18, ఆగస్టు 2022, గురువారం

ఎలాంటి పేరును పెట్టాలి

 శిశువుకు ఎలాంటి పేరును పెట్టాలని మనుస్మ్రతి  సూచిస్తోంది.

............................................................


సమాజంలో చెడ్డవాడుగా దుష్టుడిగా ముద్రపడిన మనువు  వ్రాసిన స్మ్రతి అదేనండి మనుస్మ్రతిలో పేర్లు ఎలావుండాలనో ఇలా వుంది.


సమాజములో జ్ఞానులుగా పండితులుగా వున్నవారు తమ శిశువులకు శుభం సూచించే విధంగా, క్షాత్రధర్మము కలవారు పేరులో క్షత్రియోచిత లక్షణం వుండేలా, వర్తక వ్యాపారులు ఐశ్వర్యోచితమైన, ఇతరులు దర్పం హుందాలు ప్రతిపలించేలా తమ బిడ్డలకు పేర్లు పెట్టాలని సూచన ఇవ్వడం జరిగింది.


బాలికల విషయంలో మనోహరమైన మంగళకరమైన మృదువైన, పిలవటానికి సులభంగా ఉండేపేరును పెట్టాలని మనుస్మ్రతి చెబుతోంది. తల్లితండ్రులు ఏ వర్గానికి చెందినా బాలికల విషయంలో పేరు మాత్రం కఠినంగాను దుష్టత్వాన్ని సూచించే విధంగా నామకరణం చేయరాదని మనువు బాగాచెప్పాడు కదా !


ఇంకా ఇతర ధర్మశాస్త్రాలు బాలుడి పేరును వ్రాసినపుడు ఆ పేరులోని అక్షరాలు సరిసంఖ్యలో వుండాలని, అలాగే శిశువు జన్మించిన 11, 12, 16 తేదీలలో శుభదినాన నామకరణం చేయాలని, ఎట్టి పరిస్థితులలోను తల్లిదండ్రులు పితామహులు (అవ్వతాతలు) మేనత్త మేనమామలు దాంపత్య సహితంగానే అంటే దంపతులు ఇరువురు కలిసి పేరు పెట్టాలని అంతేకాని విడివిడిగా పేరు పెట్టరాదని తెలియచేస్తున్నాయి.


నామకరణము రోజున పేరు పెట్టే దంపతులు ఉదయాన్నే స్నానసంధ్యలు ముగించి, ఇల్లువాకిలి శుభ్రం చేసుకొని ముంగిట పేడతో అలికి, గడపకు పసుపు రాసి, తోరణాలు కట్టాలి. పసుపుతో విఘ్నేశ్వరుడిని చేసి పూజించి పల్లెములో బియ్యం పోసి అందులో కలశముంచి, కలశముపై  టెంకాయ వుంచి మామిడాకులతో అలంకరించి, ఆ కలశానికి తూర్పుముఖంగా దంపతులు కూర్చుని దేవతారాధన చేయాలి.


తదుపరి ఇల్లాలు పుట్టింటివారు ఇచ్చిన దుస్తులు ధరించాలి. పురుషుడు కూడా నూతన వస్త్రాలు ధరించాలి. ఆపై పల్లెములో సమతలంగా బియ్యం పోసి  పసుపు లేదా కుంకుమలతో  3 అంగుళాల ఎడంగా సమతలంగా మూడుగీతలు గీయాలి. మొదటి గీతలో 'శ్రీ ' లేదా 'ఓం' కారము, రెండో గీతపైన శిశువు జన్మ నక్షాత్రాలు, మూడవ గీతపై శిశువుకు ఏ పేరునైతే పెట్టాలనుకొన్నారో ఆ పేరును బంగారు /వెండి/ రాగి వుంగరముతో వ్రాయాలి. అటుపిమ్మట స్త్రీలు లాలిపాటలు పాడాలి, హజరైన వారందరు కొత్త పేరును పలుకుతూ శిశువును దీవించాలి. బీదలకు అన్నదానము చేయాలి. ఈ సాంగ్యాలన్ని ఇష్టముంటేనే చేయాలి.


నామకరణం తరువాత సంవత్సరంపాటు దంపతులు మాంసాహారము తినరాదని ధర్మశాస్త్రం చెబుతోంది.


/సేకరణ/

.............................................. జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురము.

కామెంట్‌లు లేవు: