3, జులై 2023, సోమవారం

మూడు నియమాలు


 మూడు నియమాలు 

ప్రపంచంలో ఒక్కో దేశం ఒక్కొక్క నియాలను అంటే చట్టాలను చేసుకొని వాటిని అమలు  చేస్తాయి. ఆ చట్టాలను ఉల్లంగిస్తే ఆ దేశ చట్టాల ప్రకారం శిక్షలు విధించటం మనకు తెలుసు. ఉదాహరణకు మన దేశంలో రోడ్డుకు ఎడమవైపున వెళ్ళాలి అనే నియమము వున్నది అదే అమెరికా వంటి దేశాలలో కుడి వైపుకు వెళ్ళాలి అని ఉంటుంది ఈ నియమాలకు తగ్గట్టుగానే వాహనాల స్టీరింగుని అమరుస్తారు. మనదేశంలో వాహనానికి కుడివైపు అదే అమెరికాలో అయితే వాహనానికి ఎడమవైపు.  ఇలా అమర్చటం వలన డ్రైవరు వెనుక వచ్చే వాహనాలకు చేతితో సౌజ్ఞ (SIGNAL) ఇవ్వగలడు.  అదే విధంగా ఒక్కో దేశం ఒక్కొక్క చట్టాన్ని ఏర్పరచుకుంటుంది.  ఇలా ఏర్పడిన చట్టాలను స్థానిక లేక లోకల్ లా ఇంకా లా అఫ్ ది ల్యాండు అని అంటారు.  విదేశాలకు వెళ్లేవారు తప్పకుండ అక్కడి చట్టాలను తెలుసుకుంటే వారి జీవనం సుగమంగా నడుస్తుంది. ఇదంతా సామాజికమైనది ఇక విషయానికి వస్తే 

భగవంతుడు తన సామ్రాజ్యం మొత్తంలో ఒక మూడు నియమాలను ఏర్పాటు చేసాడు.  అంటే ఈ మూడు నియమాలు ప్రపంచంలో నీవు ఎక్కడ వున్నా లేక ఎక్కడ మనుషులు వున్నా కూడా తప్పకుండా తెలుసుకొని ఆచరించవలసినవి. వీటికి ఎటువంటి మినహాయింపులు (exemptions) వుండవు.  అదే భగవంతుని చట్టం అంటే ఇప్పుడు ఆ నియమాలు ఏమిటో ఏ నియమాన్ని మనం ఎలా ఆచరించాలి తెలుసుకుందాము. 

ఒకటవది ఈ నియమం తెలుసుకొని దీనిని తప్పకుండా ఆచరించకుండా ఉండటం  ఉత్తమం. ఈ నియమం ఏమిటంటే పాపం చేస్తే దాని పర్యవసానంగా లభించేది దుఃఖం. ఈ రోజు మనం ఏదైనా దుఃఖం అనుభవిస్తున్నాం అంటే దాని అర్ధం గతంలో మనం పాపం చేశామని అర్ధం. ప్రతి జీవి గతంలో చేసిన పాపం దుఃఖంగా దాని ఫలితాన్ని అనుభవించాలసిందే.  దీనికి ఎవరికి అంటే ఏ జీవికి కూడా ఎటువంటి వ్యత్యాసము ఉండదు.  భగవంతుని దృష్టిలో ఈ పాపం చేస్తే ఈ దుఃఖం అని ఉంటే అది అన్ని జీవులకు సమంగా అంటే ఒకే విధంగా ఉంటుంది.  ఈ విషయం తెలుసుకొని ప్రతి మనిషి తన జీవితంలో సాధ్యమైనంతవరకు పాపపు కృత్యాలను చేయకుండా ఉండటం మంచిది.  అప్పుడే మనిషి దుఃఖంకు దూరంగా ఉండగలడు. మనం చూస్తూవుంటాం సమాజంలో కొందరు అంధులుగా, అంగవైకల్యులుగా వున్నారు.  దానికి కారణం వారు గతంలో చేసుకున్న పాప ఫలితం ఆ యా రూపాలలో అనుభవిస్తూవున్నారని.  కొందరు పేదవారుగా వుంటారు అది కూడా గత పాప ఫలితమే. 

రెండవది ఈ నియమం తెలుసుకొని దీనిని తప్పకుండా ఆచరించటం   సదా ఉత్తమం. ఈ నియమం ఏమిటంటే పుణ్యం చేస్తే దాని ఫలితంగా సుఖం, సంతోషం కలుగుతుంది.  కాబట్టి ప్రతి మనిషి తన దైనందిక జీవితంలో సాధ్యమైనంతవరకు పుణ్యకార్యాలు చేయాలి, ఇతరులను పుణ్యకార్యాలు చేయటానికి ప్రోత్సహించాలి. పుణ్య ఫలం యెంత గొప్పగా ఉంటుందో తెలియచేసే ఒక పురాణ కథను చూద్దాం. 

పూర్వము ఒక మహారాజు ఉండేవారట.  అయన తన జీవితంలో అన్నీ పుణ్యకార్యాలే చేసాడట.  కాగా ఒకసారి తన భార్య మనస్సు నొప్పించేటట్లు గట్టిగ మాట్టాడట.  కొంతకాలానికి అతనికి ఆయుర్దాయం పూర్తి అయి మరణించాడు.  అయితే అతనిని తీసుకొని పోవటానికి దైవ దూతలు వచ్చారట కాగా వారిని వారిస్తూ యమదూతలు  వచ్చారట. అప్పుడు దైవదూతలు ఈయన తన జీవితకాలంలో పూర్తిగా పుణ్యకార్యాలే చేసి అనంత పుణ్యవంతుడు కాబట్టి ఈయనను మేము బ్రహ్మలోకానికి తీసుకొని పోతామన్నారట.  దానికి యమదూతలు మీరు చెప్పింది నిజమే కానీ ఈయన తన జీవితంలో ఒక చిన్న పాపాన్ని చేసాడు.  కాబట్టి ముందుగా ఆ పాప శిక్షగా ఈయనకు యమలోక దర్శనం విధించాడు యమధర్మ రాజు కాబట్టి యమలోకాన్ని ఒకసారి చుస్తే అయన శిక్ష పూర్తి అవుతుంది తరువాత ఈయనను మేము మీకు వప్పచెప్పుతాము అని అని యమలోకానికి తీసుకొని వెళ్లారు. 

ఆ మహారాజు నరక లోకాన్ని చూస్తూ ముందుకు  వెళుతున్నాడు. ఒక చోట ఆగి యమలోక శిక్షలను తిలకిస్తూ ఉంటే అక్కడి పాపులు ఇలా అన్నారు.  మహానుభావా తమరు ఎవరు మీరు ఇక్కడ ఉంటే మేము అనుభవించే శిక్షల బాధలు మాకు తెలియక ఉపశమనంగా వున్నాయి.  దయచేసి ఇంకా కొంతసేపు ఇక్కడే ఉండగలరు అని వేడుకున్నారట. వారి ప్రార్ధనను విన్న మహారాజు యమా దూతలతో నేను ఏమిచేస్తే వారి నరక యాతన నివారించబడుతుందో తెలియచేస్తే నేను ఆ పని చేయగలను అని అన్నారట.  అప్పుడు యమదూతలు మహానుభావా మీ వద్ద అపారమైన పుణ్యఫలం వున్నది మీరు ఆ పుణ్యఫలాన్ని వారికి దార పోస్తే అప్పుడు వారి కస్టాలు తొలగుతాయి.  కానీ పుణ్యఫలం వదులుకున్న తరువాత మీరు కూడా పుణ్యహీనులు అవుతారు కాబట్టి స్వర్గలోకం వెళ్ళలేరు. ఈ నరకంలోనే నరక యాతనలు అనుభవిస్తూ వుండవలసి ఉంటుంది అని అన్నారట. దానికి ఆ మహారాజు ఇంతమందికి మేలుచేసి పని నేను చేసి నేను ఒక్కడిని నరక యాతన పడిన నాకు ఇష్టమే అని వేరే ఏది ఆలోచించకుండా తన పుణ్యపాహలాన్ని పూర్తిగా వారికి దారాదత్తం (దానం) చేసాడు. ఆ దాన ఫలంగా అక్కడి పాపులకు ఉపశమనం కలిగి వారు మహారాజుకు కృతజ్ఞ్యతలు తెలిపారు. 

పూర్తి పుణ్యఫలం దానం వలన కోల్పోయిన మహారాజు ఇక నరకంలోనే ఉండటానికి నిర్ణయించుకున్నాడు. ఇంతలో వేగంగా ఒక దూత అక్కడికి వచ్చి ఇక్కడి దూతతో నీవు ఈ మహారాజును వెంటనే యమధర్మ రాజుగారి వద్దకు తీసుకొని రమ్మని ఆజ్ఞపించారని  తెలిపాడు. ఈయనకు ఇంకా పూర్తిగా నరకలోకాన్ని నేను చూపించలేదు  అంతే కాక ఈ మహారాజు తన పూర్తి పుణ్యఫలాన్ని దానం చేశారు కాబట్టి ఈయన ఇక ఎట్లాగో ఇక్కడే వుండవలసి ఉంటుంది కాబట్టి ఇతనిని అంత తొందరగా యమరాజావారి వద్ద ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఏమిటి అని అన్నాడు దానికి ఆ భటుడు నాకు ఏమి తెలియవు రాజాజ్ఞను నీకు తెలిపాను అని అన్నాడు. 

యమరాజావారి ఆజ్ఞనుసారం దూత యమధర్మరాజు వారి వద్దకు ఈ మహారాజును తీసుకొని వెళ్ళాడు.  ఆశ్చర్యం అక్కడ దైవదూత మన మహారాజు కోసం ఎదురుచూస్తూ  వున్నాడు. అప్పుడు యమధర్మరాజు మహారాజుతో మీ శిక్ష సగంలోనే రద్దయింది ఇప్పుడు మీరు వెంటనే స్వర్గలోకానికి వెళ్ళాలి మీకోసం దూత ఎదురుచూస్తున్నాడు అందుకే మిమ్ములను త్వరగా రమ్మని కబురు పంపాను అని అన్నారు. 

అప్పుడు మన మహారాజు రాజా నేను నా పుణ్య ఫలం పూర్తిగా ఇక్కడి పాపులకు దారాదత్తం చేసాను కాబట్టి ఇప్పుడు పున్యరహితుడిని అందువలన నాకు స్వర్గ లోక ప్రాప్తి ఎలా కలుగుతుంది అని అన్నారు.  దానికి యమ ధర్మ రాజు గారు మహారాజా మీరు చెప్పింది మీ లెక్క ప్రకారం నిజమే కానీ ఇక్కడి లెక్కలు వేరే విధంగా ఉంటాయి అదేమిటంటే మీరు ఎప్పుడైతే పుణ్య ఫలితాన్ని దానం చేశారో అప్పుడు మీకు ఆ దాన ఫలితం లభిస్తుంది.  ఆ దాన ఫలితంగా మీకు ఏమి లభించిందంటే మీరు గతంలో చేసుకొని దానం చేసి పుణ్యఫలం ఎంత వుందో దానికి రెట్టింపుగా వున్నది.  కాబట్టి మీకు గతంలో పాప ఫలితంగా విధించిన శిక్షగా లభించిన యమలోక దర్శనము కూడా రద్దు చేయబడి మీకు స్వర్గలోక ప్రాప్తి లభించిందని యమరాజు తెలుపగా ఆ మహారాజు ఆశ్చర్యచకితుడు అయ్యాడు.  కాబట్టి  సాధక నీవు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేసిన కర్మ కూడా దానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది. 

ఈ కథతో ప్రేరణ పొంది ప్రతి సాధకుడు నిస్వార్ధంతో పరోపకారార్ధం ఈశ్వరార్పణగా నిష్కామ కర్మలు చేస్తే ఆ ఈశ్వరుడు సదా మనలను రక్షిస్తాడు. భగవత్ గీతలో శ్రీ కృష్ణ భగవానులు మనకు ఇదే తెలిపారు. అందుకేనేమో " పరోపకారార్ధం ఇదం శరీరం" అని అన్నారు. ఇతరులకు ఉపకారం చేయటానికే మన శరీరాన్ని ఉపయోగించాలనే ఆర్యోక్తి మనకు సదా ఆచరణీయం.

ఇక మూడవది అత్యంత ప్రముఖమైనది  ఆయిన నియమము ఏమిటంటే   "జ్ఞ్యానం వలన మోక్షము సిద్ధిస్తుంది". ప్రతి సాధకుడు తెలుసుకోవలసిన ముఖ్యమైన నియమము.  చాలా మంది ప్రస్తుతం సమాజంలో ఏమని తలుస్తున్నారంటే భక్తి వలన మోక్షం వస్తుంది అనే భావనతో అనేక శ్రమ దమాలకు ఓర్చి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకొని వారికి వారు పుణ్యప్తులుగా భవిస్తూ తమకు తాముగా మోక్షం పొందగలం అనే భ్రాంతిలో  వుంటున్నారు. దీనికి తోడు సమాజంలో అనేక ప్రవచనకారులు ఈ విషయాన్నే మరల మరల ఉటంకిస్తూ ఆ దేవాలయంలో దేవుడి దర్శనం మోక్షదాయకం ఈ దేవాలయంలో దేవుని దర్శించుకోవటం అనేక జన్మల పుణ్యం అనే వృధా ప్రసంగాలు చేస్తూ సాధకులను తప్పుడు దోవలో నడుపుతున్నారు. ఇది ఇలా ఉండగా ఇంకొకటి మనకు ప్రబలంగా వినపడుతుంది అదేమిటంటే 

"కలిన్ స్మరణాన్ ముక్తిహః " దీని భావము ఏమిటంటే కలి యుగంలో భగవాన్ నామ స్మరణ చేస్తేనే ముక్తి లభిస్తుందని.  ఈ వాక్యాన్ని చాలామంది నమ్మి తాము రోజు కొంతసమయం చేసే భగవన్నామముతో ముక్తి లభిస్తుందని  భావిస్తున్నారు. నిజానికి ఇతర యుగాల మనుషులతో పోలిస్తే కలియుగంలో వుండే మనుష్యులు చాలా బద్దకస్తులు అంటే తామస ప్రవ్రుత్తి  కలిగినవారు. ఇక అటువంటి వారికి ఇటువంటి మాటలు ఎంతో రుచిస్తాయి.  అది యెట్లా అంటే పని ఎగవేసే ఉద్యోగస్తునికి నీవు పని చేయకపోయినా జీతం ఇస్తారు అనే మాటలు ఎలా రుచిస్తాయో అలాగే.  కానీ సాధక మిత్రమా ఎట్టి పరిస్థితిలోను ఇటువంటి మాటలను నమ్మి నీ సాధనను మధ్యలో ఆపు చేయకు.  నిజానికి ఇటువంటి విషయాలే నిజమైతే హిమాలయాలల్లో సాధువులు, సన్యాసులు, జ్ఞ్యానులు నిరంతరం నిద్రాహారాలు మాని ఎముకలు కొరికే చలిలో ఎందుకు  సాధన చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించు.  కఠినమైన తపమొనరిస్తేనే మనకు జ్ఞ్యానం  కలుగుతుంది. అప్పుడే మోక్షసిద్ది. జన్మ రాహిత్యానికి ప్రయత్నించే చక్కటి అవకాశం మనకు కేవలం ఈ మనుష్య జన్మలోనే వున్నది.  ఈ అవకాశాన్ని చేయిజార్చకూడదు. మిత్రమా ఇప్పుడే మోక్షసిద్దికి ఉద్యుక్తుడవు కమ్ము. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి  శాంతిః 

ఇట్లు 

మీ భార్గవ శర్మ


కామెంట్‌లు లేవు: