*ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇంటింటా ప్రతిరోజూ దివ్య రామాయణ పారాయణం*
🌸🌸🌸🌸
*1 వ రోజు*
గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు… గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పర బ్రహ్మ… తస్మై శ్రీ గురవే నమః
శ్రీ విద్యాం శివవామ భాగ నిలయాం… హ్రీంకార మంత్రోజ్జ్వలాం
శ్రీ చక్రాంకిత బిందుమధ్య వసతిం… శ్రీమత్సభా నాయకీమ్
శ్రీ మత్‌షణ్ముఖ
విఘ్నరాజ జననీం
శ్రీ మజ్జగన్మోహినీం… మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం…
కారుణ్య వారాంనిధిమ్…
***
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి.
****
శ్రీమద్ రామాయణం ఆదికావ్యం.
వాల్మీకి మహర్షి, బ్రహ్మ అనుగ్రహంతో
మానవాళిని తరింపచేయడానికి ఈ మహాకావ్యాన్ని మనకు అందించారు.
వాల్మీకి మహర్షి ఒకరోజు తమసా నదికి స్నానాకి వెళ్ళాడు.
అక్కడ ఎదురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మమీద క్రీడిస్తూ ఆనందసాగరంలో ఉన్న ఒక పక్షుల జంటలోని మగపక్షిపై కిరాతుడు ఒకడు బాణం వేశాడు. అది విలవిలకొట్టుకుంటూ నేలరాలింది. ఆ బాణం దెబ్బతో ఆ మగపక్షి ప్రాణాలు విడిచింది. ఆ మగపక్షి చుట్టూ తిరుగుతూ ఆడపక్షి విలపిస్తుండడం చూసిన వాల్మీకి మహర్షి మనసు ద్రవించింది. ఆయన హృదయ లోని శోకం, శ్లోకంగా మారింది.
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్| |
ఓ కిరాతుడా! క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపావు. అందువలన నీవు ఎక్కువకాలము జీవించియుండవు. (శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు) అని ఆ కిరాతుడిని శపించాడు . అదే క్షణంలో బ్రహ్మ ప్రత్యక్షమై నీ నోట సరస్వతి పలికింది. కవిత్వం జాలువారింది. నువ్వు రామాయణ మహాకావ్యాన్ని రచించి మానవాళిని తరింపచేయి . అది భూలోకంలో శాశ్వతంగా ఉంటుంది.,అని సూచించి అక్కడినుంచి వెళ్లిపోయాడు.
*బాలకాండ*
అయోధ్యానగరంలో శ్రీ రామ లక్ష్మణ భరత శతృఘ్నులు ధనుర్ విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు.మహర్షుల యాగాలకు ఆటంకం కలిగిస్తున్న రాక్షసులను అంతం చేయడానికి దశరథమహారాజు సాయం కోరి విశ్వామిత్రుడు అయోధ్యా నగరానికి విచ్చేశాడు. రాజమందిర ద్వారం వద్ద నిలబడి తన రాకను దశరథ మహారాజుకు తెలియజేయమన్నాడు. విషయం తెలిసిన వెంటనే దశరథుడు సకల మర్యాదలతో విశ్వామిత్ర మహర్షికి సాదర స్వాగతం పలికాడు. ఏం కావాలన్నా ఇస్తానన్నాడు. విశ్వామిత్రుడు తాను వచ్చిన పనిని వివరించాడు. మారీచ సుబాహువులనే రాక్షసులు యజ్ఞయాగాలకు ఆటంకం కలిగిస్తున్నారు. వారిని శపించవచ్చు కానీ, యజ్ఞ క్రతువులో నిమగ్నమైనపుడు కోపం దరిచేరకూడదు. అందువల్ల వారిని శపించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో యాగరక్షణ జరగాలంటే శ్రీరాముడిని తన వెంట పంపాలని విశ్వామిత్రుడు దశరథ మహారాజు ను కోరాడు. ఈ మాట వింటూనే దశరథుడికి దిక్కుతోచలేదు. లేక లేక కలిగిన సంతానాన్ని ఇలా రాక్షస సంహారానికి పంపడమా అని బాధపడ్డాడు. రాముడి బదులు తాను వస్తానన్నాడు. ఏం కోరినా ఇస్తానని ఇప్పుడు మాట తప్పుతావా ఇది రాజధర్మమా అని విశ్వామిత్రుడు దశరధుడిని ప్రశ్నించాడు . వశిష్ఠుల వారి సూచన మేరకు విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులను పంపడానికి నిర్ణయించాడు.
అలా విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు ముందుకు సాగుతున్నారు. అలా తనను అనుసరిస్తున్న రామలక్ష్మణులకు సరయూ నదీతీరంలో - ఆకలి, దప్పికలు లేకుండా బల , అతి బల అనే విద్యలను విశ్వామిత్రుడు వారికి అనుగ్రహించాడు. దీనివల్ల వారికి ఎన్నటికీ ఆకలి , దప్పికలు ఉండవు.
ఆ రాత్రి వారు అక్కడే విశ్రమించారు.
మరునాడు ఉదయం తెల తెల వారుతుండగా
కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1
కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా!
పురుషోత్తమా! తూర్పు తెల్లవారుతోంది, దైవ సంబంధాలైన కార్యక్రమాలు చేయవలసి ఉంది. కనుక లెమ్ము అంటూ ఆ శ్రీరామ చంద్రమూర్తిని, విశ్వామిత్ర మహర్షి మేల్కొలిపాడు.
మహర్షి మేల్కొలుపుతో లేచి, సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకుని వారు అక్కడి నుంచి బయలుదేరారు. అలా నడుచుకుంటూ వారు మహారణ్యంలో ఒక జనపదం చేరారు. అక్కడ తాటక అనే రాక్షసి ఉంటున్నది. దాని గురించి రాముడికి తెలిపాడు మహర్షి. అగస్త్యుని ఆశ్రమ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తూ , జనాన్ని తింటూ ఇది బతుకుతున్నదని రాముడికి వివరించాడు. దీనికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని చెప్పాడు. తాటక స్త్రీ కదా చంపడం ఎలా అని సంకోచించకుండా , దుష్ట శక్తిని సంహరించమని సూచించాడు విశ్వామిత్రుడు.
రాముడు ధనుష్ఠంకారం చేశాడు. ఆశబ్దానికి తాటకి ఉగ్రురూపిణి అయి శబ్దం వచ్చిన దిక్కుగా వచ్చింది. రాముడు దాని చేతులు ఖండించాడు. సాయంత్రం అయితే దాని బలం ఇంకా పెరుగుతుంది కనుక వెంటనే దానిని సంహరించమన్నాడు. రాముడు తాటకిని సంహరించాడు. వెంటనే విశ్వామిత్రుడు రాముడికి దివ్యాస్త్రాలు అనుగ్రహించాడు. దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విష్ణు చక్ర,బ్రహ్మాస్త్ర, కాలపాశ,ధర్మపాశ, వరుణపాశ, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం ఇలా సమస్త్ర అస్త్రాలనూ అనుగ్రహించాడు.
తాటకి వధతో లోకం లో పుష్ప వర్షం కురిసింది. అక్కడి నుంచి విశ్వామిత్ర మహర్షి యాగం చేస్తున్న సిద్ధాశ్రమానికి వారు చేరుకున్నారు.
అక్కడ విశ్వామిత్ర మహర్షి యాగం మొదలు పెట్టారు. అంతే రాక్షసులు మారీచ సుబాహువుల అనుచరగణం అక్కడకు చేరుకుంది. రాముడు బాణాల వర్షం కురిపించి వారిని హతమార్చాడు. తాటక కొడుకు మారీచుడిపై బాణం సంధించాడు. వాడు వందయోజనాల దూరంలో సముద్రంలో పోయి పడ్డాడు.
ఇక రాక్షసులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. యాగం నిర్విఘ్నంగా సాగిపోయింది.
ఆ తర్వాత వారు అక్కడ నుంచి మిథిలా నగరానికి బయలుదేరారు. మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. అక్కడ అహల్య శాప గాథను విశ్వామిత్రుడు రాముడికి తెలిపాడు. నీ పాద స్పర్శతో ఆమెకు పూర్వ రూపం వస్తుందన్నాడు. రాముడి దృష్టి పడగానే అహల్య పూర్వ రూపంతో లేచి నిలబడింది. రామలక్ష్మణులు ఆ సాధ్వీమతల్లికి నమస్కరించి ముందుకు సాగారు. మిథిలా నగరంలో సీతా స్వయంవరం వార్త తెలుసుకుని విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను మిథిలకు తీసుకువెళ్లాడు. శివధనస్సును విరిచి సీతమ్మతల్లిని స్వయంవరంలో రామచంద్రమూర్తి దక్కించుకున్నాడు. దశరథుడికి కబురుపంపి సీతారామ కల్యాణానికి ఏర్పాట్లు చేశారు. లక్ష్మణ భరతశత్రుఘ్నులకూ వివాహాలు జరిపించారు.
దశరథుడు కొడుకులు, కోడళ్లతో అయోధ్యకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో పరశురాముడు ఎదురై, శివధనుస్సు విరిచినందుకు రాముడిపై ఆగ్రహించాడు. నూతన వధూవరులపై ఆగ్రహం తగదని దశరధుడు పరశురాముడిని వేడుకున్నాడు. కుదరదన్నాడు. తన దగ్గర ధనుస్సు తీసుకుని బాణం ఎక్కుపెట్టమని రాముడికి సవాలు విసిరాడు. రాముడు బాణం సంధించి వదిలాడు. వదిలిన బాణం లక్ష్యాన్ని ఛేధించక తప్పదు. నీ నడకను నిరోధించనా లేక నీవు తపస్సుతో ఆర్జించిన పుణ్యలోకాలను వదిలించనా అన్నాడు రాముడు. పుణ్యలోకాలను వదిలిస్తే మళ్లీ తపస్సు చేసి సాధించుకుంటానని పుణ్యలోకాలను వదులుకున్నాడు పరశురాముడు.
రాముడి శక్తి సామర్ధ్యాలను కీర్తించి పరశురాముడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇక అక్కడ నుంచి రథాలు అయోధ్య దిశగా కదిలాయి........
*****
ఆపదా మపర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.
****
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
*****
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీరామ రామ
రఘునందన రామ రామ!
శ్రీరామ రామ
భరతాగ్రజ రామ రామ!
శ్రీరామ రామ
రణకర్కశ రామ రామ!
శ్రీరామ రామ శరణం
భవ రామ రామ!
శ్రీరామ చంద్ర చరణౌ
మనసా స్మరామి!
శ్రీరామ చంద్ర చరణౌ
వచసా గృహ్ణామి!
శ్రీరామ చంద్ర చరణౌ
శిరసా నమామి!
శ్రీరామ చంద్ర చరణౌ
శరణం ప్రపద్యే!.
****
( బాలకాండ సమాప్తం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి