వ్యాస భగవానుడు
ముని పరాశరునికి ముదిత సత్యవతికి
శ్రీహరి యంశతో క్షితిని బుట్టి
సుజ్ఞానమునుపొంది విజ్ఞాన ఖనియయ్యు
విమల జ్ఞానంబుతో వినుతికెక్కి
ప్రోగగు వేదముల్ బాగుగా విభజించి
వేద వ్యాసునిగను వేద్యుడయ్యు
భాసురం బైనట్టి భారత గాథను
జయ నామ ధేయాన జగతికిచ్చి
భారత మందున భగవాను విభవంబు
చింతించ లేదని చింత నొంది
భగవాను లీలలు భక్తుల కథలతో
భాగవతము జేసి పరిఢ విల్లె
అష్టాదశంబైన యఖిల పురాణముల్
భక్తుల కందించె భాసురముగ
సంతానహీనమౌ శంతను వంశమున్
కాపాడె సంతుతో కరుణ జూపి
గాంగేయు కన్నయై కడు బాధ్య తొందియు
కౌరవ వంశమున్ కాచి పెంచె
అంధుని కిప్పించె నరయ సంజయునిచే
యధ్యాత్మ గీత నత్యంత భక్తి
దుర్వార వీరుడౌ ద్రోణపుత్రుని యొక్క
గర్వంబు నణచియు కట్ట డునిచె
శ్రీకృష్ణ భగవాను చిద్విలాసంబును
వేనోళ్ళ స్తుతియించె విభవముగను
అంతకసుతు చేత యశ్వమేధంబును
జరిపించి చక్కగా జగతి వెలిగె
విశ్వమందున గురువుగా వినుతు డైన
వ్యాసభగవాను నుతియింతు వంచి శిరము
పరమ గురుడగు వ్యాసుకు భక్తితోడ
చేతు శతకోటి నతులను చిత్త మలర
గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి