22, సెప్టెంబర్ 2024, ఆదివారం

భరోసా

 *అనగనగా ఒక పిరికివాడు ఓ శ్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కూడా వెళదాం అనుకున్నాడు. ఇంతలో కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే చూసి, అతనితో పాటు ధైర్యంగా శ్మశానం దాటేసాడు.*

నిజానికి ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట!

కానీ కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడుగా ఉన్నారనే ఒకే ఒక్క భరోసా వాళ్లిద్దరినీ శ్మశానం దాటేలా చేసింది.


నిజ జీవితంలోనూ మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే. అదే నేను ఉన్నాను అనే "భరోసా".

ఒక్క మాట సాయం.. ఏమీ కాదు.. 'నేను ఉన్నా' అనే చిన్న మాట చెప్పి చూడండి. మనిషికి ఎంత బలం వస్తుందో.!

ఆ కొండంత బలంతో మనిషి ఏదైనా చేయగలడు.


ఓసారి ఓ పెద్దాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయం కోసం చుట్టూచూస్తే ఓ రైతు కనిపించాడు. పరిస్థితి చూసిన రైతు, "ఉండండి సారూ, నా ఎద్దుతో కారును బైటకు లాగుదాం" అని దగ్గరలోని తన పొలం నుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్ని చూస్తూనే ఆ పెద్ద మనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!


రైతు ఎద్దుని కారు ముందువైపు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా ఆలోచిస్తున్నరూ.. తిన్నదంతా ఏమైందిరా, బండిని లాగండిరా..." అని ఉత్సాహంగా అదిలించాడు.

అంతే! రాజు ఆ కారుని ఒక్క ఉదుటున బయటకు లాగేసింది.

అప్పుడు ఆ పెద్దాయన ఆశ్చర్యంతో " ఏమండీ, ఉన్నది ఒక ఎద్దేకదా? మీరేంటీ‌.. అన్ని పేర్లు పెట్టి అదిలించారు?" అన్నాడు.

అప్పుడారైతు "ఈ రాజు బక్కచిక్కిందే కాదండీ.. గుడ్డిది కూడా.! ఐతే, తను కాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది. అంతే!" అని సమాధానమిచ్చాడు.

'పూర్తి నమ్మకంతో చేస్తే.. ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!' రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు.!


పూర్వం పదిమంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే.. అలాంటి ధైర్యమే కారణం.

ఉమ్మడి కుటుంబాలలో "మేమున్నాం" అనే భరోసా.!

కానీ నేటి రోజుల్లో ఒక్క పిల్లో, పిల్లోడో చాలురా దేవుడా!

అనుకోవటానికి కారణం..

'మేమున్నాం.. మంచీ చెడు చూస్కోటానికి' అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మనచుట్టూ లేకపోవటమే.


*కష్టంలో ఉన్న మనిషికి 'నేనున్నాను' అనే ఒక భరోసా ఇవ్వండి.*

_అదీ కుదరక పోతే.. కనీసం ఒక్క మాట సాయమైనా చేయండి._

*ఎందుకంటే మనిషికి మనిషే కదా భరోసా.*

*మనలో ఒకరికి ఒకరం* 

*`ఐక్యతే మనందరి బలం.`*

కామెంట్‌లు లేవు: