29, నవంబర్ 2023, బుధవారం

 *గోవిందమ్మ నివేదన..*


"అయ్యా..మీరు స్వామివారికి నైవేద్యాలు వండిపెట్టడానికి వంటమనిషి కావాలని అడిగారు కదా..ఎవరైనా కుదిరారా..?" అని ఆర్యవైశ్య సత్రం మేనేజర్ గారు అడిగారు.."లేదండీ..చూస్తున్నాము.." అన్నాను.."మా వాళ్లకు తెలిసిన ఒకావిడ ఉన్నదట..పిలిపించమంటారా?" అన్నారు.."పిలిపించండి.." అన్నాను..ఈ సంభాషణ 2007వ సంవత్సరం నాటిది..ఆరోజుల్లో మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద శ్రీ స్వామివారికి నిత్యా నైవేద్యాలు అర్చకస్వాములే తయారు చేసుకొని వచ్చి నివేదన చేసేవారు..ఒక్కొక్కసారి అర్చకస్వామి నైవేద్యం తయారు చేసే సమయం లో భక్తులు వస్తే..వారు స్వామివారి మంటపం లో అర్చకస్వామి రాక కోసం ఎదురు చూస్తూ గడపాల్సి వచ్చేది..అదీకాక..ఆదివారం నాడు ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉండేది..దీనికి పరిష్కారంగా ఒక వంటమనిషిని ఏర్పాటు చేసుకోవాలి అని నేనూ మా అర్చకస్వాములు ఇతర సిబ్బంది అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము..ముందుగా దేవాదాయశాఖ వారి వద్ద నుంచి వంటమనిషి కొఱకు ఒక ఉద్యోగం కల్పించడానికి అనుమతి కూడా తీసుకున్నాము..


ఇద్దరు ముగ్గురు వంట వాళ్ళు వచ్చారు కానీ..ఏ ఒక్కరూ నెల రోజుల కంటే ఎక్కువ కాలం స్వామివారి మందిరం వద్ద వుండలేకపోయారు..కారణం విచారిస్తే..వాళ్లకు శ్రీ స్వామివారి మందిరం వద్ద  తమకున్న దురలవాట్లను మానుకోవడం కష్టంగా తోచి..ఇమడలేక వెళ్లిపోయారు..అని తెలిసింది..ఆ సమయం లో ఆర్యవైశ్య సత్రం మేనేజర్ గారు నాతో తమకు తెలిసిన ఆడమనిషి వున్నదని నాతో అన్నారు..ఆ తరువాత రెండురోజుల్లో ఆవిడ వచ్చింది..


"అయ్యా..నా పేరు గోవిందమ్మ..ఈ స్వామివారి గురించి నేను విని వున్నాను..నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి..వాటిని వదిలించుకోవడానికి ఈ స్వామివారి సన్నిధిలో కొన్నాళ్ళు ఉండాలని అనుకున్నాను..అటువంటిది ఇక్కడ స్వామివారికి నైవేద్యాలు తయారు చేయడానికి వంటమనిషి గా నన్ను పిలిపించారు..ఆ దత్తుడే నన్ను పిలిపించాడేమో తెలీదు..ఇక దత్తయ్య ను నేను వదలను..నా ప్రాణం ఉన్నంత వరకూ ఈ దత్తాత్రేయుడి దగ్గరే వుంటాను..ఒకవేళ నేను చేయలేని పక్షములో..వేరే వాళ్ళు ఈ ఉద్యోగం చేసినా..నేను ఈ మందిరం వద్దే వుంటాను..అందుకు కూడా సమ్మతించండి.." అని కన్నీరు కారుస్తూ చెప్పింది..నాకూ మా సిబ్బందికి కొద్దిగా ఆశ్చర్యంగా ఉన్నది..తాను స్వామివారి వద్దకు రావాలని అనుకోవడం ఏమిటి..? ఆమె చేయదగ్గ ఉద్యోగం సిద్ధంగా వుండటమేమిటి..?..అంతా ఏదో పధకం ప్రకారం జరుగుతున్నదేమో అనిపించింది..


"అమ్మా..స్వామివారు ఈ మందిరం వద్దకు రాకముందు మొగిలిచెర్ల లోని శ్రీ పవని శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్ల ఇంటి వద్ద వున్నారు..ప్రస్తుతం ఆ దంపతులు అనారోగ్యం తో వున్నారు..స్వామివారు సిద్ధిపొందే దాకా వారికి ఆహారం ఆ ఇంటినుంచి వచ్చేది..ఆ దంపతుల కడుపున పుట్టినందుకు..స్వామివారికి కొన్నాళ్ళు ఆహారం తీసుకు వచ్చి ఇచ్చే అవకాశం నాకూ కలిగింది..నువ్వు అక్కడే వుండి..స్వామివారికి నైవేద్యాలు అక్కడే తయారు చేసి పంపించు..ఇందుకు నీకేమి అభ్యంతరం లేదు కదా..?" అన్నాను.."అయ్యా..వాళ్లకు కూడా నా చేతనైన సేవ చేసుకుంటాను..మీరు చెప్పినట్టే వుంటాను.." అన్నది.."అయ్యా..మీరు ఇష్టపడితే..రేపటినుంచి నేను స్వామివారికి నైవేద్యం చేస్తాను.." అన్నది..సరే అన్నాను..


ఆరోజు నుంచీ సుమారు పది సంవత్సరాల పాటు గోవిందమ్మ స్వామివారికి క్రమం తప్పకుండా నైవేద్యాలు తయారు చేసి పంపించేది.."ఆ దత్తయ్యకు నామీద కరుణ కలిగింతకాలం నేను చేస్తూనే వుంటాను.." అని పదే పదే చెప్పేది..మా తల్లిదండ్రులు శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్ల అంత్యకాలం లోనూ గోవిందమ్మ వారికి సేవ చేసుకున్నది..."స్వామివారు తనకు నైవేద్యాల కోసమే కాకుండా మన తల్లిదండ్రుల అవసరాల కోసం కూడా గోవిందమ్మను తీసుకొచ్చి ఇక్కడ స్థిరపరిచారు.." అని మేము తరచూ అనుకునే వాళ్ళము..


2017 వ సంవత్సరం లో గోవిందమ్మ అనారోగ్యం పాలైంది..డాక్టర్ల కు చూపించాము..కొన్నాళ్ళు విశ్రాంతి అవసరం అన్నారు..కేవలం పదిరోజులు పాటు తన కుటుంబం వద్ద వుండి..మళ్లీ మొగిలిచెర్ల కు వచ్చేసింది..ఆరోజు ఆదివారం స్వామివారి సన్నిధికి వచ్చి.."దత్తయ్యా..నాకు ఓపిక ఇచ్చినంతకాలం నీకు సేవ చేసుకున్నాను..విశ్రాంతి తీసుకొని మళ్లీ వస్తాను.." అని చెప్పుకున్నది..కానీ మరో వారం కల్లా గోవిందమ్మ స్వామివారినే స్మరిస్తూ కన్నుమూసింది..


ఇప్పటికీ స్వామివారి మందిరం వద్ద నేనూ.. మా సిబ్బంది..అర్చకస్వాములు..అందరమూ కూడా అనుకునేది ఓకేమాట.."స్వామివారే గోవిందమ్మను ఇక్కడికి పిలిపించారు..అందువల్ల నే ఆమె అంత భక్తి తో సేవ చేసుకున్నది.." 


ప్రతిక్షణం స్వామివారినే తలుస్తూ..చివరి క్షణం వరకూ తాను చేసేది ఉద్యోగం కాదు..స్వామివారి సేవే.. అనుకుంటూ జీవితాన్ని సార్ధకం చేసుకున్న ధన్యజీవి గోవిందమ్మ..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..99089 73699 & 94402 66380).

కామెంట్‌లు లేవు: