11, ఆగస్టు 2021, బుధవారం

కుండ మట్టి - జీవన్ముక్తి

 కుండ మట్టి - జీవన్ముక్తి


మనిషి ఏం చేసినా శాంతి, సుఖం, భద్రత కోసమే చేస్తూంటాడు. అవి వస్తువుల్లోనూ, పరిస్థితుల్లోనూ, మనుషుల్లోనూ, సంఘటనల్లోనూ ఉందనుకుంటాడు. తన స్వరూపమే శాంతి, సుఖం, భద్రత అని తెలుసుకోలేక, బాహ్యంగా పరుగులు తీస్తూంటాడు. కస్తూరి మృగం తనలో సువాసన పెట్టుకుని బయట ఎక్కడో ఉందని, వెతికి, వెతికి అలసి సొలసి చనిపోతుందిట. సరిగ్గా మనిషి కూడా అలానే చేస్తాడు. తనే ఆనంద స్వరూపం అని గ్రహించడు.


కుండకు ఎవరో చెప్పారు. నీ గురించి నువ్వు తెలుసుకో! స్వరూపంగా నువ్వెవరో తెలుసుకో! స్వరూపతః నువ్వు మట్టివి. మట్టిని తెలుసుకుంటే, వెంపర్లాట, ఆరాటం పోయి జీవన్ముక్తి పొందుతావు అని చెప్పారు. వెంటనే కుండ మూటాముల్లే సర్దుకుని స్వరూపంగా మట్టిని చూద్దామని చార్ ధామ్ యాత్రకు బయలు దేరింది. యాత్ర అంతా పూర్తి అయింది కాని స్వరూపంగా మట్టి మాత్రం కనపించలేదు. యజ్ఞ యాగాదులు చేసింది మట్టి జాడే తెలియలేదు. ధ్యానం చెయ్యాలన్నారెవరో! ధ్యానం లోనూ మట్టి కనపడలేదు. కుండ మట్టిని వెతకాలి. ఎలా? మట్టి ఎక్కడ ఉంది? కుండ లోపల ఉందా? కుండ బయట ఉందా? కుండ మధ్యలో ఉందా? అసలు కుండకు మట్టికి దూరం ఎంత? కుండ అంతటా మట్టే. మట్టి తప్ప కుండే లేదు. కుండకు మట్టికి దూరం ఏమిటి? అవి రెండు వస్తువులైతే కదా! మట్టినే కుండ అంటున్నాం. కుండగా పరిమితత్వం, అల్పత్వం, అశాశ్వతత్త్వం ఉన్నాయి. అదే మట్టిగా అపరిమితత్త్వం, అనల్పత్వం, శాశ్వతత్త్వం. అదే జీవన్ముక్తి. ఇప్పుడు కుండ ఏం చేయాలి? అంతటా వెతకాలా? పూజలు చేయాలా? ధ్యానం చేయాలా? నేనే మట్టిని అని తెలుసుకుంటే చాలు. కుండ తయారుకాక ముందూ మట్టే, కుండగానూ మట్టే, కుండ పగిలినా మట్టే. మట్టిగా దానిలో ఏ మార్పూ లేదు. దానికి పుట్టుకా లేదు, మరణం లేదు. అదే కుండయితే మరణం, పుట్టుక తప్పవు.

కామెంట్‌లు లేవు: