7, నవంబర్ 2022, సోమవారం

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 66 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


స్వాయంభువ మన్వంతరంలో మీరిద్దరూ (దేవకీ వసుదేవులు) ఒక ప్రజాపతి, ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు. ఆమె పేరు పృశ్ని. మీరిద్దరూ ఆకులు అలములు తింటూ పన్నెండు వేల దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షం అయి ‘ఏమి కావాలి?’ అని అడిగాను. మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది. ‘నీలాంటి కొడుకు కావాలి’ అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేదు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒకమారు అడిగితే నేను మూడుమార్లు పుట్టాను. ఒకసారి నేను పృశ్నికి పృశ్నిగర్భుడుగా, రెండవమారు అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా ఇప్పుడు కృష్ణభగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉన్నది. అంతరార్ధం తెలిసినా తెలియకపోయినా నా కథ విని, నన్ను స్మరిస్తూ, నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షమును పొందండి’ అన్నాడు.

ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక రహస్యం చెప్పాడు. ఈ విషయములు వసుదేవునకు అంతరమునందు ద్యోతకం అయ్యాయి. పరమాత్మ ఈ విషయమును బాహ్యమునందు చెప్పలేదు. ‘ఇదే సమయమునందు యమునానదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా శక్తి స్వరూపమయిన యోగమాయ యశోదాదేవి గర్భమునందు ఆడపిల్లగా జన్మించింది. నీవు నన్ను తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మరల అక్కడనుంచి ఆడపిల్లను తెచ్చి దేవకి ప్రక్కన పడుకోబెట్టు’ అన్నాడు.

వెంటనే వసుదేవుని కాళ్ళు, చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపోయాయి. ఈ పిల్లవాడిని తీసి గుండెలమీద పెట్టుకున్నాడు. చాలామంది తలమీద పెట్టుకున్నారు అంటారు. పోతనగారి భాగవతంలో అలా లేదు. గుండెల మీద పెట్టుకున్నాడనే ఉన్నది. ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ద్వారమునకు ఉన్న ఇనుప గొలుసులు, తాళములు, మేకులు అన్నీ ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి ఆయన మీద నీడపట్టి శేషుడు వస్తున్నాడు. బయటకు వచ్చాడు ఆకాశం అంతా నల్లటి మబ్బుపట్టి ఉన్నది. గాఢాంధకారము. శ్రావణమాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. విపరీతమయిన వేగంతో ప్రవహిసస్తున్న యమునానది దగ్గరికి వెళ్ళాడు. వసుదేవుడు పరమాత్మను గుండెలమీద పెట్టుకుని యమున వంక చూశాడు.

కృష్ణభగవానుని గుండెలమీద పెట్టుకున్న వసుదేవుని చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటు యిచ్చిన సముద్రములా యమున చోటిచ్చింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టినా ఎవరికీ తెలియదు. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ పిల్లను ఎత్తుకుని మళ్ళీ తిరిగివచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ద్వారములు మూసుకున్నాయి. ఇనుపసంకెళ్ళు పడిపోయాయి. వసుదేవుడు ఆ ఆడపిల్లను దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. వసుదేవుడు కృష్ణపరమాత్మను గుండెలమీద ధరించాడు. అనగా వసుదేవుడు లోపల ఉన్న ఆత్మస్వరూపమును తెలుసుకున్నాడు. ఆయన హృదయగ్రంథి విడిపోయింది. అందుకే ఆడపిల్లను వదలమని వసుదేవుడు ఏడవడు దేవకి ఏడుస్తుంది. ఇంకా విష్ణుమాయ దేవకియందు ఉన్నది. తల్లి కాబట్టి ఉండాలి లేకపోతే కంసునికి అనుమానం వస్తుంది.

ఈ ఆడపిల్ల ఏడ్చింది. అక్కడ వున్న వాళ్ళందరూ లేచారు. పిల్ల పుట్టిందని అనుకున్నారు. ముందుగా తాళం కప్పలమీద రాజముద్ర ఉన్నదీ లేనిదీ చూశారు. రాజముద్ర ఉన్నది. లోపలి వాళ్ళు ఎక్కడికీ వెళ్ళలేదు. వసుదేవుడు అలా కూర్చుని ఉన్నాడు. భటులు పిల్ల ఏడుపు విని కంసుని వద్దకు పరుగెత్తుకు వెళ్ళి విషయం చెప్పారు. చెప్పగానే నిద్రపోతున్న వాడు పరుగెత్తుకుంటూ చెరసాలకు వచ్చి తాళములు తీశాడు. ఆడపిల్ల ఏడుస్తుంటే దేవకీ దేవిని విష్ణుమాయ కప్పేసింది. ఆ ఆడపిల్లే తనపిల్లే, తానే రక్షించుకోవాలని అనుకుని అన్నగారికి కనపడకుండా ఆ పిల్లను పమిటలో పెట్టుకున్నది. ‘అన్నయ్యా! ఇది చంపివేయడానికి మేనల్లుడు కాదు మేనకోడలు. నన్ను నమ్ము ఆరుగురిని చంపేశావు. ఏడవది గర్భస్రావము అయింది ఇది ఆడపిల్ల. ఇంటికి ఆడపడుచు నీకు కోడలు. నువ్వు మన్నన చేయాలి. పసిపిల్లయిన దానిని చంపాడన్న అపఖ్యాతిని నువ్వు కట్టుకోవద్దు. ఈ పిల్లనయినా బ్రతకనివ్వు. చంపవద్దు ’ అని ఏడుస్తూ వేడుకున్నది.

కంసుడు మహోగ్రంగా సోదరిని నిందించి పసిపిల్ల రెండు కాళ్ళు పట్టుకు లాగేసి గిరగిర త్రిప్పి బండకు వేసి కొట్టాడు. ఈ పిల్ల బండకు తగలడం మాని ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైన రథమునందు ఆరూఢయై కూర్చుంది. అటునుంచి విమానములలో దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు ఆమెకు వరం ఇచ్చాడు. ‘నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పదునాలుగు నామములతో పిలుస్తారు. భాగవతాంతర్గతంగా ఎవరైతే ఈ నామములు వింటున్న వాళ్ళందరినీ దేశంలో ఎక్కడెక్కడ వున్నా నీవు రక్ష చేస్తావు’ అన్నాడు. ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపములు సమర్పిస్తున్నారు. నైవేద్యములు సమర్పిస్తున్నారు. ఆ తల్లి అవన్నీ తీసుకుని క్రింద ఉన్న కంసుని చూసి ‘ఓరీ దుర్మార్గుడా! పిల్లలందరినీ రాళ్ళకు వేసి కొట్టి చంపావు. నన్నుకూడా కొట్టాలని ప్రయత్నం చేశావు. నాతోపాటు పుట్టి నిన్ను చంపేవారు వేరొక చోట పెరుగుతున్నాడు. నీవు చనిపోవడం ఖాయం’ అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది.

వెంటనే కంసుడు పరుగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉండమని చెప్పి వాళ్ళను పంపించి వేశాడు.

అవతల నందవ్రజంలో ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కృష్ణపరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. పిల్లవాడేమీ ఏడవలేదు. యశోద పొంగిపోయింది. నంద వ్రజం భగవద్భక్తులతోనూ, గోవులతోను నిండి ఉంటుంది. గోపకాంతలు మహా సంతోష పడిపోతు చూచివద్దామని యశోద గృహమునకు వెళ్ళారు. బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు ‘అబ్బ పిల్లవాడు ఎంత బాగున్నాడే!’ అని పరవశించిపోతున్నారు. బయట నందప్రభువు పొంగిపోతున్నాడు. బ్రాహ్మణులను పిలిపించి గోవులను దానం ఇచ్చాడు. గొప్ప గొప్ప మేలిమి వస్త్రములు దానం ఇచ్చాడు. పిల్లవాని జాతకము చూసి ఎలా ఉంటాడో చెప్పవలసింది అని వారిని అడిగాడు. ఆ పిల్లవాని జాతకం చూసి ‘లేక లేక పుట్టిన నీ కుమారుడు గొప్ప లక్ష్మీ సంపన్నుడవుతాడు లక్ష్మీదేవి వీనిదే. ఎటువంటి వీరులనయినా ఓడిస్తాడు. గొప్ప దీర్ఘాయుర్దాయమును పొందుతాడని చెప్పారు. పిదప ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. అక్కడకు వచ్చిన వాళ్ళలో వృద్ధ స్త్రీలను పిలిచి కృష్ణ పరమాత్మకు నీళ్ళు పోయమని అడిగారు. లోకములన్నింటిని ప్రళయం చేసేయ్యాలనుకున్నప్పుడు నీళ్ళలో ముంచేసి తాను మాత్రం ఒక మర్రి ఆకుమీద ఏమీ తెలియనివాడిలా బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్రశాయి ఏమీ తెలియని వాడిలా ఈ వృద్ధ గోపకాంతల తొడల మీద పడుకొని నీళ్ళు పోయించుకొని ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్లు పడుకున్నాడు దొంగకృష్ణుడు. ఆఖరుకి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఓ ఉయ్యాలలో పడుకోపెట్టారు.

పూతన సంహారం

కంసుడు అష్టమగర్భమును తాను సంహరించగలనని ఎన్నో ప్రయత్నములు చేశాడు. ఎన్ని ప్రయత్నములు చేసినా అష్టమగర్భం జారిపోయి ఇంకొకచోట పెరుగుతోంది. తన మృత్యువును ఏ ప్రయత్నము చేత అధిగమించలేకపోతున్నాడు. ఈ సత్యమును కంసుడు అంగీకరించి ఉంటే కంసుడి జీవితం వేరొకరకంగా మారి ఉండేది. కంసుడు రాత్రి నిద్రపోయి ఉదయముననే తన మంత్రులను పిలిచి ‘మీరు అందరూ చూసారు. నిన్న నేను ఆ బిడ్డను చంపబోయాను. ఆవిడ వెంటనే స్త్రీగా మారిపోయి పైకి వెళ్ళి నీవు తొందరగా మరణించబోతున్నావు. నిన్ను చంపేవాడు నాతో కలిసి పుట్టి వేరొకచోట పెరుగుతున్నాడు’ అని చెప్పింది. నాకు కొంచెం భయంగా ఉన్నది’ అన్నాడు.

కంసుని చుట్టూ ఉన్నవాళ్ళు ‘రాజా! ఈ మాత్రం డానికే భయపడి పోతావేమిటి? మీ ధాటికి ఆగలేక దేవతలందరూ దాక్కుని ఉన్నారు. మీ శక్తి మామూలుది కాదు. మీరు మాకు ఒక్క ఉత్తరువు ఇచ్చారంటే మేము అంతటా తిరిగి కొత్తగా పుట్టిన పిల్లల దగ్గరనుంచి పళ్ళు వస్తున్న పిల్లల వరకు అందరినీ చంపేస్తాము’ అన్నారు. నీ ప్రధాన శతృవు శ్రీమహావిష్ణువు. గతంలో నీవు కాలనేమిగా ఉండగా నిన్ను సంహరించాడు. నీకు రహస్యం చెపుతాను విను. ఇప్పటికి కూడా పిల్లవాని రూపంలో వచ్చి నిన్ను విష్ణువే చంపుతాడు. విష్ణువు మూలమును తీసివేయాలి. ప్రబలంగా విష్ణువు ఎక్కడ ఉంటాడో దానిని తీసివేయాలి’

ఎవరెవరు సత్యం మాట్లాడుతున్నారో, ఎవరు జపం చేస్తున్నారో, ఎవరు ఈశ్వరుని నమ్ముతున్నారో, ఎవరు ప్రశాంతముగా ఉంటున్నారో, ఎవరు తపస్సు చేస్తున్నారో, ఎవరు అగ్నికార్యం చేస్తున్నారో, ఎవరు వేదం చదువుకుంటున్నారో, ఎక్కడ ఆవులు ఉన్నాయో, ఎక్కడ దూడలు ఉన్నాయో, ఎక్కడెక్కడ హోమములు జరుగుతున్నాయో, వీటినన్నింటిని నాశనం చేసేస్తే విష్ణువనేవాడు లేకుండా పోతాడు. మనకు శత్రువు ఉండడు. వీటినన్నిటిని నాశనం చేస్తాము మాకు అనుజ్ఞ ఇవ్వండి’ అన్నారు. నందవ్రజంలో కృష్ణభగవానుడు పెరుగుతున్నాడు. ‘అజాయమానో బహుధా విజాయతే’ అని వేదం అంటోంది. జన్మించ వలసిన అవసరం లేనివాడు అనేకమయిన జన్మలను పొందుతున్నాడు. అటువంటి వానికి జాతకర్మ చేస్తున్నారు. ఆయన కన్నా ముందు ఉన్నవాడు ఎవడూ లేడు. ఆయన తర్వాత ఉండేవాడు లేదు. ఆయన ఎప్పుడూ తల్లిపాలు త్రాగి ఎరుగడు. అటువంటి వాడు ఈవేళ ఆశ్చర్యంగా యశోదాదేవి ఒడిలో పడుకొని పాలు త్రాగుతున్నాడు. పరబ్రహ్మము అనుగ్రహం ఎంత ఆశ్చర్యం! ఆ యశోద ఎంత పుణ్యం చేసుకున్నదో కదా! ఆనాడు పాలిచ్చి పెంచింది. ఈనాడు కూడా ఆ యశోదను చూడాలనుకుంటే వేంకటాచలంలో వేంకటరమణుని సన్నిధానంలో ఇప్పటికీ పిల్లవాడికి అన్నీ జాగ్రత్తగా అందుతున్నదీ లేనిదీ చూస్తూ వకుళమాతగా కూర్చుంది. ఆయనకు హానీ తెలియదు, వృద్దీ తెలియదు. ఒకనాడు ఉండడం, ఒకనాడు లేకపోవడం, పెరగడం, తరగడం లాంటివి ఉండవు. అలాంటివాడు ఆశ్చర్యంగా రోజురోజుకీ అమ్మ ఒడిలో పెరుగుతున్నాడు. ఎంత తపస్సు చేసినా చూడడానికి వీలుకాని మూర్తి ఇవాళ ఏమీ చేతకాని గోపకాంతల ఇళ్ళల్లో పెరిగి పెద్దవాడయి ఆడుకుంటున్నాడు. నందవ్రజంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళి వారు నైవేద్యం పెట్టనవసరం లేకుండా తానే అడిగి తినేవాడు. ప్రత్యక్ష కైంకర్యం ఎంత అదృష్టం. ఎంత చదువుకున్నా బ్రహ్మము ఎలా వుంటుంది అంటే చెప్పడం కుదరదు.

‘యతోవాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహా’

మనస్సు, వాక్కు ఇంకా మేము పరబ్రహ్మము గురించి చెప్పలేమని ఎక్కడ తిరిగిపోయాయో అక్కడ పరబ్రహ్మము ఉన్నది. ఏ చదువు కూడా చెప్పలేని ఆ పరబ్రహ్మము ఇవాళ ఆ గోపకాంతల ఇంట్లో ఒక స్వరూపమై పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇది పరమాత్మ కారుణ్యము. ఏదయినా ఈశ్వరానుగ్రహంలో నుంచే వస్తుంది.



https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...


instagram.com/pravachana_chakravarthy

కామెంట్‌లు లేవు: