వైశాఖ పురాణం - 21
21వ అధ్యాయము - పాంచాలరాజు రాజ్యప్రాప్తి
నారదమహర్షి అంబరీష మహారాజుతో వైశాఖమహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! వినుము. శ్రీహరికి మిక్కిలి యిష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక కథను చెప్పుదును వినుము.
పూర్వము పాంచాలదేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు, గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు యేర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము, కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండువలె సారవిహీనములయ్యెను.
వాని బలహీనతనెరిగి వాని శత్రువులందరును కలసి దండెత్తి వచ్చిరి. యుద్దములో నోడిన రాజు భార్యయగు శిఖినితో గలసి పర్వతగుహలో దాగుకొని యేబదిమూడు సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నిట్లు విచారించెను. "నేను ఉత్తమ వంశమున జన్మించితిని. మంచి పనులను చేసితిని. పెద్దలను గౌరవించితిని. జ్ఞానవంతుడను. దైవభక్తి, యింద్రియజయము కలవాడను. నావారును నావలెనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో నెంతకాలముండవలయునో కదా! అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగనే వానివద్దకు వచ్చిరి.
రాజువారిద్దరికి నమస్కరించి యధాశక్తిగనుపచారములను చేసెను. వారిని సుఖాసీనులగావించి దీనుడై వారి పాదములందుపడి నాకిట్టి స్థితియేల వచ్చెను? నాకు తరణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పినమాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై యిట్లనిరి. రాజా! నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత పదిజన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మప్రవృత్తి కొంచమైనను లేదు. సద్గుణము లేవియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవైయుంటివి. అందరిని బాధించుచు, బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశముననున్నవారికి భయంకరుడవై యుంటివి. ఇట్లు అయిదు సంవత్సరములు గడచినవి.
బాలురను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీజన్మయందును సంతానము లేకపోవుటకును నీపూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడును లేకుండిరి. అందరిని పీడించుట చేతను దానమన్నది లేకపోవుటచేతను నీవు దరిద్రుడవుగా నుంటివి. అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకిప్పుడు యీ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నిప్పుడు నీ రాజ్యము శత్రువులయధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము.
నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలోనుండగా ధనవంతులగు యిద్దరు వైశ్యులు కర్షణుడనుముని నీవున్న యడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింటదాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ యడవిలో పరిగెత్తుచు, యెండకు, దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్ష్ణణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసరి వానికి సేవచేసి వానిని సేదతీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు మునీ! నీకు నా వలన భయములేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును. కాని పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను.
అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితిని దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసిపొమ్ము. రాజభటులు నాకై రావచ్చును కావున నేను నీవెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లనిగాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచటనున్నదో తెలిసికొనుటకై ఆ మునికి సేవలు చేయుటవలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయమార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖమాసమగుటచే నీవు తెలియకచేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజ వంశమున జన్మించితివి.
నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలెనని యనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖమాసము. నీవు వైశాఖశుద్ద తదియ యందు ఒకసారి యీనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతః కాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపుము. నీవు భక్తిశ్రద్దలతో వైశాఖ వ్రతము నాచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానములను చేయుము. లోకములన్నియు నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలి పోయిరి.
రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తిశ్రద్దలతో నాచరించెను. యధాశక్తిగ దానములను చేసెను. వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరును మరల వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగ తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదలకంటె అధికముగ సర్వసంపదలను పొందెను. వైశాఖవ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగ నుండెను. వానికి ధృష్టకీర్తి, ధృష్టకేతువు, ధృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను అయిదుగురు పుత్రులు కుమార స్వామియంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరును వైశాఖమాస వ్రత మహిమ వలన రాజానురక్తులై యుండిరి.
రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్దలతో వైశాఖవ్రతము నాచరించి యధాశక్తి దానధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చలభక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖశుద్ద తృతీయ అక్షయతృతీయనాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులయందు శంఖచక్రగదా ఖడ్గములను ధరించి పీతాంబర ధారియై వనమాలావిభూషితుడై లక్ష్మీదేవితో గరుడాదిపరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని జూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసికొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గదస్వరముతో శ్రీహరిని జూచుచు ప్రభుభక్తితో ఆనందపరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను.
అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెనని నారదమహర్షి అంబరీషునితో పలికెను.
వైశాఖ పురాణం 21వ అధ్యాయం సమాప్తం
ఓం నమో నారాయణాయ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి