం నుండి వైష్ణవమాయ ద్వారా రోహిణిదేవి లోనికి సంకర్షించబడతాడు. 


👉ఇతఃపూర్వం దేవకీవసుదేవులు సాక్షాత్తు అదితి కశ్యపులు అని చెప్పుకున్నాము. మరి ఈ రోహిణిదేవి ఎవరు? 

అంటే ఈ విషయాన్ని బ్రహ్మవైవర్తన పురాణం, గర్గభాగవతం పూర్తిగా వివరిస్తాయి. 

ఆవిడ సాక్షాత్తు నాగుల తల్లి కద్రువ.


👉 కశ్యపప్రజాపతి 13 గురు దక్షుని కుమార్తెలను పెండ్లాడాడు. 

వీరి సంతానాలు : 

1.దితికి దైత్యులు 

2అదితికి ఆదిత్యులు

3దనువుకు దానవులు

4 అనాయువు-లేక-అనుగ/వశ కు సిద్ధులు. 

5ప్రాధకు గంధర్వులు

6 ముని కి అప్సరసలు, మౌనేయులు.

7 సురసకు యక్షులు, రాక్షసులు. 

8 ఇలకు వృక్షలతాతృణజాతులు. 

9 క్రోధకు పిశితాశనములైన సింహవ్యాఘ్రాది సర్వమృగములు. 

10 తామ్రకు శ్యేనగృధ్రాది పక్షిగణములు, అశ్వములు, ఉష్ట్రములు, గార్దభములు.

 11కపిల-లేక-సురభికి గోగణము

12వినతకు అనూరుఁడు-గరుడుఁడు

 13 కద్రువకు నాగులు.


👉ఒకానొక సమయములో అదితి వసంతోత్సవ రోజున అలంకరించుకుని తన భర్త ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. కశ్యపుడు ఎప్పటికీ రాకపోయేప్పటికి ఆవిడకు తన భర్తను ఎవరు ఆపారో కనుక్కుని ఆయన కద్రువ మందిరంలో ఉన్నాడని తెలుసుకుని కద్రువ మాయ చేసి అతడిని అక్కడ ఉంచిందన్న ఉక్రోషంతో ఇటువంటి ఇంతి స్వర్గమున ఉండడానికి వీలు లేదని మర్త్యలోకంలో జన్మించమని దైవప్రోత్బలంతో శాపవాక్కు విడిచింది. ఆ శాపం గురించి తెలుసుకున్న కద్రువ ఖిన్నురాలై తనను మనుష్య జన్మ ఎత్తమన్న అదితే మనిషిగా పుట్టి పుత్రునికోసం ఆక్రోశిస్తుందని శాపం ఇచ్చింది. వీరి కోపాలను దానివలన విడిచిన శాపాలను తెలుసుకున్న కశ్యపుడు ఇద్దరినీ ఊరడించి ఇదంతా విష్ణుమాయ వలన జరిగిందని ఇద్దరికీ ద్వాపరయుగంలో ఆ పరాత్పరుడిని వేరు వేరు రూపాలలో పెంచుతారని వరాలిచ్చి ఊరడిస్తాడు. 


👉ఆ శాపఫలితంగానే అదితి కశ్యపులు దేవకీ వసుదేవులగా జన్మించి ఆ పరబ్రహ్మను ఎనిమదవ గర్భంలోను, ఆయన అంశను సప్తమ గర్భంలో పొంది, విష్ణుమాయ వలన ఆ గర్భం లో ఉన్న బలరాముని కద్రువ అవతారమైన రోహిణి గర్భంలో బలరామునిగా కంటారు. రోహిణి వాసుదేవునకు అత్యంత అనుకూలురాలై ఆయన చెప్పిన విధంగా యశోదానందుల వద్దకు పోయి బలరాముని కనిపెంచుతుంది. 


👉నాగుల తల్లి అయిన ఆ కద్రువే అనంతుడైన ఆ ఆదిశేషుని అవతారాన్ని కనిపెంచిన పుణ్యాత్మురాలు.


!! ఓం నమో వేంకటేశాయ !!

కామెంట్‌లు లేవు: