🌹శ్రీమహావిష్ణు దర్శనము 🌹
(ఆముక్త మాల్యద )
సీ. శర దిందు చంద్రికా గరిమపై గెల్చిన
మురువుతో వెల్గెడి మోము వాడు
అర్క చంద్రుల శోభ లలమియు నున్నట్టి
యరవింద నేత్రంబు లమరు వాడు
సుందరోజ్వల వపు రిందీవరశ్యాము
స్వర్ణ వసన ధారు చారుదేహు
మకరకుండలధారు మణిమయ కటిభూషు
శ్రీవత్సలాంఛన చిద్విలాసు
తే. శంఖ చక్ర గదా శార్ఞ్గ చారు హస్తు
మహిత మణిమయ శోభిత మకుట భూషు
విమల తేజిత విభాసు విష్ణుదేవు
తనదు హృదియందు నీరీతి తలచ తగును.
సీ. సర్వేశ్వరుడు విష్ణు సారూప్యమును గోరు
నరుడు ధ్యానము నిట్లు నెరప దగును
తొలుత నొక్కంగమున్ దలచి గుర్తించియు
చిక్కబట్ట దగును చిత్తమందు
నయ్యది మనమందు నంటగా ధృఢరీతి
తదుపరి యంగంబు తలచ వలయు
నా రీతి యంగమ్ము లన్నిటిన్ వరుసగా
ధ్యానించ వలయును ధారణమున
తే. హరిని నీరీతి చింతించ ననయముగను
కదలుచున్నను లేక తా కదలకున్న
నెచట నున్నను తానిక నెట్టులున్న
ధ్యాసలో నుంచుకొనును ధ్యానాంగములను.
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి