విచార సంగ్రహం- 15 .
( భగవాన్ రమణమహర్షులు )
ఈ చిన్నగ్రంధము ఎంతో విలువైనది. ఎందువలన అంటే, 1901 -02 లో భగవాన్ రమణమహర్షి మౌనవ్రతంలో వుంటున్నప్పుడు, వారి పాదాలను ఆశ్రయించుకుని వున్న బ్రాహ్మణ పరమ భక్తాగ్రేసరుడు అయిన ‘ గంభీరం శేషయ్య ‘ గారికి ఆకాలంలో, వారు అడిగిన సందేహాలకు రమణులు వ్రాతపూర్వకంగా అనుగ్రహించిన వేదాంతసారం, యిందులో పొందుపరచ పడినది.
ఇందులో ముముక్షువులైన సర్వాధికారులకు అధికఫలం ఇచ్చే ఉపదేశములు వుండడడం వలన ఇది ' విచార సంగ్రహము ' అనే పేరుతో పిలువబడినది.
జ్ణానాష్టాంగము
ఇక్కడ మనం యమనియమాలను గురించి క్లుప్తంగా చెప్పకుందా౦
ముందుగా ‘ యమము ‘ అంటే, ' దేహము మొదలైన అనాత్మ విషయాలు అనిత్యము అయినవి. ' అని తెలుసుకుని, ఇంద్రియ వృత్తుల వ్యాపకాలను అణచివేయుట. విషయ రహితమైన, దృశ్య రహితమైన ప్రపంచంలో మనస్సును నిలపడానికి నిరంతరమూ కృషి చెయ్యడం.
‘ నియమము ‘ , ఆత్మ సంబంధమైన అనగా పరమాత్మ విషయముల మీద అపరిమిత ఆసక్తి పెంచుకోవాలి. విజాతీయ విషయములందు, తిరస్కారము చూపించాలి.
ఇక ‘ ఆసనము ‘ అనగా, ధ్యానానికి కూర్చునే ముందు, ఫలానా విధమైన ఆసనం వుండాలనే నిబంధన ఏదీలేదు. దేనిమీద కూర్చుంటే, ఎడతెగని బ్రహ్మచింతన సుఖముగా వీలు అవుతుందో, దేహముఎక్కడ సహకరిస్తుందో, అదే సరిఅయిన ఆసనము. అయితే అలాంటి సుఖమైన ఆసనము నిద్రలోకి దారితీసేటట్లు వుండకూడదు.
ప్రాణాయామము : రేచకమంటే వాయువును ముక్కు రంధ్రములద్వారా బయటకు వదలడం అని చెప్పుకున్నాముకదా ! ఆ బయటకు వదలడమనే ప్రక్రియను దేహాది అనిత్య ప్రపంచము యొక్క నామ రూపాలను బయటకు వదలడంగా అన్వయించుకోవాలి. పూరకమంటే, వాయువును గ్రహించడం అని తెలుసు కదా ! నామరూపములను వదిలిన తరువాత కలిగే సత్ చిత్ ఆనందములనే మూడు అంశాలను గ్రహించినట్లు భావించాలి. కుంభకం అనగా వాయువును బంధించి వుంచుకున్నట్లు, ఆ గ్రహి౦చిన సచ్చిదానంద స్వరూపాన్ని నిలుపుకోవడమే.
‘ ప్రత్యాహారం ‘ అనగా, రేచకంలో వదిలిన నామ రూపములను మనస్సు మరల గ్రహించుకోకుండా కాపాడుకోవడం. మరి ‘ ధారణ ‘ అంటే, కుంభకం లో పూరించుకున్న సచ్చిదానంద స్వరూపమే తన ఆత్మస్వరూపం అని తెలుసుకున్న తరువాత, దానిని మనసు దాటి వెలుపలకు పోనీయకుండా, హృదయ కమలంలో నిలుపుకొనడం.
‘ ధ్యానం ‘ అంటే, పంచకోశయుత దేహము నేనుకాదని బాగుగా గుర్తెరిగి ' నేను ఆత్మ స్వరూపమును ' అని నిశ్చయించుకుని, అహం స్వరూపంలో ఎడతెగకుండా వుండుట. చివరగా, ‘ సమాధి స్థితి ‘ అంటే, అహం స్ఫురణ కూడా కొట్టుకునిపోయి వున్న పరబ్రహ్మ సాక్షాత్కార స్థితి. అనగా తురీయాతీత స్థితి అని చెప్పుకున్నాము కదా ! అది అన్నమాట.
ప్రాణాయామము గురించి మరికొంత రేపు తెలుసుకుందాం.
స్వస్తి.
రమణుల అనుగ్రహంతో....🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి