మనం బ్రతికినంత కాలం, కంఫర్టబుల్ గా బ్రతుకుతాం, మాకేంటి? అని అనుకోవద్దు. ఈ ఆరోగ్యం ఎల్లకాలం ఇలాగే నిల్చి ఉండదు. అనారోగ్యానికి గురవ్వక తప్పదు. ప్రపంచాన్ని వీడక తప్పదు. మన ధనం మనకు అన్నం పెట్టదు.
మనకు పునర్జన్మ మీద ఉత్తర గతులమీద ప్రగాఢ మైన విశ్వాసం ఉంది. మన జీవన విధానం ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. ఇక్కడ బంధాలు అనుబంధాలు ప్రేమలు కట్టుబాట్లు పుణ్య పాప చింతన, చిన్నతనం నుంచి దైవ భక్తి, దేశ భక్తి ఉండే దేశం. ఎంతమంది ఎన్ని సంవత్సరాలు పరిపాలించినా, మన సంస్కృతి నుంచి, మనల్ని మరల్చలేక పోయారు.
అమెరికన్ స్టైల్ ఆఫ్ లివింగ్ అన్న పేరుతో పెళ్లి పెటాకులు లేకుండా తిరిగే సంస్కృతి మనకొద్దు. ధనసంపాదనే ధ్యేయంగా పెట్టుకుని మన పిల్లల్ని విదేశాల్లో శాశ్వతంగా ఉండేలా చేయవద్దు. మనం ఎన్నటికీ దిక్కులేని వారిగా కాకూడదు. మన ఆడబిడ్డలు మగాళ్లు లా, మగాళ్లు ఆడవాళ్ళు లాగా మసలే పరిస్థితి రాకూడదు. ఆడవాళ్ళు చదువుకోవచ్చు. ఉద్యోగాలు చేయవచ్చు. కానీ సగం సగం బట్టలు కట్టుకుని, గుప్తంగా ఉంచవలసిన సౌందర్యాన్ని, వెల్లడి చేస్తూ, అలాగే ఉద్యోగాలు చేసే పురుషులు వంటలు వండి పెట్టే పద్ధతి మనకు రాకూడదు. స్త్రీ వండి వడ్డించే దాంట్లో ఉండే సౌందర్యం పురుషులు చేస్తే అందం ఉండదు. పరిమితమైన, అర్ధవంతమైన స్వేచ్ఛ ఉండాలి. మన పురాణాలు ఇతిహాసాలు మనం చదివి వాటి ఉనికిని చాటాలి. ఇతర దేశాలకు వెళ్లిన వెళ్ళవచ్చు. కానీ కష్టమో సుఖమో తిరిగి భారతదేశానికి రావాలి.
తల్లి తండ్రుల చివరి స్టేజ్ లో, వారి వద్దనే ఉండి, ఉత్తర క్రియలు చేయాలి. పితృదేవతలకు వంశాభివృద్ధి కై, చేయవలసిన శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉండాలి. ధనంతో ఏదైనా కొనగలము అనే భ్రాంతి నుండి బయటకు రావాలి. మన తెలివి, శక్తి, యుక్తి మనదేశాభి వృద్ధి కి మాత్రమే వినియోగించాలి. వేనోళ్ళ కొనియాడబడే ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే భావితరాలకు దిక్కు అవాలి. మనందరం భారతీయులం. ఏ నాడూ ఇతర దేశాలను పొగడొద్దు. మనల్ని మనం కించపరిచేలా వ్యాఖ్యలు చేయవద్దు. ఒకనాటి మన సంపదను దోచుకుని ఈనాడు ఈ ఇతర దేశాలు ఈనాడు సంపన్న దేశాలుగా చెలామణి అవుతున్నాయి. మాతృ భక్తి పితృ భక్తి దేశ భక్తి అంటే ఏమిటో మననుంచి తెలుసు కోవాలి. అనేక ఇతర దేశాలు కలిస్తే ఒక అమెరికా ఒక ఇంగ్లాండ్ అయ్యాయి. కానీ భారత దేశం వేద కాలం నాటికి ఈనాటికీ కూడా, ఏ ఇతర దేశాలు కలవని అఖండమైన భారతదేశం.
మన వేదాలలో చెప్పబడినది ఏమిటంటే, పుడితే మానవుడు గా పుట్టాలి. అందునా భారతదేశం లో పుట్టాలి అని. కడకు దేవతలు కూడా ఈ భారత దేశంలో పుట్టాలి అని కోరుకుంటారుట.
ఇది వేద భూమి. కర్మ భూమి. పునరాగతి రహితమైన జన్మ కోసం భారతీయులుగా మన చింతన సాగిద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి