మేలుజాతి గుఱ్ఱములు - వాటి ఆయుఃప్రమాణము .
* అప్పుడే కొత్తగా ముందరి దంతములు కనిపించుచున్న గుఱ్ఱము యొక్క వయస్సు నెలరోజులు . ముందరి దంతములు కొంచం లావుగా అయ్యి కొంచం పొడువు పెరిగిన దాని వయస్సు రెండునెలలు అని కనుగొనవలెను.
* కొత్తగా మధ్యలో దంతములు కనిపించుచున్న దాని వయస్సు 3 నెలలు అని గమనించవలెను. ఆ దంతములు స్పష్టంగా కనిపించినచో నాలుగు నెలలు . మిగిలిన దంతములు వచ్చిన గుర్రము యొక్క వయస్సు 8 నెలలు .
* ఆ దంతములు ఎరుపు రంగులో మారిన ఆ గుర్రము యొక్క వయస్సు రెండు సంవత్సరాలు . గుఱ్ఱముకి పుర్తిగా దంతములు రావడానికి 5 సంవత్సరాల సమయం పట్టును.
* గుర్రముకి 5 సంవత్సరాలు వచ్చు సమయంలో దంతములు తెల్లగా అవ్వుట , స్థిరచిత్తము కలుగుట , కన్నులు దృష్టి స్పష్టంగా కనిపించుట , బలం , శరీరము నందు తేజస్సు అధికముగా అవ్వుట జరుగును.
* గుర్రము యొక్క బాల్యదశ 5 సంవత్సరములు . గుర్రము యొక్క జీవితకాలం 32 సంవత్సరాలు .
* గుర్రము యొక్క శరీరం పైన సుడులు 10 ఉండవలెను. 10 కంటే తక్కువ అయిన ఆ అశ్వము అల్పజీవి అగును. అంతేకాక ఆ గుర్రము యొక్క యజమానులకు కూడా కీడుగల్గును.
* తల చిన్నగా ఉన్న గుర్రము అనేక చిక్కులను ఎదుర్కొని 5 సంవత్సరముల లోపలనే మరణించును. అలా జరగనిచో 5 సంవత్సరములలోపు ఆ గుఱ్ఱముని పాలించు యజమాని మరణించుట తధ్యం.
* మెడమీద జూలు నందు సుడి , దేవమణి ఆకారంలో సుడి కలిగిన అశ్వము యజమానికి శుభం చేకూర్చును .
* ముట్టెయందు , కేశాంతము నందు , నోటికి ఇరుపక్కలా ఉండు మూలలయందు సుడులు కలిగిన అశ్వము యజమాని సకలశుభాలు ఇచ్చును.
* ముందరి కాళ్ళకి సుడులు కలిగియున్న అశ్వమును బాహువర్తతు రంగమనబడును.ఈ అశ్వమును పాలించు అధికారి యుద్ధములు యందు విజయాన్ని సాధించును.
* పద్మము , కులిశము , చెంబు , చామరం , తోమరము , చక్రము , రోకలి , మొగ్గ , శంఖువు , చంద్రుడు , మణి ఖడ్గము మొదలగు ఆకారాలలో తెల్లని బొల్లి ఉండుట మంచిది .
* శూలము , అరదండము ఆకారాలలో మరియు నీలివన్నె పచ్చ రంగు కలిగిన బొల్లులు ఉండరాదు. అందువలన కీడు సంభవించును. తలయందు , క్రింద పెదవి యందు , ముక్కు పైన బొల్లి ఉండరాదు.
* ఎక్కువ , తక్కువ దంతములు కలిగినది , పిల్లి కండ్లు కలిగినది , ఒక కన్ను దృష్టి కలిగినది , ఒక బీజము కలిగినది , పిల్లిచెవులు కలిగినది , రెండు పిల్లలని ఈనే గుర్రము , పెద్ద పెద్ద గిట్టలు కలిగినది మున్నగు దోషములు కలిగిన అశ్వములును పెంచరాదు.
* నాలుగు కాళ్ళ యందు తెలుపు కలిగిన అశ్వము ని పంచకళ్యాణి అందురు . అది తన యజమాని కి సర్వదా జయము కలిగించును.
* నాలుగు కాళ్ల ను , చెవుల యొక్క కొనలను , తోకయును , ముఖము పైన వక్షస్థలం పైన తెల్లని రంగు కలిగియున్న అశ్వముని "యష్టమంగళి " అనుదురు . ఆ గుఱ్ఱమును పాలించువాడు ధరణిని యేలును .
* గుర్రముని అధిరోహించు సమయమున అగ్నిని , వాయుదేవుని దలచుకొని అధిరోహించవలెను.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి