18, ఏప్రిల్ 2023, మంగళవారం

కుంకుమ పువ్వు

 కుంకుమ పువ్వు  - సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు . 


        కుంకుమ పువ్వుని సంస్కృతము నందు కాశ్మీరజము , కుంకుమము , బాహ్లీకము , శోణితము , సంకోచము , పీతనకము అనే పేర్లతో పిలుస్తారు . భావప్రకాశము అనే ప్రాచీన ఆయుర్వేద గ్రంథము నందు కుంకుమపువ్వు యొక్క నాణ్యత మరియు ఔషధగుణములు ఆయా దేశ వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది అని తెలియచేయబడినది. వానిలో కాశ్మీర దేశము నందు పుట్టెడు కుంకుమపువ్వు చిన్నచిన్న కేశరములు కలిగి కొంచం అంత ఎరుపురంగుతో కూడుకుని కమలం వంటి పరిమళము కలిగి ఉండును అనియు ఇదే అత్యంత శ్రేష్టం అని రాయబడినది.


           ద్రవ్యకోశము అనే వైద్యగ్రంధము నందు లేత ఎరుపురంగుతో , మంచి పరిమళముతో , చేతితో నలిపిన చేతికి అంటుకొని రంగువీడక యున్నచో అట్టి కుంకుమ పువ్వు శ్రేష్టం అయినది అనియు , బాగా ఎరుపు రంగుతో ఉండి నోటియందు వేసుకొనిన మిక్కిలి చేదుగా , పసుపుపచ్చ రంగుతో ఉన్నచో అట్టి కుంకుమపువ్వు తక్కువరకము అని తెలుసుకొనవలెను . 


                        కుంకుమపువ్వు సాధారణముగా కొంచం చేదు కలిగి ఉండి నాలుకకు తిమ్మిరి కలిగించునదిగా మెత్తగా ఉండును. ఇది జిగటగా ఉండును. కొంతమంది ఈ కుంకుమపువ్వుని చందనంతో అరగదీసి పైపూతగా వాడుదురు . మరికొంతమంది తాంబూలముతో లోపలికి సేవించెదరు. శరీరం నందు వేడిని పుట్టించి వీర్యవృద్ధిని , కాంతిని , బలము , ఆయుర్వృద్దిని కలిగించి విషము , శోష , మదప్రకోపము , నేత్రవ్యాదులు , శిరోవ్యాధులు , గొంతుజబ్బులు , శరీరము నందలి మచ్చలు , దురదలు , కుష్టు , చిడుము , గజ్జి మున్నగు చర్మరోగములు , రసదోషములు , మేధోరోగములు మొదలైనవానిని హరించును . రక్తశుద్ది కలిగించి  శరీర దుర్బలత్వము  హరించును . గడ్డలను కరిగించును . చర్మరోగములు మాన్పును . కస్తూరి వలే ఏ ఔషధమునకు అయినను అనుపానంగా ఇచ్చిన ఔషధం త్వరగా పనిచేయును . టైఫాయిడు జ్వరము , ఉన్మాదరోగము , అపస్మారము , ప్రసవించు సమయంలో సంభవించు వాతరోగములు , ఋతురక్తబద్ధం , సమస్త నేత్రరోగములు ( కంటి పైన పట్టు వేయవలెను ) , ఓడలలో ప్రయాణము చేయువారికి వచ్చు జబ్బులు , మనోచాంచల్యములు పోగొట్టును . 


  గమనిక  - 


     మితిమీరిన మోతాదులో తీసుకున్నచో రక్తము విరిచి అమితమగు వేడి పుట్టించి దౌర్బల్యము కలిగించును. కొన్నిసార్లు స్త్రీల గర్భకోశము పాడుచేయును . కుంకుమపువ్వు పుచ్చుకోదగిన ప్రమాణము 5 మొదలు 15 గోధుమగింజల ఎత్తు మాత్రమే . 


          మరింత సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


కామెంట్‌లు లేవు: