ప్ర : పూవులను రేకులుగా విడదీసి పూజ చేయవచ్చా?
జ : పువ్వు అంటే లక్ష్మి, పువ్వు అంటే జ్ఞానం సరస్వతి. పువ్వు అంత కోమలమైనది, పువ్వు అంత పరిమళంతో కూడుకున్నది పువ్వు అంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు. అందులో ఎర్రటి పువ్వు కానీ నేలమీద పడి ఉంటే ఎవరైనా సరే దానిని తీసేయాలి ముందు. అది క్రింద ఉండకూడదు. ఎర్రపువ్వు క్రింద పడి సువాసిని కానీ, ఎవరు కానీ తొక్కకూడదు. సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు. ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు. ఎవరైనా తొక్కుతారు అని వెంటనే తీసి ఏ చెట్టు మొదట్లోనో పెట్టేయాలి. అంత పరమ పవిత్రమైన పువ్వులు పూజ చేయడానికి నీ దగ్గర సరిపోయినన్ని లేకపోతే ఒక్క పువ్వు ఉంటే ఆ ఒక్క పువ్వే వేసి మిగిలినది పూజలో ఏ పదార్థం లోటు వచ్చినా అక్షతలతో పూరణ చేస్తారు. నిజానికి పూజలో మనం చాలా ఇవ్వనే ఇవ్వం. మంత్రం ఒకలా ఉంటుంది. మనం అక్కడ ఇచ్చేది ఏమీ ఉండదు. సింహాసనం సమర్పయామి అంటారు. రోజూ పట్టుకువచ్చి సింహాసనం వేస్తున్నామా? అక్షతలు వేస్తారు. మనసులో భావన చేయాలి. ఎర్రటి మెత్తటి పరుపులు, పాదపీఠం, సింహం ముఖం తీసుకువచ్చి అక్కడ వేస్తే దానిమీద ఆయన కూర్చున్నట్లు భావిస్తాం. ’క్షతము’ అంటే విరిగిపోవడం; ’అక్షత’ నడుము విరగని పసుపు కలిపిన బియ్యం. అవి వేస్తే అందులోకి వచ్చేస్తుంది పదార్థం. ఈశ్వరుడికి అందిపోతుంది. అలాగే తాంబూలం. మనం నిజానికి ఏం చెప్తాం అంటే ఒక మాట చెప్తాం ’ముక్తాచూర్ణేన సంయుక్తే తాంబూలం ప్రతిగృహ్యతామ్’ – అసలు మంచి ముత్యం తీసుకువచ్చి కాలుస్తారు. దాని బూడిద ఒక సూది మొన పెట్టి తీస్తే ఎంత వస్తుందో అంత వేయాలి. అది కానీ ఎక్కువ అయితే నోరు అంతా పొక్కిపోయి బొబ్బలు వచ్చేస్తుంది. ముత్యపుగుండ అంత శక్తివంతం. తృణం వేస్తే చాలు నోరంతా ఎంత ఎర్రగా పండుతుందో! తాంబూలం ఐదోతనానికి గుర్తు. అందుకే భర్త తాంబూలం పూజలో పెడితే దానిని మధ్యాహ్నం భార్య వేసుకోవాలి. ఆమె తాంబూలం వేసుకుంది అంటే భర్తగారి భోజనం అయిపోయింది అని గుర్తు. అయిదోతనానికి గుర్తు తాంబూలచర్వణం. అమ్మవారు ఎప్పుడూ తాంబూలం నములుతూ ఉంటుంది. అటువంటి తాంబూలానికి మనం చెప్పే మంత్రం ఒకటి, ఇచ్చేది ఒకటి. భక్తితో తమలపాకులు పెట్టి అందులో వక్క, అక్షతలు పెట్టి దేవుడి దగ్గర పెడితే అప్పుడు పూర్ణంగా పదార్థాలు అన్నీ వేసి తాంబూలం ఇచ్చినట్లే. అన్నింటికీ అక్షతలు సరిపోతున్నప్పుడు పువ్వుల దగ్గర చిదిపేసి నలిపేసి రేకులు వేయమని ఎవరు చెప్పారు? ఒక అందమైన పువ్వును ఈశ్వరుడు ఎలా సృష్టించాడో చూస్తే మహాశిల్పి కనబడతాడు. అంత అందంగా ఆయన గుదిగుచ్చి పువ్వు తయారుచేస్తే తుంపి పూజ చేస్తారా? ఈశ్వరుడు అడిగాడా నిన్నుతక్కువైందని? తక్కువైందన్న మాట ఆయన అంటే జన్మలో పూజ చేయగలమా మనం? రోజూ సింహాసనాలు తెస్తామా? రోజూ పంచెలచాపులు తెస్తామా? పట్టుచీరలు తెస్తామా? దానికి పనికి వచ్చింది పువ్వుల దగ్గరకి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువైంది? ఎందుకు పువ్వులు అలా విడగొట్టేసి రేకులు చేయడం. అది హింస. పరమ కఠోరమైన మనస్తత్త్వంతో చేసేటటువంటి పని. కొంతమంది తెలియక చేస్తారు మనస్సు కఠినమై కాదు. మనస్సు కోమలంగా ఉంటుంది. తెలియక పొరపాటు జరుగుతుంది. అందుకే పువ్వును చిదమనవసరం లేదు. ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వే ఇవ్వండి. మిగిలినవి అక్షతలతో పూరణ చేయండి.
facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి