Sri Siva Maha Puranam -- 12 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
ఓంకారేశ్వర క్షేత్రము
కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే!!
మాంధాతృపురంలో వెలసిన వాడు ఓంకారేశ్వరుడు. ఓంకారేశ్వర క్షేత్రము చాలా చిత్రమయిన క్షేత్రము. అక్కడ రెండు స్వయంభూ శివలింగములు వెలశాయి. అందులో ఒకదానిని ‘ప్రణవాకార పరమేశ్వరుడు’ అంటారు. ఆయన ఓంకార స్వరూపియై ఉంటాడు. రెండవది ‘ఓంకారమమలేశ్వరం’ అంటాము. అమలేశ్వరుడు అనే పేరుతో ఒక శివలింగం ఉంటుంది. ఇలా రెండు లింగములు వెలియడానికి కారణం తెలుసుకోవాలి.
గురుస్వరూపుడు నారదమహర్షి త్రిలోక సంచారి మహానుభావుడు. ఒకసారి వింధ్యపర్వతం దగ్గరకు వచ్చారు. వింధ్యపర్వతమునకు తాను చాలా గొప్పదానను అని, తనంత ఎత్తైన పర్వతం మరొకటి లేదని చాలా అహంకారం ఉన్నది. ఇది ఒక అర్థం లేని ఆభిజాత్యం. అదృష్టం ఏమిటంటే అటువంటి సద్గురువు అయిన నారదునితో వింధ్యపర్వతం మాట్లాడడం. ఎంత అహంకారి అయినా అతనికి ఒక సద్గురువు దొరికాడంటే అతనికి అంతకుమించిన అదృష్టం లేదు. వాని జీవితం మారిపోతుంది. నారదుడిని చూసి విధ్యపర్వతం అహంకారమును బయట పెట్టింది. అసలు వింధ్యుడు చూడగానే నారదునికి నమస్కారం చెయ్యకుండా అహంకారంతో మాట్లాడాడు. నారదుడు ఒక చిరునవ్వు నవ్వి 'నీవు చెప్పినది యథార్థము. నీతో సామానమయిన పర్వతము ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది. మేరుపర్వతం కూడా చాలా గొప్ప పర్వతం. నవగ్రహములు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు అవి మేరుపర్వతమునకు ప్రదక్షిణగా తిరుగుతూ ఉంటాయి' అన్నాడు. ఆమాట వినేసరికి వింధ్య పర్వతానికి చాలా బాధ వేసింది. ‘నాకూ ఉన్నాయి శిఖరములు. వాటి చుట్టూ ఎవరూ తిరగడం లేదు. మేరు పర్వతమునకు ఉన్న కీర్తి నాకు లేదు’ అని అనుకుని ‘నారదా! నేను కూడా అటువంటి కీర్తిని పొందాలి. మేరుపర్వతం కంటే గొప్ప ఉన్నతిని పొందాలి అంటే నన్ను ఏమి చేయమంటావు?” అని అడిగాడు.
నారదుడు మహాశివుణ్ణి గూర్చి తపస్సు చేయమని వింధ్యుడికి సలహా చెప్పాడు. వెంటనే వింధ్యుడు మహాశివుణ్ణి గూర్చి శివ పంచాక్షరీ మహామంత్రమును ఉచ్ఛరిస్తూ తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు. దేవతలు మహాదేవుని వద్దకు వెళ్లి ‘మహాదేవా! వాని తపస్సు సామాన్యంగా లేదు. మీరు వెళ్ళి ప్రత్యక్షం అవండి’ అన్నారు. అంతటా నిండి ఉన్న నిర్గుణ పరబ్రహ్మము సాకారమును పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు. చేతితో స్పృశించాడు. వింధ్యుడు బహిర్ముఖుడు అయ్యాడు. ‘నాయనా! నీవు చాలా గొప్ప తపస్సు చేశావు. నీవు ఏమి కోరి ఈ తపస్సు చేశావు? ఏమి కావాలో చెప్పు ఇస్తాను’ అన్నాడు. ‘నన్ను లోకములో గొప్పవాడిగా చెయ్యి’ అని అడిగాడు. “నీవు ఇంక అహంకారముతో ప్రవర్తించకు. ఏ నవగ్రహములు అయితే మేరువు చుట్టూ తిరుగుతున్నాయో అటువంటి నవగ్రహములను కవచంగా కట్టుకున్న నేను స్వయంగా వచ్చి నీ శిఖరమును అధిరోహిస్తాను’ అని చెప్పి శంకరుడు వింధ్యుడిని అనుగ్రహించాడు. అపుడు వింధ్యుడు ‘ప్రభూ! దానిని నీ అనుగ్రహంగా భావిస్తాను అహంకరించను’ అని ఆ వింధ్య పర్వత శ్రేణి మీద పరమాత్మ అన్ని చోట్లా ఒక్క స్వయంభూలింగంగా వస్తే వింధ్య పర్వత శిఖరముల మీద స్వామి రెండు స్వయంభూ లింగములుగా వచ్చాడు. ఒకటి ‘ఓంకార లింగము’, ఒకటి ‘అమలేశ లింగము’ ‘ఓంకారమమలేశ్వరం’ అంటాము. ఆ వెలయడం మాంధాతృపురంలో వెలశాడు. ఓంకారం అంటే ప్రణవము. ప్రణవము మోక్ష దాయకము. వింధ్యగిరి మీదికి వెళ్లి దర్శనం చేసిన వారికి మోక్షం వస్తుంది. పక్కన అమలేశుడు ఉన్నాడు. మనందరి యందు ఆనవ మలము, కార్మిక మలము, మాయక మలమని మూడు రకములయిన మలములు ఉంటాయి. స్నానం చేసినా ఈ మూడూ వదలవు. ఈశ్వరుడు ఈ మూడు మలములకు అతీతుడు. మీకు ఈ మూడు మలములకు అతీతమయిన స్థితిని ఇచ్చి , తానే స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మిమ్మల్ని ఎత్తగలిగినవాడు ఓంకారేశ్వరుడు. కోరిన సమస్త కోరికలనూ తీర్చగలిగిన వాడు. ఆయన నిరంతర ఆనంద స్వరూపుడు. అడిగినది ఏదయినా ఇవ్వగలడు. ఆయన అమరేశ్వరుడిగా, ఓంకారేశ్వరుడిగా ఉన్నాడు. ఇద్దరుగా అక్కడ వెలసి శంకరుడు నిరంతరము జనులకు శుభములను ఇస్తూ ఆ కొండమీద వెలసి ఉన్నాడు. అలా వెలసిన అమలేశ్వరుణ్ణి శంకర భగవత్పాదులు ఒక అద్భుతమయిన శ్లోకముతో ఆరాధన చేస్తారు. మనం అమరేశ్వర లింగమును చూసినప్పుడు ఆ భావనను మనస్సులో తెచ్చుకోవాలి. అమలేశ్వర లింగమును, ఓంకారేశ్వర లింగమును చూసి తత్త్వ విచారణ రీత్యా మీ మనస్సు లోపలి తెచ్చుకోవాలి శంకరులు అంటారు
ఆకాశ శ్చికురాయతే దశదిశాభాగో దుకూలాయతే
శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే,
వేదాంతో నిలయాయ తేసువినయో యస్యస్వభావాయతే
తస్మి న్మే హృదయం సుఖేనరమతాంసాంబే పరబ్రహ్మణి!!
‘సాంబే’ అంటే ‘స అంబే’ – అమ్మతో కూడుకున్న అయ్యా ! ఓ శంకరా నీవు పరబ్రహ్మవు. నీవు అమలేశ్వరుడవు. మూడు మలములకు అతీతమై ఉన్న నీవు లింగముగా కనపడుతున్నావు. నీవు నాతో వచ్చినప్పుడు నీవు ఆకాశస్వరూపుడవై ఉన్నావు. నీవు దిగంబరుడవు. పది దిక్కులు కలిసి నీకు వస్త్రము అయ్యాయి. దిక్కులను అంబరముగా కట్టుకున్నవాడవు. చంద్రరేఖను ఆభరణముగా కలిగిన వాడవు. ఎప్పుడూ ఆనందమయ స్వరూపుడవై ఉంటావు. వేదముల చివరి భాగములయిన ఉపనిషత్తులయందు చెప్పబడుతుంటావు. వినయముతో నిన్ను తలుచుకుంటే చాలు మమ్మల్ని ఉద్ధరించడానికి వస్తావు’.
facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి