11, అక్టోబర్ 2024, శుక్రవారం

హైందవం వర్ధిల్లాలి 27*

 *హైందవం వర్ధిల్లాలి 27*


సభ్యులకు నమస్కారములు.


*మహిళా గౌరవం, ఆశ్లీలతలకు  తావివ్వని విధంగా సముచిత, సమున్నత స్థానం స్త్రీల కివ్వాలి, గౌరవించాలి* 

ii):- ఇటీవలి కాలంలో అనగా ఒక దశాబ్ద కాలంగా ప్రజలు నాల్గవ తరగతి ఉద్యోగస్తులు మొదలుకొని  ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు ఆంగ్ల మాధ్యమం గల పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. నేటి బాల బాలికలపై అమ్మ, నాన్న మరియు ఇతర పెద్దల పెంపకం కంటే ఆంగ్ల విద్యా ప్రభావం ఎక్కువగా గోచరిస్తున్నది. నాల్గవ తరగతిలో ప్రవేశించగానే పిల్లలు *అమ్మా యు డోంట్ నో, నానమ్మ యు డోంట్ నో, అమ్మమ్మ యు డోంట్ నో*  అను పదాలను ప్రయోగిస్తున్నారు. పిల్లల ఈ వైఖరి నగర ప్రాంతాలలోనే గాకుండా LKG UKG, Primary తరగతులున్న అన్ని ప్రాంతాలలో దృశ్యమగుచున్నది.


బాల్యం వరకు బాగానే ఉంటుంది జీవితం. బాల బాలికల స్థాయి నుండి యువతి యువకుల స్థాయి వరకు ఎదిగిన తదుపరి వారి భావి జీవితంపై మంచి చెడుల ప్రభావం ఉంటుంది. గత వ్యాసాలలో తెలుసుకున్నట్లుగా  ప్రస్తుత సాంస్కృతిక, సంప్రదాయాల సమ్మేళనం వలన మిశ్రమ జీవన  పద్ధతులు, యువతీ యువకుల మనో బుద్ధులలో తిష్ట వేసుకున్నందున *అధిక యువతరం*  బరువు బాధ్యతలకంటే *విలాస, విషయ (ఇంద్రియ, రూప రసాదులు),  సుఖలాలసల ధోరణికే మ్రొగ్గు చూపుతున్నారు. కాలమేదైనా, పరిస్థితులు ఏవైనా బాధ్యతా రాహిత్య జీవితము నష్టదాయకమే గాకుండా గర్హనీయము మరియు ఇతరులకు ఏహ్యభావము,  తక్కువ భావము కలిగిస్తుంది కూడా*  


యువతలో కొన్ని తప్పు దారులు గమనిద్దాము. *విచ్చలవిడి ప్రవర్తనలు, ఒకరి ఫోన్ నంబర్ లు  ఇంకొకరు తీసుకోవడం, అశ్లీల  వీడియో (Porno Videos), అశ్లీల చిత్రాలు (ఫోటోలు), సెలవు వచ్చిందంటే  క్లాసెస్ ఉన్నాయనో, కంబైన్డ్ స్టడీ పేరుపై ఇంటి బయట గడపడం, హోటళ్ళు, పబ్లు, ఫామ్ హౌజ్ లలో హద్దుమీరిన ఖర్చులు,  ప్రవర్తన ఇందులో మరింత విపరీత వైఖరి....చేసే తప్పులను కొండంతలుగా వర్ణిస్తూ మిత్రుల మధ్య వెలిగిపోవాలనే తపన, దాంతో బాటు సెల్ఫీలు ,Videos, likes, comments  కొరకు తాపత్రయాలు*.   వాస్తవానికి ఇవన్నీ వారి వారి గౌరవాన్ని తగ్గించేవే కాక ఆరోగ్యం రూపుమాపు చర్యలే తప్ప *పెద్దలు మరియు చట్టం అంగీకరించనివి*


తల్లి తండ్రులు ఇతర పెద్దలు తమ సంతానానికి చిన్నప్పటి నుండే సరైన మార్గాలు సూచించాలి.  అసభ్య మార్గాలకు దూరంగా ఉంచాలి. ఇంటి పనులు నేర్పాలి. ఇందువల్ల *కష్టించే తీరు, కుటుంబ సభ్యులందరితో ఆత్మీయత, బాధ్యత* ఒకరికోసం మరొకరు సహకరించడం అనేది నేర్పాలి. *"మనము"  "మన" అనే ఆత్మీయత ప్రేమ అనుబంధం పెరుగుతుంది, బాధ్యతలు తెలుస్తాయి. డబ్బు విలువ తెలియజెప్పాలి.  యువతీ యువకులలో వర్తమానాన్ని, కాల నియమాన్ని  సరిగా వినియోగించుకోవాల్సిన ఆలోచనలను తీరును పెంచాలి. లేకుంటే సంతానం యొక్క భవిష్యత్తుకు ఇబ్బందులు తప్పవు. తప్పు మార్గాన నడిచే వ్యక్తులకు సమాజంలో గౌరవం దక్కదు*. 


గౌరవం అనేది స్నేహాలను, సంబంధాలను కలిపి ఉంచే ప్రధాన  మాధ్యమము.  గౌరవింపబడాలంటే ప్రతి పౌరుడు, వ్యక్తి ప్రవర్తనలో ఉత్తమ నియమాలు, తల్లి దండ్రుల పట్ల పెద్దల పట్ల, దైవంపట్ల భక్తి, చిన్న వారి పట్ల ఆప్యాయత, పండుగలు సంప్రదాయాల ఆచరణలు కల్గి ఉండాలి. *సమాజం అనేది సామాజిక సంబంధాల అల్లిక, ఒక కూర్పు. "ఒకరి కొరకు ఒకరు" అను భావజాలంతో కూడుకొని ఉన్నదే సమాజము*. గతంలో హిందూ ధర్మాలను, సంప్రదాయాలను  "తు" "చ" తప్పకుండా అనుసరించే వారు కావున గౌరవాలకు కొదవ ఉండేదికాదు, గౌరవం, ప్రేమ పుష్కలంగా ఇచ్చేవారు,  పొందేవారు కూడా. *కావున మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు/వ్యక్తీ కంకణం కట్టుకోవాలి*. గతంలో లాగే స్త్రీలతో సహా అందరూ పేరు ప్రతిష్ఠలు, గౌరవం పొందాలి.


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: