9, ఏప్రిల్ 2023, ఆదివారం

శ్రీశైల పర్వతం మీది రహస్య మూలికా విశేషాలు

 శ్రీశైల పర్వతం మీది రహస్య మూలికా విశేషాలు  -


            ఇప్పుడు మీకు నేను వివరించబోయే విశేషాలు అన్నియు నిత్యసిద్ధనాధుడు రచించిన రసరత్నాకరం అనే ఒక ప్రాచీన గ్రంధం నుంచి తీసుకోవడం జరిగింది.


          శ్రీశైల పర్వతంలోని చెట్లు, మన్ను, దుంపలు , నీరు , రాళ్లు , ఖనిజాలు మొదలయిన వాటితో అతిశీఘ్రంగా కాయసిద్దని పొందే మార్గాలు పరమ శివునిచేత చెప్పబడి భారతీయ రసశాస్త్రాలలో మహా గోప్యంగా ఉన్న వాటిని మాత్రమే సాధకులకు భక్తులకు ముక్తి, భక్తి ప్రధములుగా వివరిస్తున్నాను అని నిత్యనాధుడు తన ముందు మాటలో వివరించాడు.


   

   ప్రస్తుత పరిస్థితులలో నిత్యనాద సిద్ధుడు తన గ్రంధంలో వివరించిన ప్రకృతి పరిసరాలు చాలా మారిపోయాయి. ప్రయత్నిస్తే కొంతవరకు కనుక్కోవచ్చు.


  *   శ్రీ మల్లిఖార్జున స్వామి సన్నిధికి ఎదురుగా ఏనుగుతో సమానం అయిన శిల ఒకటి ఉన్నది. అది రాత్రి సమయంలో ఎల్లప్పుడు గుగ్గిలం వంటి పదార్థాన్ని స్రవిస్తుంది. దానిని ముట్టుకోనుకుండా బ్రహ్మవ్రుక్షం అయిన తెల్ల మోదుగ కొయ్యతో గీకి ఎండబెట్టిన సొరకాయ బుర్రలో నిలువ చేసుకోవాలి ఆ గుగ్గిలం తో సమాన తూకంగా శుద్దిచేసిన గంధకం కలపాలి. ఆ మిశ్రమాన్ని రొజూ ఒకపూట విష్క మెత్తు మోతాదుగా భక్షిస్తూ ఉండాలి.ఇలా ఒక నెలరోజులు భక్షిస్తూ ఉంటే ఆ వ్యక్తి జరామరణాలు లేనివాడై ఆచంద్రార్కం జీవిస్తాడు.


          అదే గుగ్గిలాన్ని కరిగిన తామ్రంతో కోటికొక వంతు చొప్పున వేస్తే అది దివ్యమైన బంగారం అవుతుంది.


 *  మల్లిఖార్జున స్వామికి ఎడమ దిక్కున ఘంటా సిద్దేశ్వరుని ఆలయం ఉంది. దాని ద్వారం నందు గల ఒక కుండములో ఒక గంట వ్రేలాడుతూ ఉంటుంది. కృష్ణ చతుర్దశి నాటి రాత్రి యందు ఉపవాసమున్న ముగ్గురు సాధువులు నిరంతరంగా నిర్వికల్పంగా చేయవలసిన సాధన ఇది. అదేమంటే ముగ్గురు సాదువుల్లో ఒకడు నిరంతరంగా శివుడిని అభిషేకం చేస్తూ ఉండాలి. రెండోవాడు అలసిపోకుండా రాత్రి అంతా అభిషేకానికి నీరు అందిస్తూ ఉండాలి. మూడోవాడు విరామం లేకుండా గంట వాయిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే తెల్లవారేసరికి ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యి ఆ ముగ్గురికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు.మరియు అదృశ్య శక్తిని కూడా ప్రసాదిస్తాడు.


 *  ఘంటా సిద్దేశ్వరుని ఆలయానికి దక్షిణభాగంలో క్రోసేడు దూరంలో నేలలో తవ్వితే గోరోజనం వంటి మట్టి లభిస్తుంది. ఆ మట్టిని తులం ప్రమాణంలో పాలలో కలిపి పంచదార కలుపుకుని తాగితే 7 దినాలలో ఆ వ్యక్తికీ అమరత్వం సిద్ధించి మృత్యువుని జయించగలడు.


 *  మల్లినాదునికి పశ్చిమ దిక్కులో చంద్రోదకం అనే పేరు గల ఒక తీర్ధం ఉంది. విశాక పౌర్ణమి నాడు సాధకుడు దాని సమీపంలో ఉండి సిద్ధిని సాధించాలి. రాత్రిపూట ప్రతిరోజూ జపం చేస్తూ ఉండాలి. అర్ధరాత్రి పూట ఏ సమయంలో చంద్రుడు ఆ నీటిని తాకుతాడో అదే సమయంలో ఆ నీటిని దోసిలి పట్టుకొని తాగాలి. దానివల్ల వజ్రకాయం , శరీర పటుత్వం కలుగుతాయి. జరామరణాలు లేనివారై జీవిస్తారు.


            మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

కామెంట్‌లు లేవు: