**తిరుమల సర్వస్వం -75*
*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 14*
*సూర్యప్రభ వాహనం*
బ్రహ్మోత్సవాల్లో ఏడవరోజు ఉదయం సప్తగిరీశుడు ఒక్కరే - ఏడు గుర్రాలు పూన్చిన రథంపై, ఏడంతస్తుల కనకపు సింహాసనాన్ని అధిష్టించి, వజ్రకవచధారియై; బాలభానుడు తన ఉదయపు లేలేత కిరణాలతో నమస్కారాలు సమర్పిస్తుండగా మాడ వీధుల్లో ఊరేగుతూ *"సూర్య మండలం మధ్యనున్న నారాయణ మూర్తిని నేనే"* - అని భక్తులకు సందేశమిస్తారు.
*"ధ్యేయస్సదా సవిత్రృమండల మధ్యవర్తి నారాయణః"* అంటే, *"సూర్య మండలం మధ్యలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ ధ్యానింప దగినవాడు"* అని వేదశృతి. అందుకే హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారాలు, సూర్యోపాసన చేసే సంస్కృతి ఉంది. గాయత్రీ మంత్రంతో సూర్యనారాయణుణ్ణి ఆరాధిస్తాము. సూర్యుడు తేజోనిధి. నిత్యం కంటికి కనిపించే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడు ప్రకృతికి, జీవులకు చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల కలిగే పాడి పంటలు, చంద్రుడు అతని షోడశకళల వల్ల వృద్ధిచెందే ఔషధులు; అన్నీ సూర్యప్రసాదితాలే. సూర్యుడు కర్మసాక్షి,
నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిని తట్టుకునే రోగనిరోధకశక్తి, లేలేత సూర్యకిరణాల ద్వారా లభించే "విటమిన్ డి" లో మెండుగా ఉంటుందని వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మయూరాదులు, సాంబుడు వంటి భక్తులు సూర్యోపాసనచేతనే శారీరక అనారోగ్యం నుండి విముక్తులైనట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. *"ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్!!"*
శ్రీమహావిష్ణువుకు సూర్యుడు కుడికన్నుగా, చంద్రుడు ఎడమనేత్రంగా చెబుతారు. అందుకే విష్ణుమూర్తి దివారాత్రాలకు (పగలు, రేయి) అధిపతి.
రాజవంశాలలో సూర్యవంశం ప్రథమం. శ్రీమహావిష్ణువు పుత్రుడు బ్రహ్మతో మొదలైన సూర్యవంశంలో ముప్పయ్యెనిమిదవ తరానికి చెందినవాడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మకు మరీచి, అతనికి కాశ్యపుడు, అతనికి సూర్యుడు జన్మించారు. రామ-రావణ సంగ్రామంలో శ్రీరామచంద్రుడు *"ఆదిత్యహృదయం"* పఠించి, తన పూర్వజుడు, వంశనామ కారకుడు అయిన సూర్యనారాయణుని ఆశీస్సులు పొంది, తద్వారా రావణసంహారం గావించాడు.
సూర్యుడు నమస్కార ప్రియుడు. మనకు అంతులేని ఫలాలు ప్రసాదించినా, ఏ ప్రతిఫలం ఆశించడు. మనం త్రికరణశుద్ధిగా చేసే నమస్కారానికే ఆయన సంతృప్తి చెందుతాడు. *"ఆరోగ్యం, కవిత్వం, విద్య, ఐశ్వర్యం, సంతానం - ఇవన్నీ సూర్యదేవుని అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయి"* అని సూర్యశతకం తెలియజేస్తుంది. సూర్యోపాసన, చక్షూరోగ (కంటి సంబంధిత వ్యాధులు) నివృత్తి గావిస్తుందని యజుర్వేదంలోని చాక్షూషోపనిషత్తు విదిత పరుస్తుంది. చర్మరోగగ్రస్తులు సైతం సూర్యనారాయణుని పూజించి బాధా విముక్తులవుతారు.
ఇప్పుడు ఓసారి మలయప్పస్వామివారు అధిరోహించిన వాహనాన్ని దగ్గరనుంచి దర్శించుకుందాం. జపాకుసుమాలు ధరించిన స్వామి వాహనానికి, గరుత్మంతుని అన్నగారైన "అనూరుడు" సారథ్యం వహిస్తున్నాడు. రథాన్ని లాగుతున్న ఏడు గుర్రాలను ఏడు ఛందస్సులుగా పరిగణిస్తారు. *గాయత్రి, బృహతి, ఉష్ఠిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి* అనేవి ఆ ఛందస్సుల పేర్లు. విష్ణుసహస్రనామంలో *"అనుష్టుప్ ఛందః"* అని పఠిస్తాం. అంటే "అనుష్టుప్ అనబడే ఛందస్సులో వ్రాయబడినది" అన్నమాట.
అనూరుడు అంటే "ఊరువులు (తొడలు) లేకుండా జన్మించినవాడు" అని అర్థం. సూర్యరథసారథి అయిన అనూరుడు; తన తమ్ముడూ, విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుని వద్దకు వచ్చాడు.
ఆహా, ఏమి ఆ అపూర్వ సంగమము!
ఒకరేమో జగతి కాలచక్రాన్ని నిర్ధారించే సూర్యదేవుని రథానికి సారథి, మరొకరేమో జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుని ముల్లోకాలను విహరింపజేసే వాహనము!
ఇంతటి ధన్యులైన ఇద్దరు పుత్రరత్నాలను కన్న "వినతి" చేసుకున్న పూర్వజన్మల పుణ్యఫలం ఎంత గొప్పదో కదా!
సూర్యప్రభవాహనంపై శ్రీనివాసుని దర్శనం భక్తులకు పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఈ వాహనసేవ దర్శనం ద్వారా భక్తకోటికి ఆరోగ్యం, ఐశ్వర్యం సంపూర్ణంగా సిద్ధిస్తాయి. *అదివో చూడరో అందరు మొక్కరో* *ముదిగొనె బ్రహ్మము కోనేటి దరిని* *రవిమండలమున రంజిల్లు తేజము* *దివి చంద్రునిలో తేజము* *భువి ననలంబున బొడమిన తేజము* *వివిధంబులైన విశ్వతేజము*
అంటూ, ఆ శ్రీనివాసుడే సూర్యమండల మధ్యవర్తియగు శ్రీమన్నారాయణడని ధృవపరిచి, కీర్తించాడు, పదకవితా పితామహుడు అన్నమయ్య. *స్వయం ప్రకాశా గోవిందా!* *ప్రత్యక్షదేవా గోవిందా!!* *దినకరతేజా గోవిందా
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి