శుభోదయం🙏
వెన్నెల వెలుగులు
----------------------------
చ : వడిగొని ఱేకు లుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పఁ ,బు
ప్పొడిఁ దలమెక్కి, తేనియలు పొంగి తఱంగలుఁ గాఁ జెలంగి పైఁ
బడు నెలదేఁటిదాఁటులకుఁ బండువులై నవసౌరభంబు లు
గ్గడువుగ నుల్ల సిల్లె ఘన కైరవ షండము నిండు వెన్నెలన్ ;
ఆవెన్నెలలో సరోవరాలలో కానవచ్చే ప్రకృతి విలాసాన్ని కవి వర్ణిస్తున్నాడు. సరోవరాలలో చంద్రుని కిరణాలు
ప్రసారం కాగానే కలువలు రేకులు విప్పుతున్నాయి. ఆరేకుల వెనుకే కింజల్కాలు ప్రక్కలకు వ్రాలుతున్నాయి. ఆకింజల్కాలనుండి పుప్పొడి రాలుతోంది. ఆపుప్పొడి ప్రక్కనుండి మకరందం జారులు వారుతోంది.. అపుప్పొడి పీకవరకూ మెక్కి, తేనెత్రాగి తుమ్మెదలు
అటూ ఇటూ పరిభ్రమిస్తున్నాయి. ఆవాతా వరణానికి పండుగ శోభను కలిగిస్తూ కలువలనుండి గమ్మత్తుగా మత్తుగా , పరిమళాలు నలువైపుల నలుముకుంటున్నాయి .
ఇదీ ప్రకృతిలోని పరిణామము!
దీనినే కవి తన భాషలో భావనాత్మకముగా వర్ణించినాడు. వడిగొని రేకులుప్పతిల-గబగబా రేకులు విచ్చు కున్నాయట. వెంటనే కేసరములు వాలాయట,కలువలు, రేకులు విప్పగానే తుమ్మెదలు సిధ్ధంగా ఉన్నాయి ఆహారంకోసం ఆనందంకోసం. పుప్పొడిఁ దలమెక్కాయట.పీకల వరకూ మెక్కాయన్నమాట. తేనెకెరటాలుగా వస్తోంది తప్పించుకుంటానికి అటునిటు గెంతుతున్నాయి. వాటికి 'పండుగులవలె' కలువల నుండి సువాసనలు వ్యాపిస్తున్నాయట; ఇదంతా జరుగ టానికి ప్రధానమైనవి కైరవ షండములు.( కలువల సముదాయము. )
కలువకు 'కుముద' మని మరోపేరు. కు- అంటే భూమి , భూమికి ఆనందాన్ని కలిగించేవి అనియర్ధం.
కలువకు కువలయము అనేది పర్యాయపదం. దానికి భూమి యని యర్ధం!
కలువకూ చంద్రునకూ ప్రకృతిగత సంబంధం. భూమికీ కలువకూ సామ్యం. అందువలన కలువలు వికసించాయీ అంటే భూలోక మంతా ఆనందంగా ఉన్నదని వ్యగ్యం! చంద్రుని రాకతో మనస్సుకు ప్రశాంతత కల్గుతుంది." చంద్రమా మనసోజాతః"-అనివేదం! ఆఆనందమయ జగత్తునే కవి యిక్కడ ఆవిష్కరించాడు.
కలువలు, తుమ్మెదలు,పుప్పొడి, తేనె, పరిమళాలు, ఇత్యాదులన్నీ ' రసమయ' జగదా విష్కరణలోని భాగాలు.
ఇదంతా ప్రకృతి సౌందర్య స్వరూపం!
మొత్తంమీద సంధ్యాకాలం -సూర్యస్తమయం- చంద్రోదయం- వెన్నెల వెలుగులు. వీనియన్నింటి యందు ఎఱ్ఱన కవి
త్రిగుణాత్మక మైన ప్రకృతి దర్శనముతో బాటు త్రిగుణాత్మక స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి కూడా దర్శించినాడని మొన్ననే విన్న వించాను.
సాంధ్య వర్ణనలోని చీకటి తమోగుణం. సంధ్యాకాంతి.(ఎఱుపు) రజోగుణం. వెన్నెలలోని తెల్లదనం సత్వగుణం. యీమాదిరిగా నున్నప్రకృతిలో పరమాత్మ దర్శన మన్నమాట!
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి