5, డిసెంబర్ 2021, ఆదివారం

సంతోషము - సుఖము - ఆనందము*

 *ॐ సంతోషము - సుఖము - ఆనందము*


    సంతోషము, సుఖము, ఆనందము అనేవి వేరువేరైనా, 

    ఓకే విధమైన అర్థంలో వాడుతూ ఉంటాం. 

    వాటి నిర్వచనాలూ, ఆనందమనేదాని వివరణలు తెలుసుకొందాం. 


*సంతోషము:*


    సోమరిగా నుండకుండా, శక్తికొలది పురుషార్థములు (ధర్మముతో కూడిన అర్థ సంపద, తద్వారా ధర్మముతో కూడిన కోరిక, దానివలన వచ్చే మోక్షము అనేవి "ధర్మ అర్థ కామ మోక్షమనే పురుషార్థములు") చేయుచు, 

    హాని జరిగినప్పుడు శోకించకుండా, 

    లాభము కలిగినప్పుడు హర్షము లేకుండా ఉండడం "సంతోషము". 


*సుఖము:* 


    దేనిని పొందుట వలన మిగిలిన యే సంపదయైనను దానికన్న తక్కువదే అనిపించునో, 

    ఏ యితర లాభమును మనస్సును ఆకర్షింపని స్థితిలో, 

    మనస్సును ఆకర్షింపగల అనుభూతి ఒక్కటే సుఖము. 

    ఏ స్థితిని పొందినవాడు పెద్ద దుఃఖముల వలన కూడా చలింపడో అదే నిజమైన సుఖము. 


ఉదా॥ 

1. ఒకచోట కూర్చొని తృప్తి పొందినప్పుడు, మరింత సౌకర్యమైన అవకాశము వచ్చినా, 

    దానిని తిరస్కరించి, ఉన్నదానితో తృప్తిపొందుతూ ఉండడం "సుఖం". 

2. రేడియో ఉపయోగంతో తృప్తిపడుతూ, టేప్ రికార్డరుగానీ ఇతర సౌకర్యవంతమైన పరికరాలువచ్చినా, 

     రేడియో ఉపయోగానికే స్థిరపడితే, అది "సుఖం". 

3. పదోన్నతి (Promotion) అవుసరం లేక, ఉన్నదానితోనే తృప్తి పడితే, అది "సుఖం". 


*ఆనందము:* 


    వివిధ పదవులూ స్థానాలలో ఉన్నప్పుడు, 

    ఆ అధికారాన్ని పొందుతూ ఉండే దైహిక సౌకర్యమూ మానసిక ఉల్లాస స్థితీ ఆనందం. 

    ఇది పదవీ స్థాయిలను బట్టీ మారుతూంటుంది. 


ఉదా॥ 

    రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరు, ముఖ్యమంత్రి, కలెక్టరు, న్యాయమూర్తి మొదలగు పదవులలో వారు పొందే మానసిక స్థితులు - వారివారి ఆనందములు. 


*ఆనందానికి శాస్త్ర ప్రమాణం*  


    వివిధ ఆనందాలను తైత్తిరీయోపనిషత్తు ఈ విధంగా తెలుపుతోంది.

1. మనుష్య ఆనందము 

     శారీరక మానసిక దృఢత్వంగల ఒక ఉత్తమవ్యక్తికి సర్వ సంపదలతోనూ ఈ భూమండలమంతా చెందితే ఎంత ఆనందం వస్తుందో అది మనుష్య ఆనందానికి ప్రమాణము(unit). 

" ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠః I 

  త స్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ I 

   స ఏకో మానుష ఆనన్దః"  

2. దీనికి వంద రెట్ల ఆనందం మనుష్య గంధర్వానందం, 

3. ఆ మనుష్య గంధర్వానందానికి వందరెట్లు దేవగంధర్వానందం, 

4. దానికి వందరెట్లు పితృదేవతల ఆనందం, 

5. ఆ పితృదేవతల ఆనందానికి వందరెట్లు అజానజుల ఆనందం, 

6. వారి ఆనందానికి వందరెట్లు కర్మదేవతల ఆనందం, 

7. ఆ కర్మదేవతల ఆనందానికి వందరెట్లు దేవతల ఆనందం, 

8. వారి ఆనందానికి వందరెట్లు ఇంద్రుని ఆనందం, 

9. ఇంద్రుని ఆనందానికి వందరెట్లు బృహస్పతి ఆనందం, 

10. బృహస్పతి ఆనందానికి వందరెట్లు ప్రజాపతి ఆనందం, 

11. ప్రజాపతి ఆనందానికి వందరెట్లు బ్రహ్మానందం.


                    =x=x=x= 

  

    — రామాయణం శర్మ 

            భద్రాచలం

కామెంట్‌లు లేవు: