ధర్మాకృతి : అవతారము
శ్రీమచ్చంద్రకిశోర శేఖర గురోరత్రావతారాచ్చ్రియా
నామ్నాసౌ జయవత్సరో జయతి తన్మాసోపి సన్ మాధవః
సాక్రుష్ట ప్రతిపత్తిధిర్విజయతే సర్వాదిమో వాసరః
మాంగళ్యం మృదు భంచమైత్రమభవల్లగ్నంచ పంచాననమ్!!
– గురు కృపాలహరీ
జితేంద్రియులై, సర్వదిక్కులు విజయం చేయనున్న స్వామి జయనామ సంవత్సరంలో జన్మించి, ఆ సంవత్సరపు పేరు సార్ధకం చేశారు. వసంతవల్లోకహితం చరంతః అన్న వివేక చూడామణి వాక్యములను యదార్థం చేసిన స్వామి వసంతకాలంలో మాధవమాసంలో జన్మించారు. నిత్యం నారాయణ స్మరణ చేయనున్న వారు కృష్ణ ప్రతిపత్తున జన్మించడం న్యాయంగానే ఉంది. ఆద్యంతరహితుడు ఆదివారం నాడు ఆవిర్భవించారు. నక్షత్రమో, మంగళమై మృదువై మిత్ర దైవత్వమై యింపొందిన అనూరాధా నక్షత్రము చతుశ్శిష్య సమేతంగా ఆదిశంకరులు ఒకే మూర్తిగా అవతరించారనే విషయం సూచించడానికేమో పంచానన లగ్నం తమ జననానికి ఎన్నుకొన్నారు.
స్వామి జననం జయనామ సంవత్సర వైశాఖ కృష్ణ ప్రతిపత్తిధి. ఆదివాటం అనురాధానక్షత్రం నాడు అనగా క్రీ.శ. 1894 మే మాసం 20వ తారీఖున పగలు 1.16ని.కు దక్షిణార్కటు జిల్లా విల్లుపురం గ్రామంలో హనుమాన్ కోయిల్ వీధిలోనున్న చిన్న ఇంట్లో జరిగింది. వీరు శ్రీసుబ్రహ్మణ్యశాస్త్రి మహాలక్ష్మమ్మల రెండవ సంతానం. పెద్ద కుమారుడు గణపతికి అప్పటికి తొమ్మిదేళ్ళు. “ఒంటి కన్ను కన్నూ కాదు, ఒంటి కొడుకు కొడుకూ కాదు” అనే సామెతననుసరించి పుత్రులకై పుణ్యదంపతులు కులదైవమైన స్వామిమలై స్వామినాథస్వామికి మొక్కుకొన్నారు. కులదైవముయొక్క అనుగ్రహంతో జనించిన కుమారునికి ఆ పేరే పెట్టుకొన్నారు. వారి సత్యసంకల్పం చూడండి. స్వామి తరువాతి కాలంలో అనేక కోట్లమంది భక్తులకు కులదైవమయినారు.
శ్రీవారు జన్మించిన ఆ ఇల్లు ప్రస్తుతం శ్రీమఠం అధీనంలో ఉంది. అక్కడ వేదపాఠశాల నిర్వహించబడుతోంది. అహర్నిశలు వేదశాస్త్ర అభివృద్ధికై కృషి సలిపిన మహాస్వామి పుట్టిన ఇల్లు నిరంతర వేదఘోషతో నిండి ఉండడం ఎంతో సబబుగా ఉంది.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి