29, నవంబర్ 2023, బుధవారం

 పూర్వము కృతయుగంలో దైత్య వంశములో *మధు* అనే రాక్షసరాజు ఉండేవాడు. అతడు ధర్మశాలి. దేవతలకూ, బ్రాహ్మణులందరికీ ఇష్టుడు. ధర్మంగా దేశాన్ని మిక్కిలి చక్కగా పరిపాలించేవాడు. 


శివభక్తుడైన ఆ మధు శివుని గురించి గొప్ప తపస్సు చేయగా శివుడు అతని తపస్సుకు మెచ్చి తన శూలము నుండి మరొక శూలాన్ని సృష్టించి ఇస్తూ, 'రాజా నీవు ధర్మాన్ని తప్పకుండా పరిపాలిస్తూ వున్నంతకాలం ఈ శూలం నీతో వుండి, శత్రువులను సంహరించి నిన్ను చేరుతుంది, ఒకవేళ నీవు ధర్మాన్ని పాలించకపోతే, అప్పుడు ఆ శూలం నన్ను చేరుతుంది' అని చెప్తాడు. 'నీ తరువాత నీ కుమారుని వద్ద వుండి యుద్ధంలో అతనిని అజేయుడుగా నిలబెట్టు గలుగుతుంది, శూలాన్ని మరచి వాలాయముగా యుద్ధానికి వెళ్తే అతడు హతుడౌతాడు, తదుపరి ఆ శూలం నా శూలంలో కలిసిపోతుందనీ' వివరించి చెప్తాడు.


ఆ శూలాన్ని పొందిన తరువాత ఆ నరభోజి (నరభక్షకుడు) వివాహము చేసుకొని ఓ కొడుకుకు తండ్రవుతాడు.   ఆ కొడుకు చిన్నతనం నుండే క్రూరుడు, కుటిలాత్ముడు. కుమారుడు ఇలా దురాత్ముడై వున్నందుకు విసిగి, తట్టుకోలేక కుమారునికి పట్టాభిషేకం చేసి శివుడిచ్చిన శూలాన్ని ఇచ్చి, సముద్రంలో మునిగిపోయాడు మధు. 


రాజైన తరువాత కొడుకు తన దగ్గర శూలమున్నదన్న గర్వంతో, మునులనూ, బ్రాహ్మణులను, దేవతలను ఎవ్వరినీ వదలక అందరినీ బాధిస్తాడు. వాడి బాధలు ఓర్వలేక మునులు, ఆ బాధలు నివారించమని  శ్రీరాముని వేడుకొంటారు. 


అప్పుడు శ్రీ రాముడు తన తమ్ముడిని యుద్ధానికి పంపుతాడు. తన వద్ద ఉన్న అస్త్రాన్ని ప్రయోగ, ఉపసంహార మంత్రాలతో నేర్పి పంపుతూ, "ఆ రాక్షసుని చేతిలో శూలం ఉన్నంతవరకూ,ఎవరూ చంపలేరు కనుక అతని చేతిలో శూలం లేని సమయం చూసి సంహరించమని' సలహా ఇస్తాడు. "నీవు రేపు ఉదయమే అతనిని చంపగలవు! అతడు అడవికి వెళ్ళగానే అతని పుర ద్వారం వద్ద ధనుర్థారివై అడ్డు నిలిస్తే, నీవు కృతకృత్యుడవు కాగలవు!” అని దీవించాడు. 


తెల్లవారగానే ఆ రాక్షస కుమారుడు మాంసభక్షణకై అడవికి వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీరాముని తమ్ముడు ధనుర్థారియై మధుపురం ద్వారం వెలుపల నిలిచాడు. ఆ రాక్షసుడు అలవాటు ప్రకారం అడవిలో జంతువులను చంపి తిన్నాడు. మరి కొన్ని జంతువులను చంపి, రాత్రి భోజనానికై వాటిని తీసుకుని మధ్యాహ్న సమయంలో తన అంతఃపురాన్ని సమీపించాడు. కోట వెలుపల ముఖద్వారం వద్ద కాలయముని వలె ఉగ్ర మూర్తియై నిలిచి ఉన్న వీరుణ్ఢి చూసి, అడ్డు తొలగమని   హుంకరించాడు. 


వీరుడు ఆ రాక్షసుణ్ణి   యుద్ధానికి ఆహ్వానించాడు. శూలం కొరకు పోదలచి, లోపలికి పోయి వచ్చి నీ పని పడతాను అన్నాడు రాక్షసుడు. శత్రువు యుద్ధానికి ఆహ్వానిస్తూ ఉంటే, ‘వాయిదా వేయడం వీర లక్షణమా!’ అని ఆ వీరుడు అధిక్షేపించాడు.

”నా కంట పడడం నీకు భూమిపై నూకలు చెల్లి నట్లే!” అన్నాడు. 


”ఓహో! నీవు రాముని సోదరుడవా? నా బంధువు రావణుని చంపిన రామునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే నా సంకల్పం నెరవేరే అవకాశం ఇన్నాళ్ళకు నాకు లభించింది! నీ చావును వెతుక్కుంటూ నీవే వచ్చావు. ఈ రోజు నా చేతులలో నీ చావు తప్పదు” అంటూ అతను చెట్లతో, రాళ్ళతో యుద్ధానికి పూనుకున్నాడు. 


ఆ వీరుడు ఆ రాక్షసుడి ధాటికి తట్టుకోలేక సొమ్మసిల్లి దిమ్మ తిరిగి నేలపై పడి మూర్ఛపోయాడు. అతడు  చచ్చాడని భ్రమించిన ఆ రాక్షసుడు ఇంతసేపు పోరాడాడు కదా! ఆకలి బాధ అధికమయ్యింది. అడవి నుండి తెచ్చిన మాంసాన్ని భక్షిస్తున్నాడు. శత్రువు చచ్చాడు కదా! ఇక శూలంతో ఏముంది పని? అని అనుకొన్నాడు. 


హఠాత్తుగా వీరుడు మూర్చ నుండి తేరుకుని లేచాడు. వెంటనే శ్రీ రాముడు ఇచ్చిన దివ్యాస్త్రాన్ని సంధించి, ఆకర్ణాంతం లాగి వదిలాడు. అది నిప్పులు గ్రక్కుతూ రాక్షసుణ్ణి వధించింది.


ఇంతకీ ఆ రాక్షసుడు ఆ వీరుడు ఎవరో మరి.

కామెంట్‌లు లేవు: