*దివ్యశ్రీనారాయణీయమ్*
************************
*"అనుమానం పెనుభూతం" శ్రీకృష్ణుడు రాయబారం వహించడానికి హస్తినాపురం వెళ్లాడు. ముందుగా సభలో అందరికీ నమస్కరించి, అశ్వత్థామను సభ బయటకు పిల్చుకుని వెళ్లాడు. క్షేమ సమాచారం ముచ్చటించిన తర్వాత తనచేతి ఉంగరాన్ని కిందికి జారవిడిచాడు. దుర్యోధనుడు ఇదంతా ఒకకంట గమనిస్తూనే ఉన్నాడు. ఉంగరం పడిపోయిందని అశ్వత్థామ కిందికి వంగి తీసివ్వబోగా కృష్ణుడు గమనించనట్టు నటించి ఆకాశం వైపు చూపిస్తూ ఏదో మాట్లాడటం మొదలు పెట్టాడు. కృష్ణుడేం చూపిస్తున్నాడో.. అర్థం కాక అశ్వత్థామ కూడా ఆకాశం వైపు చూసి మాట్లాడుతూ, వేలికి ఉంగరం తొడిగాడు. ఇదంతా గమనించిన దుర్యోధనుడు, మరోలా అర్ధం చేసుకుని 17 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామను ఒక్కరోజూ సర్వ సైన్యాధిపతిగా నియమించ కుండా చేశాడు. యుద్ధంలో దుర్యోధనుడు తొడలు విరిగి నేలపై పడ్డాడు. అప్పుడు అశ్వత్థామ సుయోధనా! నేను చిరంజీవిని. పైగా శస్త్రాస్త్రాలలో అర్జునుడితో సమానమైన వాణ్ణి. నన్ను సైన్యాధిపతిని చేసి ఉంటే పాండవులనందరినీ హతమార్చేవాణ్ణి. నీకీ దుస్థితి కలిగేది కాదు' అంటూ విలపించాడు. దుర్యోధనుడు 'కానీ నువ్వు రాయబారం నాడు శ్రీకృష్ణుడికి నింగీ నేలా సాక్షిగా పాండవుల విజయానికే సహాయపడతానని మాట ఇచ్చావు కదా! అందుకే నిన్ను దూరం పెట్టాను' అన్నాడు. అది విన్న అశ్వత్థామ విరక్తిగా నవ్వి 'విధి వైపరీత్యం దుర్యోధనా! ఇది ఆ జగన్నాటక సూత్రధారి పన్నాగం. నీకు నా మీద కలిగిన అనుమానమే నీ ఓటమికి కారణమైంది' అంటూ ఆనాడు జరిగిందేమిటో వివరించాడు.* *కనుక అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవాలి. అంతేగానీ లోలోపలే రగిలిపోతే నష్టం తప్పదు. అనుమానం పెనుభూతమని రుజువు చేసే ఘటన ఇది.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి