_*కర్మ సిద్ధాంతం - వాచికమైన పాపాలు*_
ఎప్పుడూ ఒకరిలో దోషాలు ఎంచకూడదు, తీర్పులు చెప్పకూడదు.
ఈ లోకంలో పెద్దపాపం ఏదైనా ఉందంటే అది ఇతరులలో దోషాలు ఎంచడమే, "తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరూ విశ్వదాభి రామ వినుర వేమ" అనే పద్యం కూడా మనం చదువుకున్నాము.
మనం సరిగ్గా ఉన్నామా, లేదా అనేది ముఖ్యం.
ఈ లోకంలో ఎవ్వరిని సరి చేయడానికి మనం రాలేదు, నిరంతరం మనల్ని మనం విశ్లేషించుకుని, మనలోని తప్పుల్ని సరిదిద్దుకోవాలి, ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలి.
ఇతరులలో దోషాలెంచితే, వారు చేసిన పాపంలో మనకూ భాగం సంక్రమిస్తుంది.
జీవుడు చేసిన పాపాలను లెక్కగట్టే పని చిత్రగుప్తునిది. గుప్తంగా (రహస్యంగా) చిత్రంగా మన పాపపుణ్యాలను లెక్కగడతాడు గనక ఆయన్ను చిత్రగుప్త అన్నారు.
మనలోని సూక్ష్మశరీరమే చిత్రగుప్తుడని ఒక సంప్రదాయం చెబితే, అది చిత్రగుప్తుని అంశ అని ఇంకో సంప్రదాయంలో చెబుతారు.
అందుకే ఆయనలో మనలోనే ఉంటూ, అన్నిటినీ నమోదు చేసుకుంటాడు, దేన్నీ వదలడు.
ఇతరుల దోషాలను ఎత్తి చూపడమే పనిగా పెట్టుకున్నవాడిని ఈశ్వరుడు అస్సలు వదిలిపెట్టడు, ఏ మాత్రం కనికరం చూపడు.
పైగా అది బోలెడు పాపాన్ని తెచ్చిపెడుతుంది.
ఒక్క గురువుకు మాత్రమే తన శిష్యుల లోపాలను ఎత్తి చూపే అధికారం ఉంది, అది గురువు యొక్క కర్తవ్యం కూడా.
పైగా చాలామంది చేసే పని ఏంటంటే, వాళ్ళు తీర్పులు చెప్పడమే గాక, పక్కన ఉన్న సహచరులతో అవును కదా? ఏమంటావు? వాడు అలాంటి వాడే కదా? అంటూ వానితో కూడా చెప్పించి, వానికి ఆ పాపంలో వాటా ఇస్తాడు.
అయినా ఎవరు ఎలా పోతే మనకెందుకు? మన సమస్యలే మనకు బోలేడు ఉంటాయి, కొత్త ప్రారబ్దాలెందుకు? అందరిని అన్నీ అనేసి, చేయాల్సినవన్నీ చేసేసి చివర్లో
క్రూరకర్మములు నేరక జేసితి నేరము లెంచకు రామా
దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా ||
అని రామదాసుగారి కీర్తన పాడితే రాముడు వచ్చి కాపాడడు సరికదా గట్టి శిక్ష వేస్తాడు.
సాధుసంతులు, సన్యాసులు, గురువులు, కర్మయోగులను ఏనాడు విమర్శించరాదు. పొరపాటున కూడా వారిని నిందించకూడదు.
నిత్యవ్యవహారంలో కర్మ చేసే సమయంలో అందరికీ పొరపాట్లు దొర్లుతాయి.
ఆ పొరపాట్ల వలన ఉద్భవించిన పాపం తమ స్వధర్మాలను నిష్ఠగా పాటించే మహాపురుషులకు అంటదు. అది ప్రకృతి యందు నిలిచి ఎవరిని చేరుదామా అని ఎదురు చూస్తూంటుంది.
ఎవరైతే సాధుసంతులను, సన్యాసులను, యోగులను విమర్శిస్తారో వారికి ఆ పాపం సంక్రమిస్తుంది.
కర్మయోగి అనే మనం ఒక వ్యక్తిని పిలిచినంత మాత్రం చేత అతడు కర్మయోగి కాజాలడు.
అలాంటి బిరుదు లేనంత మాత్రం చేత, కర్మయోగాన్ని నిష్ఠగా పాటించే వ్యక్తి కర్మయోగి కాకుండా పోడు.
అలాంటి గొప్ప వ్యక్తి అందరికి తెలియాల్సిన అవసరంలేదు, మౌనంగా తన పని తాను చేసుకుంటూ, అతి సామాన్యునివలే సాధారణ జీవనం గడపవచ్చు.
అలాంటి వారిని నిందించినా, వారి మీద ఆరోపణలు చేసినా, వారు చేసిన కర్మల్లో దోషాల కారణంగా ఏర్పడిన పాపం నిందించినవానిని జేరుతుంది. అది అతడి వంశాన్ని నాశనం చేస్తుంది.
ఇటువంటి మరో ఘోరమైన కర్మ - ఉపాసకులను, భగవత్భక్తులు, భాగవతోత్తములు, వేదవిదులను, సద్బ్రాహ్మణులను నిందించడం.
తెలిసి గానీ, తెలియకగానీ అటువంటివారి దరిదాపుల్లోకి చెడు భావనతో వెళ్ళరాదు. వారిని బాధిస్తే, వారు శపించకున్నా, అనేక దైవశక్తుల శాపాలు చుట్టుకుంటాయి.
ఇతరల లోకాల్లో ఉన నిందిచినవాని పితృదేవతలు ఏడుస్తారు.
వాటిని ఏ యోగి/ గురువు నిర్మూలించలేడు, ఆ పాపాన్ని అనుభవించడం తప్ప పరిహారం వేరే లేదు.
అది ఆ వంశాన్ని, ఆ జీవుడిని అధోగతి పాలు జేస్తుంది.
ఇవన్నీ అజ్ఞానంతో, అరిషడ్వర్గాలకు లోనై మానవులు చేసే తీవ్రమైన కర్మల్లో కొన్ని.
ఇవన్నీ వాచికమైన పాపాలు అనగా వాక్కు ద్వారా చేసేవిగా చెప్పబడతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి