మామిడి పండు
ఈ
రోజుల్లో మనం ఒక విధంగా అపక్వపు మామిడి పండ్లను పండిన మామిడి పండ్లాగా
భవిస్తూ సేవిస్తున్నాము. పూర్తిగా పక్వానికి రాని మామిడి కాయలను కోసి
వాటిని ఒక సమూహంగా అమర్చి కింద క్యాలీషియమ్ కార్బైడు రాళ్లను(CaC2) పరచి
దానిమీద నీళ్లు చల్లుతున్నారు. అప్పుడు కార్బిడెనుండి ఎసిటిలీను వాయువు
(C2H2) వచ్చి కాయలను పండినట్లుగా చేస్తుంది. మనం ఇటువంటి కాయలను
కొనేటప్పుడు కొన్ని సందర్భాలలో అక్కడక్కడ గ్యాసు చేరని చోట ఆకుపచ్చదనం
కనపడుతూవుండటము మీరు
గమనించే వుంటారు. తొందరగా కాయలను (పండ్లను) అమ్ముకొని సొమ్ముచేసుకోవాలనే
వ్యాపారస్తులకు ఇది అనుభవైకమైనదే.
నిజానికి చెట్టు మీద కొంతకాలం అయిన తరువాత మామిడి కాయ పక్వానికి వస్తుంది. పక్వానికి వచ్చిన మామిడి కాయ పసుపు వర్ణానికి రావచ్చు లేక ఆకుపచ్చగా కూడా ఉండవచ్చు కానీ దాని పక్వస్థితి పరిపక్వతగా మరీన మరుక్షణం పండు తొడిమనుండి విడివడి క్రింద పడుతుంది. అట్లా క్రింద పడిన పండును మీరు ఎప్పుడైనా తిన్నారా దాని రుచి అమోఘంగా ఉంటుంది. మధురఫలం అంటే అదే అన్నట్లు ఉంటుంది. ఇది నిత్యజీవితంలో మనకు తెలిసిన విషయమే అదే రకంగా సాధకుని ఆధ్యాత్మిక జీవనం కూడా ఉంటుంది. ఈ సత్యాన్నే మనకు మహా మృత్యుంజయ మంత్రం చెపుతున్నది. (మంత్రం నిఘాడమైనది పవిత్రమైనది కాబట్టి ఇక్కడ వ్రాయకుండా కేవలం పేర్కొనటం జరిగింది)
కర్మపరిపక్వత:
సాధకుడి కర్మ పరిపక్వత చెందినప్పుడు ఏరకంగా అయితే మామిడి పండు రాలి భూమి
మీద పడ్డదో అదే విధంగా సాధకుని కర్మ పరిపక్వత అయిన తరువాత ఐహిక జీవనం
నుండి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనంలోకి వెళతాడు. చుట్టూ వున్నవారికి
సాధకునికి భార్య పిల్లలు ఉన్నట్లు అతను వారితో సంబంధం పెట్టుకున్నట్లు
గోచరిస్తున్నా కూడా సాధకుని మనస్సు పూర్తిగా భగవంతుని మీదనే ఉంటుంది.
భవబంధాలు కేవలం తన భాద్యతలుగా మాత్రమే సాధకుడు తలుస్తాడు. నిత్యం పరబ్రహ్మ
మీదనే తన జాసను ఉంచి నిరంతరమూ దైవ చింతనతోటె కాలాన్ని గడుపుతాడు. సాధకుడు
ఆచరించే ప్రతి కర్మను కేవలము భగవంతునికోసం మాత్రమే చేస్తున్నట్లు భావిస్తూ
చేస్తాడు. సాధకుని జీవితంలో తనకు తెలియకుండానే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అవి ఏమిటంటే ఆహరం. నిద్ర, ధ్యానాదులు. సాధకుడు మితంగా
ఆహరం తీసుకుంటాడు. ఇతరుల గురుంచి తక్కువగా ఆలోచిస్తాడు. ఇతరులు తనను
విమర్శించినా కూడా వాటిని తీవ్రంగా భావించడు. సదా తాను ముక్తుడు అవటానికి
సమాజాన్ని ధర్మ మార్గంలో నడపటానికి మాత్రమే ప్రయత్నిస్తుంటాడు. తన
ధర్మాచరణలో చేసే విమర్శలను అస్సలు పరిగణలోకి తీసుకోడు. కేవలం తన దారిన
తాను పోతూవుంటాడు.
సాధకుడు
కాని వారు ఇటువంటి వ్యాసాలను ఆసాంతము చదవలేరు. ఒక వేళ చదివిన దానిని
విమర్శించి అందులో ఏమిలేదు అనేవిధంగా మభ్యపెట్టడానికి ప్రయతినిస్తారు.
అటువంటి వారిని వాచా వేదాంతులు అంటారు. ఇటువంటివారు వారికి తెలిసిందే
శాస్త్రమని దానిని మాత్రమే అంగీకరిస్తాము అని అనటమే కాక కూపస్థ మండూకము లాగ
తన సిద్ధాంతాన్ని సంపూర్ణ జ్ఞానంగా భావించి ఇతరులను తప్పు తోవ
పట్టిస్తారు. ప్రస్తుతం మన సమాజంలో వాచా వేదాంతులు పెరిగిపోతున్నారు.
జ్ఞానులు వారి చేష్టలను ఆపవలసిన అవసరము ఎంతైనా వున్నది. ఇటువంటి వారి వల్ల
ధర్మానికి గ్లాని కలిగే ప్రమాదం కూడా వున్నది. జ్ఞాని తన జ్ఞానంతో తన
ముక్తిమార్గం చూసుకొని మోక్ష సిద్ది పొందక సమాజంగురించి ఎందుకు ఆలోచించాలి
అని కొందరు విమర్శిస్తారు. అట్లా జ్ఞానులంతా తనకు ఈ సమాజం సంబంధంలేదు నా
మోక్ష చింతన నాకు చాలు అని అనుకుంటే మనకు ఉపనిషత్తులు లభించేవి కావు.
శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ వివేకాననంద స్వాములు మన ధర్మాన్ని ఉద్ధరించే
వారు కాదు. నిజానికి ఇప్పుడున్న సమాజాన్ని ఉద్దరించటానికి ధర్మ పరులైన
జ్ఞానుల అవసరము ఎంతైనా వున్నది. శ్రీకృష్ణ పరమాత్మా బోధించిన శ్రీమత్
భగవత్గీత ఇప్పటికి నిత్యనూతనమై విరాజిల్లుతున్నది. మన మహర్షులు మనకు
ప్రబోధించిన ఉపనిషత్తులు వేదాంత గ్రంధాలుగా సాధకులకు అనుసరణీయాలుగా
వున్నాయి . శ్రీ ఆది శనకరాచార్యులవారు మనకు అందించిన వాజ్గ్మయము ఇప్పటికి
తత్వవేత్తలకు నిత్యపారాయణ గ్రంధాలుగా విలసిల్లుతున్నాయి. ప్రతి రోజు మన
భారతావనిలో అనేకులు తాత్వికులు వారి వారి అనుభవాలతో మనలను జ్ఞానవంతులను
చేస్తున్నారు. నిత్యము వారి అడుగుజాడలలో నడవాల్సిన అవసరము ప్రతి సాధకునికి
వున్నది.
సాధకులు నిరంతరసాధన చేస్తూ బ్రహ్మజ్ఞానాభిలాషులై నిరంతరం బ్రహ్మలో లీనమై ఉండాలి. మోక్షము అనేది చాలా చాలా కష్టంతో కూడుకొన్నది దానికోసం నిరంతరం కృషిచేయాలని మన ఉపనిషత్తులు మనకు తెలుపుతున్నాయి.
సాధకుడు ఈ జన్మలో సాధన మొదలుపెట్టి నిరంతర కృషి సలుపుతే మోక్ష సిద్ది కలుగవచ్చు. కాకపోయినా శ్రీకృష్ణ భగవానులవారు మనకు గీతలో పేర్కొన్న విధంగా మనం సాధన ఎంతవరకు చేసి ఈ దేహాన్ని వదులుతామో అక్కడినుండి మరుజన్మలో సాధన మొదలు పెడతాము. కాబట్టి సాధన చేతుష్టయాన్ని ఆచరించి మనస్సును నిర్మలపరచుకొని నిరంతర సాధన చేయవలెను. 84 లక్షల జీవరాశిలో ఉత్కృష్టము జ్ఞ్యానమయం అయిన ఈ మానవ జన్మ మనకు ఈ రోజు లభించింది. దానికి కారణం మన పూర్వ జన్మ శుక్రతమే. ఈ జన్మలో మనకు మోక్ష సిద్ది కలుగక పోయిన కానీ మరుసటి జన్మను కూడా మనం మానవులుగా పుట్టేటట్లుగా మన సాధన ఉండాలి. అప్పుడే మనం అంచలంచలుగా మోక్ష పదానికి చేరుకొని మోక్ష సిద్ధిని పొందగలము.
ఓం శాంతి శాంతి శాంతిః
ఇట్లు
మీ భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి