17, ఏప్రిల్ 2022, ఆదివారం

ఇందుపల్లి మావయ్య- కథ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

       *🌷చా.ప్ర రాతలు🌷* 

                      ***                         

*🌷ఇందుపల్లి మావయ్య- కథ🌷* 

                  🌷🌷🌷               

వేసవి మండి పోతోంది. దానికి తోడు "సన్ డే " ఆయన రోజుకదా ఇంకా వేడెక్కి పోతున్నాడు.

 ఈ వేడిలోనే తెలుగువార్కి కష్టమైనా,  ఇష్టమైన  ఆవకాయలు పెట్టడం, గుమ్మడి వడియాలు పెట్టడం యుథ్థప్రాతి పదిక మీద  అందరూ ఉసూరు మంటూనే  చేసుకుపోతారు. ఇవన్ని తీపి కష్టాలంటాడు మా ఇందుపల్లి మావయ్య , అనుకుంటూ అటకమీద నుండి అమ్మ ఇచ్చిన ప్యారీ కంపెని జాడీలు దింపుతున్నాను.


ఇలా తలుచుకున్నానో లేదో మా ఆయన  ఓయ్ మీ ఇందుప్పల్లి  మామయ్య  వస్తున్నాడుట రేపు అని బాంబు పేల్చారు మా వారు బాబోయ్! ఏంటిట విషయం అనగానే ఏదో కోర్టు పనిపడిందిట. ఆయనకి ఏర్పాట్లు అవీ చూడు అని మా ఆయన కూరలు అవి తెస్తాను అని బయటకి వెళ్ళారు.


మా ఇందుపల్లి మావయ్య అంటే మాకందరికి ఇష్టంతో పాటు చాలా భయం కూడా! ఎందుకంటే ఆయన పద్దతి పద్దతి అంటూ చంపేస్తాడు.ఆయనకి ఓపట్టాన ఏది నచ్చదు. మా అత్తయ్య వంట, పనులు కూడా నచ్చవు ఆయనకి.


 దాంతో ఆవిడ ఆయన బాథ పడలేక ఇంటిపని వంటపని కూడా ఆయనేకే అప్పచెప్పి కాలు మీద కాలేసుకొని "విసనకర్ర విసురుకుంటూ " ఆయన వండి పెట్టినవన్ని రుచిచూస్తూ దాంట్లో  ఇదెక్కువ దీంట్లో అదెక్కువ అని ఆయనకే వంకలు పెడుతూ హాయిగా తింటూ మరింత ఒళ్ళుచేసింది. 


అలాంటి మా మావయ్య వస్తున్నాడని తెలియగానే కంగారు మొదలైంది. తెల్లవారుఝాము 4 గంటలకి బస్ దిగి ఆటోవాడు ఎక్కువ అడిగాడని మార్నింగ్ వాకింగ్ ఒంటికి మంచిది అని నడుచుకుంటు వచ్చి తలుపు తట్టాడు.


ఎప్పుడూ  పొద్దెక్కినా లేవని నేను అప్పటికే లేచి  వాకిలి చిమ్మి ముగ్గు వేసి  డికాక్షన్ వేసి స్నానం చేసి రెడీగాఉన్నాను.ఒక చేతిలో సంచి , పనసపండు,  మరోచేతిలో పెద్ద స్టీలు కారేజీతో వచ్చాడు.   చెరుకుపానకం కామయ్య తెచ్చిచ్చాడు. లోపలపెట్టు వరం! అనగానే రెండూ అందుకుని లోపలపెట్టాను.


మావయ్య వచ్చాడని మా ఆయన్ని నిద్ర లేపాను. ఆయన బధ్ధకంగా లేచేసరికి మావయ్య స్నానం చేసి పూజా గదిలో చేరి సంధ్యవార్చి పూజ చేస్తున్నాడు. ఎప్పుడు బోసిగా ఉండే మా దేవుని మందిరం మావయ్య పూజతో దేవుడు కూడా చిరునవ్వుతో అందంగా హమ్మయ్య! నన్ను ఈ రోజైనా చూసారని అంటున్నట్టుగా అనిపించింది. 


 పూజ అయ్యాకా నేను ఇద్దరికి కాఫీ కలిపి తెచ్చాను. ఇద్దరు ఒకరికొకరు  కుశల ప్రశ్నలు వేసుకున్నాకా , మామయ్య కాఫీ సిప్ చేసి ఏం కాఫీపొడే వరం ! ఇది అని పెదవి విరిచాడు.  నేను చెప్పే లోగానే కాఫీ డికాక్షన్ వేయడం ఒక కళే! అంటూ వంటింట్లోకి అడుగు పెట్టాడు.


 మొదలైంది ఇక అని నేను స్వగతం అనుకొని ఆయన వెనకాలే  స్కూలు పిల్లలా వెళ్ళా!చూడు వరం! తక్కువలో తక్కువ 6 ఫుల్ చెంచాలు కాఫీపొడి వేస్తేగాని రుచి రాదు కాఫీకి. చిక్కని పాలు కాచడం కూడా ఒక కళ! పొంగు వచ్చాకకాసేపు కాగనిచ్చిన పాలలో కలుపుకు తాగితే స్వర్గమే . అని మళ్ళీకలిపి మా ఇద్దరికి తలో కప్పు ఇచ్చాడు. అది తాగిన మా వారు ఆహా ఏం కలిపారు మావయ్యగారు! అంటూ పొగడగానే దానిమీద అరగంట ఉపన్యాసం ఇచ్చాడు. ఏవోయ్ చూసి నేర్చుకో అనగానే ఇలా డికాక్షన్ వేస్తే వారానికి ఒక అరకేజీ హుళక్కి! నెలకి రెండుకేజీలా! అయ్యబాబోయ్ అని మనసులోఅనుకుని, సర్లెండి అని వంటలో దిగి దిగగానే మావయ్య! వరం ! ఏం వండుదామనుకుంటున్నావంటు వంటింట్లో కి రావడం తో నా గుండె గుభేలుమంది. 


ఎక్కడ భారీ ఎత్తున వండేస్తాడో అని! ఈలోగా చక చక నాలుగు రకాల కాయగూరలు తీసి తరిగి ఆడవాళ్ళకన్నా మించిన క్రమపధ్ధతిలో  చేయతిరిగిన మా మావయ్య చేసిన వంటకాలు  నలుడనిపించాడు, వలలుణ్ణి మరిపించాడు.  చక్కగా అరిటాకు వేయించుకొని.సుష్టుగా భోజనం చేసి,  జాజికాయ, జాపత్రి లాంటివి చిన్న చిన్న గదులు గల ఒక నగిషీలు చెక్కిన బాక్సులోంచి తీసి తమలపాకుల్లో వేసుకొని తాంబులాలు మా ఇద్దరికి కూడా కిళ్ళీ కట్టి తను వేసుకొని మంచంమీద నడుం వాల్చేడు.


 చెప్దొద్దు నాకు కూడా ఈరోజు వంటబాథ తప్పిందని ఆనందం గానే ఉంది.


అలాగే ఆవకాయే కూడా కాంప్రమైజు అవ్వకుండా , ఇది "ఆంధ్రుల వరప్రసాదం" దీన్ని చాలా గౌరవంగా చూడాలి అంటూ మామిడికాయల్ని  తనే మరకత్తిపీఠ మీద కొట్టి , నువ్వులనూనే పోసి కొత్త ఆవకాయి కలిపి జాడీల లో వేసి  జాగ్రత్తగా చూడమని  చెప్పేడు. అన్నీ తనే దగ్గరుండి జరిపించాడు. 


వేసవికాలంలో "అమృత సుఫలం:" మామిడి ఫలం తినకపోతే వచ్చే జన్మలో కాయలు కాయని మామిడిచెట్టై పుడతామని "ఆమ్రాక్ష ఫల చరితం" లో "చూతాశుడనే "మహర్షి రాసిపారేసేడోయ్ అంటూ మా మావయ్య మామిడి పళ్ళ గురించి క్లాసు పీకి మా ఆయన్ని మామిడి పళ్ళ మార్కెట్టుకి లాక్కెళ్ళాడు. 




అక్కడ ఇది బంగనపల్లి అంటారందరు కాని ఇది బనగానెపల్లెనుంచి రావడం వల్ల దాని పేరు  బంగనపల్లి

గా మారి బంగారు రంగు తో మనల్నందరిని మురిపిస్తోంది.ఇది చిన్న చెరుకు రసం. చాలా డిగ్నిఫైడ్ గా ఉండి  పంచామృతం లా మధురం గా ఉంటుంది.


ఇదిగిదిగో ఇది పెద్దరసం అల్లసాని పెద్దన్న గారు దీనిని భోజనం చేసి పెద్దగాదీవించారు చిరంజీవిగా ఉండమన్నారు.


ఇక కృష్ణాజిల్లా కి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన  నూజువీడు రసాలు పై మోజుగల వాళ్ళ హృదయాల్లో "మేజువాణి"యే!ఇమామ్ పసందు, ఆ పసందు ఈపసందు అంటూ వాటిగురించి ఉపన్యాసం ఊదరగొట్టి , మావయ్య  ఒక పాతిక పళ్ళు నూజువీడు రసాలు  ఎన్నిక చేసి తీసుకొచ్చారిద్దరు. 


వాటిని ఎలా తినాలో కూడా వివరిస్తుంటే నేను మా ఆయన గీతోపదేశం లా విన్నాం.


రోజు తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి మాఆయననికూడా మార్నింగ్ వాకింగ్ కి కూడా లేపి బలవంతాన తీసుకెళ్ళేవాడు. మా ఆయన బధ్ధకం పూర్తిగా ఎగిరిపోయింది.


ఇప్పుడందరు డైట్ కంట్రోలంటూ  డొక్కలు మాడ్చుకుంటూ నీరసంగా ఛస్తున్నారు. అసలు అన్నిరకాల "మనతిండి" హాయిగా తిని ఇంట్లో పని, నడక ,వ్యాయామం వంటివి చేస్తే ఏ రోగాలు రావని యోగిలా ఉపదేశం చేసాడు.


నాకు రకరకాల వంటలు కూడా నేర్పించాడు.అలా తన కోర్టు పని పూర్తయ్యకా!    ఇక మీ అత్తయ్య ఏం తింటోందో పాపం! బయలదేరతాను అన్నాడు. వెడుతూ వెడుతూ నాకు చేతిలో కొంత డబ్బు పెట్టి నేను పుచ్చుకోబోతే , వరం నాకా ఆడ పిల్లలు లేరు. ఉన్న మగ నలుసులు కాస్తా విదేశాలు! నువ్వు నా కూతురు లాంటిదానివి. కాదనకు అంటూ బలవంతాన చేతిలో పెట్టాడు. 


నేను కూడా మావయ్య కి పంచెలచాపు పెట్టి ఇద్దరం కాళ్ళకి దణ్ణం పెడితే . చక్కని దేశవాళి మామిడి పళ్ళ  లాంటి, పనసపళ్ళ లాంటి పిల్లలు పుట్టాలి అని మనః స్పూర్తిగా దీవించాడు.


వెడుతూంటే నాకు కూడా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. ఎవరైన ఊరెడుతోంటే అలా కన్నీరు పెట్టకూడదని అందంగా మందలించి ఆజానుబాహుడైన మా ఇందుప్పల్లి మామయ్య నిష్క్రమించాడు.


ఇల్లంతా బావురుమంది!


చాగంటి ప్రసాద్

9000206163

కామెంట్‌లు లేవు: