28, ఆగస్టు 2022, ఆదివారం

గౌరవము

 *వస్త్రేణ వపుషావాచా విద్యయా వినయేచ*

*వకారైః పంచభిర్లుప్తోనరో నాప్నోతి గౌరవమ్*


మనుష్యులకు లభించే గౌరవము ఐదు స్థాయిలలో ఉంటుంది......


ఆ గౌరవాన్ని ఇచ్చే మనుష్యులను కూడా ఐదు వర్గాలుగా విభజించవచ్చును.....


1. అతిసాధారణస్థాయి మనుష్యులు (వస్త్రసౌందర్యం): 


ఈ స్థాయివారు మనుష్యులను వారు ధరించిన వస్త్రములను చూచి గౌరవిస్తారు....  ఇటువంటి ప్రేక్షకులే ఫ్యాషన్ షోలకు, వస్త్రవ్యాపారుల ధనార్జనకు ఆధారం...


2. సాధారణస్థాయి మనుష్యులు (శరీరసౌందర్యం):


ఈ స్థాయివారు మనుష్యులను వారివారి శరీరసౌందర్యం చూసి గౌరవిస్తారు.... వీరు నోరువిప్పి మాట్లాడితే వినబడే భాష చాలాసార్లు అనాగరికంగా డండడంవలన దానిని  మనము వినలేము. ...


ఈ విగ్రహపుష్టిని, దానిని గౌరవించే వీరాభిమానులను మనము సినిమా పరిశ్రమలోను, ఫ్యాషన్ పరిశ్రమలోనూకూడా చూడగలము....


ఈ మొదటి రెండు స్థాయిలూ బాహ్యసౌందర్యానికి సంబంధించినవి...


3. మధ్యమస్థాయి (వాక్సౌందర్యం)


ఈ వాక్చతురతకలవారి మాట ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది... నేడు వివిధరంగాలలో ప్రజ్ఞాపాటవాలు కలవారికన్న వాక్చాతుర్యం కలవారు ఎక్కువగా రాణిస్తున్నారన్నది సర్వవిదితమే...


ఈ  స్థాయి మనుష్యులను గౌరవించేవారు మధ్యమస్థాయికి చెందిన శ్రోతలు...


4. ఉత్తమస్థాయి (విద్యాపాండిత్యం):


కేవలం వాక్చాతుర్యం కలవారికన్న వివిధరంగాలలోని పండితులు ఇంకా గొప్పవారు.... 


"స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే" అన్న సూక్తిననుసరించి వీరు విద్యవిలువ తెలిసినవారందరిచేతా గౌరవింపబడతారు...


5. అత్యుత్తమస్థాయి (వినయసౌందర్యం):


కేవలం విద్యాపాండిత్యం సర్వోత్తమస్థాయి కాదు... ఎందుకంటే సద్గురుకృపలేని విద్యాపాండిత్యం జ్ఞానాన్నికాక గర్వాన్ని కలుగజేస్తుంది...


కావున సద్గురుకృపాప్రసాదంచే విద్యాసంపన్నులైనవారు వినయభూషణులై ఉత్తమస్థాయి పెద్దలచే గౌరవింపబడుతారు...


తక్కిన సాధారణస్థాయివారు వీరి విలువను సాధారణంగా అర్థంచేసుకోలేరు..


కాని నిజముగా తెలుకుంటే ఇదియే సర్వోత్కృష్టమైన గౌరవము....


- సేకరణ

కామెంట్‌లు లేవు: