27, జూన్ 2024, గురువారం

మాటతో... చూపుతో..

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


            *మాటతో... చూపుతో...!*

                    ➖➖➖✍️

```

రామ పరాక్రమంతో చేతలుడిగి హతాశుడై యుద్ధరంగంలో నిస్సహాయంగా నిలబడిపోయిన రావణుడితో రాముడు అన్నదల్లా ఒకేఒక్క మాట- 'నేడు పోయి రేపు రా!’ అని. 


ఆ ఒక్కమాట దశకంఠుణ్ని జీవచ్ఛవంగా మార్చేసింది. ముల్లోకాలను జయించిన మహాయోధుడు రావణాసురుడు. అలాంటివాణ్ని నిలువునా దహించివేసింది- ఆ ఒక్కమాట!✍️



కురుక్షేత్ర సంగ్రామం చివరి దశలో భీముడి గదాఘాతానికి తొడలు పగిలి సుయోధనుడు దుర్మరణం చెందాడని భారతం చెబుతోంది. 


వాస్తవానికి అతడు ఘోషయాత్ర ఘట్టంలోనే సగం చనిపోయాడు. 


అరణ్యవాసం చేస్తున్న పాండవులను వేధించడానికి దుర్యోధనుడి పరివారమంతా కట్టకట్టుకొని వచ్చారు. చిత్రసేనుడనే గంధర్వరాజు వారందరినీ బంధించాడు. పాండవులే వచ్చి విడిపించి, ధర్మరాజు దగ్గర పంచాయతీ పెట్టారు. “ఇక్కడ జరిగిన అవమానం నీ రాజధాని ప్రజలకు తెలియదు కాబట్టి ఏమీ జరగనట్లు తిరిగి వెళ్ళిపో. ఇకపై బుద్ధి కలిగి ఉండు” అన్నాడు ధర్మరాజు. 


ఆ మాట సుయోధనుడికి ఎక్కడ ఎలా తగలాలో అక్కడ అలా తగిలింది. 'ఇప్పటికిప్పుడు భూమి చీలి నేను అందులో కప్పడిపోతే బాగుండేది' అని తానే అన్నాడు. ప్రాయోపవేశం చేయడానికి సైతం సిద్ధపడ్డాడు. అభిమాన ధనుడైన సుయోధనుణ్ని ధర్మరాజు కేవలం మాటలతో చంపేసిన తీరును ఎర్రన గొప్పగా వర్ణించాడు.✍️



సుడాన్ దేశాన్ని 1990 సంవత్సరంలో భయంకరమైన కరవు పీడించింది. ఆకలి దప్పులతో ప్రజలు అలమటించిపోయారు. 


ఆ కరవు తీవ్రతను ప్రతిబింబించిన ఫొటో ఒకటి ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. 


ఎముకల పోగులా ఉన్న ఓ పసిపాప చిన్న రొట్టెముక్కను- తన వెనక కాచుకొని కూర్చొన్న రాబందు ఎక్కడ ఎత్తుకుపోతుందోనన్న భయంతో దాన్ని గుండెలకు అదుముకొన్న ఫొటో అది. 


నిజానికి రాబందు వేచి చూస్తున్నది- రొట్టె ముక్క కోసం కాదు. ప్రాణాలు గుటుక్కుమంటే ఆ పాపను పీక్కుతిందామని! 


ఇప్పటికీ ఎంతోమందికి ఆ ఫొటో గుర్తుండిపోయింది.


పరమ హృదయవిదారకమైన ఆ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన దక్షిణాఫ్రికా ఫొటోగ్రాఫర్ కెవిన్ కు లెక్కలేనన్ని ప్రశంసలు దక్కాయి. సన్మానాలు జరిగాయి. కెవిన్ పేరు ప్రపంచమంతటా మారుమోగింది. 

At that moment (సందడిలో) కెవిన్ కు ఓ ఫోనొచ్చింది. 


'సార్! ఆ పాప ఏమయింది? ఉందా,చనిపోయిందా?' అని అడిగారెవరో.


 'ఏమో మరి! ఆ విషయాన్ని నేను పట్టించుకోలేదు' అన్నాడు కెవిన్.


'ఓహో! అయితే రోజు పసిపాప చావుకోసం కాచుకొన్నది రెండు రాబందులన్నమాట! ఒకటి- ఫొటోలో కనబడుతున్నది, 

రెండోది- ఈ  ఫొటో తీస్తున్నది' అనేసి ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. 


ఆ ఒక్క వాక్యం ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిందంటే- 1993లో కెవిన్ తన 33వ ఏట ఆత్మహత్య చేసుకున్నాడు.


మహాయోధులమో, అభిమానధనులమో కాదు కాబట్టి... మాట మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. 


ఏ లారీయో గుద్దేసి పోతే రక్తం ఓడుతూ కొన ఊపిరితో ఓ మనిషి కొట్టుమిట్టాడుతుంటే హాస్పిటల్ కు చేరుద్దామనో, ఆంబులెన్స్ ను పిలుద్దామనో అనుకోకుండా ఆ వ్యక్తితో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించే మనలోని 'కెవిన్' కేసి, ఆ మనిషి చూసే చివరిచూపు చాలు- మనల్ని జీవచ్ఛవాల్ని చేయడానికి!✍️```

              -ఎర్రాప్రగడ రామకృష్ణ.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

కామెంట్‌లు లేవు: