17, ఏప్రిల్ 2024, బుధవారం

అవశ్యం అనుభోక్తవ్యం

 *అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్*

```

తా॥ పుణ్యపాప రూపకర్మను ఎవరు చేసినా దానిని వారు తప్పక అనుభవించి తీరాల్సిందే!


కార్యకారణముల గొలుసే కర్మ. మనం చేసే పనేకాదు, చేయాలనే ఆలోచన, దాని ఫలితం కూడా అనుసరించి వస్తుంది.


కర్మలు మూడు విధాలు ‘సంచితం, ప్రారబ్ధం, ఆగామి’. ఇంతకు ముందు అనాది జన్మలలో ఆర్జించిన కర్మను ‘సంచితం’ అంటారు.


ఇందులోంచి ఈ జన్మలో ఈ శరీరముతో అనుభవించేదంతా ‘ప్రారబ్ధం.’


ఈ జన్మలో చేసినది వెనక నిలువలో కలిసి రాబోవు జన్మలో అనుభవించ వలసినది ‘ఆగామి’


మామిడి పళ్ళ కాపు నుండి పండిన మామిడి పండ్లను తీసి ఇచ్చినట్లుగా, భగవంతుడు ప్రతి జీవికి వాని కర్మానుగుణంగా పరిపక్వమైన  కర్మలను తీసి ఏడు జన్మలకు కేటాయిస్తాడు. 


ఏ కర్మఫలమును ఎప్పుడు ఏ విధంగా అనుభవించాలో నిర్ణయించేది భగవంతుడే!


గత జన్మలలో చేసిన పుణ్యకర్మల ఫలములు ఈ జన్మలో అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టే, ఈ జన్మలో సుఖం అనుభవిస్తున్నాడు. 


గత జన్మలలో చేసిన పాపకర్మలు, ఈ జన్మలో అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టే ఇప్పుడు మానవుడు కష్టాలుపడుతూ, కన్నీళ్ళ పాలవుతున్నాడు.


అందుచేత చేసే ప్రతి మంచి పని ఆ భగవంతుడే చేయిస్తున్నాడనీ, ఆ పని ఫలితం ఏదైనా అతనికే చెందుతుందని, బాధ్యత అంతా అతడిదేనని, తాను భగవంతుడి చేతిలో ఒక పని ముట్టు మాత్రమే అని దృఢంగా విశ్వసించి భగవత్, భాగవత (భక్త), ఆచార్య కైంకర్య రూపంగా అన్ని పనులూ చేయాలి.


భగవంతుడే అనుగ్రహించి కావలసినవన్నీ తానే ఇచ్చి, పూర్వకర్మలను అన్నింటిని తొలగించి, తనతో చేర్చుకుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మాధవసేవగా సర్వప్రాణికోటి సేవ చేయడమే మనిషికి భగవంతుడు అనుగ్రహించే వరం.


అదే మానవ జన్మకు సార్ధకత.!```

కామెంట్‌లు లేవు: