12, మార్చి 2024, మంగళవారం

శ్రీ బాదామి గుహాలయం

 🕉 మన గుడి : నెం 254


⚜ కర్నాటక  : బాదామి


⚜ శ్రీ బాదామి గుహాలయం



💠 బాదామి గుహ దేవాలయాలు భారతదేశంలోని కర్ణాటకలోని ఉత్తర భాగంలోని బాగల్‌కోట్ జిల్లాలోని బాదామి పట్టణంలో ఉన్న హిందూ మరియు జైన గుహ దేవాలయాల సముదాయం.  

పశ్చిమ కొండపై ఉన్న గుహలు భారతీయ రాతి వాస్తుశిల్పానికి, ముఖ్యంగా బాదామి చాళుక్య వాస్తుశిల్పానికి ముఖ్యమైన ఉదాహరణలు


💠 బదామిని దీనినే వాతాపి అని కూడా అంటారు. ఇది  540 నుండి 757 ప్రాంతంలో పరిపాలించిన చాళుక్యుల రాజధాని నగరం. బదామి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి గుహలకి, గుహాలయాలకీ చాలా ప్రసిద్ధి. 

ఇక్కడ ఉన్న ఎర్రకొండలు అందంగా ఎవరో మలిచినట్లుంటాయి. ఇవి అంతర్జాతీయంగా పర్వతారోహకులకి చిర పరిచరియలే.


💠 బాదామి, చారిత్రక గ్రంథాలలో వాతాపి, వాతాపిపుర మరియు వాతాపినగరి అని కూడా పేర్కొనబడింది. ముందుగా ఈ ప్రాంతానికి వాతాపి అని పేరు రావడం వెనుక రామాయణ కాలంలో అగస్త్య మహామునితో కూడిన ఒక కథ ప్రాచుర్యం పొందివుంది. 


💠 ఇల,వాతాపి అనే ఇద్దరు  రాక్షసులు ఇక్కడ ఉండేవారు. వాళ్ళు ఆ దారినపోయే వారిని చాకచక్యంగా, వింత పద్ధతిలో చంపుతూవుండేవారు. 

ఇద్దరూ కలిసి దారిన పోయే బాటసారుల్ని విందుకి పిలిచేవారు. పెద్దవాడైన ఇల్వలుడు, వాతాపిని మాంసంగా వండి వడ్డించేవాడు. 

తరువాత ఆ అతిథి పొట్టని చీల్చుకుని వాతాపి బయటకి వస్తూ వుండేవాడు. 

ఆ విధంగా ప్రజల్ని మాయలో పడేసి చంపుతూ వుండడం వారికి పరిపాటిగా మారిపోయింది.


💠 ఒకనాడు ఆ మార్గాన వస్తున్న ఆగస్త్య మహామునిని కూడా ఇలాగే మాయ చేద్దామనుకున్నారు. 

దివ్యజ్ఞానం కలిగిన అగస్త్యుడు మారు మాట్లాడకుండా ఇల్వలుడు పెట్టిన విందుని కడుపారా ఆరగించి, జీర్ణం..జీర్ణం.. వాతాపి జీర్ణం అని తేన్చాడు. 

ఆ తర్వాత ఇల్వలుడు ఎన్నిసార్లు వాతాపిని పిలిచినా ఇంకరాలేదు. 

ఈ విధంగా వాతాపి తన అన్న చేతిలోనే హతుడయ్యాడు. 

ఆ తరువాత ఇల్వలుడు కూడ మరణించాడు. బదామిలో ఇప్పటికి రెండు కొండల్ని వాతాపి, ఇల్వల అని వారి గుర్తుగా పిలుస్తారు. 

ఈ సన్నివేశం జరిగినది ఇక్కడే.


💠 ఇక చారిత్రకంగా 6-8 శతాబ్దాల్లో కర్నాటక, ఆంధ్రప్రదేశ్  పరిపాలించిన చాళుక్యుల రాజధాని బదామి. ఈ పట్టణం 535 నుండి 566 వరకూ పరిపాలించిన పులకేశి  540లో నిర్మించాడు. ఈతడు చాళుక్య వంశం గుహాలయాల మాత్రం, పులకేశీ మొదటి కుమారుడు కీర్తివర్మ 567-598 ప్రాంతంలోను, రెండవ కుమారుడు మంగళేశుడు 598-610 ప్రాంతంలోను నిర్మించారు. 

అయితే  610-642 మధ్యకాలంలో ఏలిన రెండవ పులకేశి చాలా ప్రసిద్ధుడయ్యాడు. ఈతని కాలంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరిగింది. రెండవ పులకేశి అనేక దండయాత్రలు చేసి ఎందరో రాజుల్ని ఓడించాడు. కానీ, పల్లవుల్ని జయించి వారి రాజధాని కాంచీ పురాన్ని చేజిక్కించుకోలేకపోయాడు.


💠 ఇక్కడున్న గుహాలయాలు చాలా వరకూ 6-8 శతాబ్దాల్లో నిర్మించినవే. ఇక్కడ హిందూ మతంతో పాటు భౌద్ధ, జైన మతాలు కూడా బాగా వర్ధిల్లాయి. 

ఈ గుహాలయాల్లో మనకి 18 లిపులు గోడలమీద కనిపిస్తాయి. అయితే అందులో అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకున్నవి మాత్రం కొన్నే ఉన్నాయి. 

అందులో నాటి కన్నడ భాషలో లిఖించిన సంస్కృత పదాల విషయం ఒకటుంది.


💠 బాదామిలో మొత్తం 4 గుహ దేవాలయాలు ఉన్నాయి.  ఈ దేవాలయాలన్నీ హిందూ దేవతలకు చెందిన  అద్భుతమైన శిల్పాలను కలిగి ఉన్నాయి.  ఈ ఆలయాల నిర్మాణం ఉత్తర భారత , నాగర శైలి మరియు దక్షిణ భారత ద్రావిడ నిర్మాణ శైలి యొక్క సంపూర్ణ కలయిక.  ప్రతి గుహలో గర్భగుడి, హాలు, వరండా మరియు స్తంభాలు ఉంటాయి.  


💠 తొలి గుహ దేవాలయం (గుహ 3, వైష్ణవం) 6వ శతాబ్దానికి చెందినది, గుహ 1 (శైవమతం) కొంతకాలం తర్వాత నిర్మించబడింది. 

గుహ 2 (వైష్ణవం) 7వ శతాబ్దానికి చెందినది. 

4వ గుహలో వేదాంతశాస్త్రం మరియు జైనమతం యొక్క ఆలోచనలు ఉన్నాయి, ఇది మొదటి మూడు తర్వాత నిర్మించబడింది.

 

🔅 గుహ I : 

ఇది శైవుల గుహ.

ఈ గుహలోని ముఖ్యమైన శిల్పాలు 18 చేతులతో నృత్యం చేస్తున్న శివుడు, రెండు చేతుల గణేశుడు, మహిషాసుర మర్దిని, అర్ధ నారీశ్వరుడు & శంకర నారాయణ 

ఎర్ర ఇసుకరాయితో తయారు చేయబడిన ఈ గుహలో బహిరంగ వరండా, అనేక స్తంభాలతో కూడిన హాలు మరియు గర్భగుడి ఉన్నాయి.


🔅 గుహ II : 

2వ గుహ ఇసుకరాయి కొండ శిఖరం వద్ద ఉంటుంది.  ఈ గుహ దేవాలయం విష్ణువుకు అంకితం చేయబడింది.  

ఇక్కడ, విష్ణువు 'త్రివిక్రమ' రూపంలో ప్రదర్శించబడ్డాడు.

ఈ గుహలో  త్రివిక్రమ,& భూవరాహ, అనంతశయన, బ్రహ్మ, విష్ణు, శివుడు ఇతర అష్టదిక్పాలకుల శిల్పాలు ఉన్నాయి.


🔅 గుహ III : 

ఇది చాలా పెద్దది , ఉత్తమమైనది.  

ఈ గుహలో శైవ, వైష్ణవ ఇతివృత్తాలకు సంబంధించిన చెక్కడాలు ఉన్నాయి.  

త్రివిక్రమ, నరసింహ, శంకరనారాయణ, భువరాహ, అనంతశయన , హరిహర విగ్రహాలు  చెక్కబడ్డాయి.


🔅 గుహ IV: 

మూడు గుహలకు తూర్పున ఉన్న నాల్గవ గుహ జైన్ గుహ. గర్భగుడిని అలంకరించిన మహావీరుడి చిత్రం ఉంది.  

ఇక్కడ ఉన్న ఇతర శిల్పాలు పద్మావతి మరియు ఇతర తీర్థంకరులు.  

ఈ మందిరంలో, కూర్చున్న భంగిమలో మహావీరుని ప్రతిమను చూడవచ్చు. 


💠 ఇది హంపి నుండి 145 కి.మీ మరియు హుబ్లీ నుండి 106 కి.మీ.

కామెంట్‌లు లేవు: