🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 72*
పాంచాల రాజ్యమంతటా వున్నట్టుండి వదంతి ఒకటి వ్యాపించింది.
'రాజధాని వృషపాల నగర సమీపంలో ఉన్న ఒక వనంలో రాజకుమారుడు ఒకడు నిద్రిస్తుండగా సింహరాజమొకటి వచ్చి అతని శిరస్సును స్ప్రుశించి వెళ్లి పోయిందట....' ఆ పుకారు క్షణాల్లో నగరమంతటా వ్యాపించింది. "ఎవరా రాజకుమారుడు ? అతనిది ఏ రాజ్యము ?" అంటూ జనులు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
ఆ మన్నాడు మరొక ఉదంతం నగరమంతటా వ్యాప్తి చెందింది. ' క్రితం రోజు సింహం చేత ఆశీర్వాదం పొందిన రాకుమారునికి మదగజేభం వొకటి మోకరిల్లి అభినందనాలు సలిపి అతనిని తనపై ఆశీనుని గావించుకున్నదంట..'
అలా చాణక్య శిష్యులు పుకారులను వ్యాపింప చేస్తున్న సమయంలో చాణక్య చంద్రగుప్తులు వృషపాలనగరంలో ప్రవేశించారు. చాణక్యునిచే ముందుగానే పథకం ప్రకారం నియమితుడైన శిష్యుడు ఆగమసిద్ధి వారి వెనక అనుసరిస్తూ..
"ఆహా ! ఏమి ఆ దర్జా... ! ఏమి ఆ రాజఠీవి... ! భావి భారత సార్వభౌముని లక్షణాలు ఈ రాకుమారుని వదనంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. సింహస్పర్శ, గజవాహనం సందర్భాల్లో నేను చూసింది ఈ యువకుడినే..." అంటూ దారి పొడుగునా కనిపించిన వాళ్లకందరికీ చెప్పసాగాడు. పాంచాల పౌరులందరూ వీధుల వెంబడి గుంపులు గుంపులుగా చేరి గురుశిష్యులను వింతగా చూడసాగారు.
ఆ వార్త క్రమక్రమంగా పాంచాల ప్రభువు పురుషోత్తముడికి చేరింది. అదే సమయంలో చాణక్య శిష్యుడైన శార్జరవుడు రాజదూతోచితమైన దుస్తులను ధరించి పురుషోత్తముని దర్శించి "పాంచాల భూపతులకు జయము... జయము... మగధ సింహాసనా వారసులు, మహానందుల వారి కుమారులు మౌర్య చంద్రగుప్తుల వారు తమ గురుదేవులు ఆర్య చాణక్యుల వారితో వృషపాలమునకు విచ్చేసి రాజ్యతిధి గృహమునందు బస చేశారు. వారు తమరిని దర్శించవలెనని కుతూహలపడుతున్నారు..." అని మనవి చేశాడు.
మౌర్య చంద్రగుప్తుని పేరు వినగానే పురుషోత్తముడికి మతిపోయినట్లయ్యింది. నందులు తనకి కప్పం చెల్లించడానికి నిరాకరిస్తూ వర్తమానం పంపినప్పటి నుండీ వారిపై పగ సాధించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ మగధవిశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు పురుషోత్తముడు. మగధకి అసలైన వారసుడు మురా-మహానందుల వారి కుమారుడు చంద్రగుప్తుడు జీవించే ఉన్నాడన్న వార్త అతనికి చేరిన కొద్ది రోజులకే - వెదకబోయిన తీగ కాళ్ళకే తగిలినట్లు చాణక్య చంద్రగుప్తులు తనని వెతుక్కుంటూ రావడం ఈతనికి చెప్పలేనంత సంతోషాన్ని కలిగించింది. పైగా బాబిలోనియాలో అలెగ్జాండర్ మరణించడం వల్ల అతనికి స్వేచ్ఛ లభించినట్లయి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.
ఇక చాణక్యుని గురించి అలెగ్జాండర్ నోటి ద్వారా అనేకసార్లు వినివున్నాడు. 'చాణక్యుడి వంటి మహామేధావి చంద్రునికి అండగా వున్నాడంటే వాళ్లకి విజయం తప్పదు. ఆ విజయంలో తానే పాలుపంచుకుని, వీలైతే చంద్రగుప్తునికి బంధువుగా మారితే హిందూదేశంలో తమకి తిరుగుండదు.'
ఆ విధంగా ఆలోచించిన పురుషోత్తముడు చంద్రగుప్తునికి సార్వభౌమోచిత లాంఛనాలతో స్వాగతం పలికాడు. చాణుక్యునికి పూర్ణకుంభంతో, వేదపఠనంతో స్వాగతం చెప్పి స్వయంగా అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించాడు.
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి