17, అక్టోబర్ 2024, గురువారం

కర్త భగవంతుడా

 *♿కర్త భగవంతుడా ? నేనా? అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి?* 


ఈ ప్రశ్నకు భౌతికంగా, ఆధ్యాత్మికంగా తీసుకోవచ్చు.


*కర్తను నేను అని తలిస్తే...*


శరీరంతో నామంతో ఉన్న "నేను" కర్తను అని తలిస్తే  అన్నిటికీ మూలకారణం "నేనే.",  "నేనే" చేస్తున్నాను, నేను లేకపోతే ఏమి ఉండదు, నా వల్లే ఇదంతా జరుగుతుంది. మొదలగు భావాలు కలిగి నేను కర్తను అని తలిస్తే...నేను సుఖాన్ని అనుభవిస్తాను, కష్టాన్నీ కూడా నేనే అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడ భగవంతుని ప్రమేయం ఉండదు.నాకు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు ఏ విధంగాను సహాయ పడడు. అదేవిధంగా నాకు సుఖాలు వచ్చినప్పుడు భగవంతుడు అడ్డుపెట్టడు. 


*నేను కర్తను కాను, కర్త ఆ భగవంతుడే అన్నప్పుడు...*


ఇక్కడ సాక్షిత్వం, శరణాగతి వస్తాయి. చేసేది అంతా ఆయనే, నాచే చేయిస్తున్నాడు ఈ కార్యంతో లేదా ఈ వ్యవహారంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు అంటే, మంచి జరిగినా చెడు జరిగిన ఆ ఫలితాలు అన్ని ఆయనవే... ఇక్కడ కేవలం సాక్షి భూతంగా మాత్రమే ఉంటాను. ఇంకా చెప్పాలి అంటే భగవంతుని యొక్క ఉపకరణంగా ఉంటే నేను దేహ పరంగా ఏ విధమైన ఆలోచన చేయకుండా ప్రతీ వ్యవహారం ఆయనే చేయిస్తున్నాడు, అన్న ఆలోచనతో లేదా భావంతో చేస్తే ఫలితం నేను పొందవలసిన అవసరం ఉండదు.  ఇక్కడ కూడా సుఖదుఃఖాలు వస్తాయి కానీ ఆ ఫలితాలు భగవంతుడికి వెళతాయి. 


నేను అనగా శరీరంతో ఉన్న నేను ఎప్పుడైతే మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధితో భగవంతునికి శరణాగతి చెందుతానో నా బాగోగులు అన్ని ఆయనే చూసుకుంటాడు ఇక్కడ కష్టం అనేది రాకుండా భగవంతుడు చూసుకుంటాడు ఎలా అంటే, ఏమి చేసినా ఆయనకు చెప్పి ఆయన అంగీకారం తీసుకుని ఆయన చెప్పిన విధంగా నడిచినప్పుడు. 


మరి భగవంతుడు మనకు కనబడుడు కదా అన్న ప్రశ్న ఉదయించినప్పుడు, ఆ భగవంతుని స్థానంలో నీ గురువుని లేదా నీ తండ్రిని చూసుకో అప్పుడు వారు చెప్పినప్పుడు వారు చెప్పినట్లు నీవు ఆచరించినప్పుడు నీకు సుఖం వస్తే నీవే అనుభవిస్తావు. నీకు కష్టం వస్తే ఆ భగవంతుడు లేదా ఆ భగవంతుడు రూపంలో ఉన్న గురువు లేదా తండ్రి అడ్డుపడతాడు. ఇది సూత్రం.  దీని అర్థం చేసుకొని ముందుకు వెళుతూ జీవితం సాగిస్తే,జీవితం  ఆనందదాయకం లేకపోతే దుఃఖకరమైన జీవితంగా ఉంటుంది.


*నాకు తెలిసినంతవరకు అర్థం చేసుకుంటున్నాను. నా అన్నవారు మీ అందరికీ అందిస్తున్నాను. ఆనందంగా జీవిద్దాం.*


         - SHREE SWAMI NARAYAN


  (Source: Manasasarovaram Group)


     🙏 *సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు*


                 Sharing is Caring

కామెంట్‌లు లేవు: