1, డిసెంబర్ 2024, ఆదివారం

మొగిలిచెర్ల అవధూత

 మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దత్తోపదేశాలు - ఇరవై రెండవ భాగము - సమయ పాలన 


"జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. అంతే కాదు, ఆ లక్ష్యాన్ని ఎన్ని రోజులలో సాధించాలి అని ఒక నియమం ఉండాలి. అప్పుడే నీ జీవితములో నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదగడమే కాకుండా, నీ లక్ష్యాన్ని కూడా నువ్వు తప్పక చేరగలుగుతావు." ఈ వాక్యాలు దాదాపు అన్ని కార్యాలయాల్లో కానీ లేక విద్యాలయాల్లో కానీ, ఎవరికైనా ఒక స్ఫూర్తిదాయకమైన బోధ చేసేటప్పుడు తప్పక వినిపించేవి. అలానే ఈ వాక్యాలకు ఋజువులుగా చరిత్రలో చాలా మంది జీవిత గాధలను తెలుపుతారు. కానీ, ఎక్కడైనా, ఏనాడైనా ఇలాంటి వాక్యాలకు ఋజువుగా మన నేల మీద నడయాడిన ఋషిపుంగవుల గురించి కానీ ప్రస్తావించరు. దీనికి కారణాలు ఎన్నో, కొంతమందికి అసలు మన సంస్కృతి యొక్క పూర్వ గాధలు తెలియక పోవటం ఒక కారణం అయితే మరొక కారణం అలాంటి ఉదహరణాలు చెప్తే రుచించవని అభిప్రాయం. 


పాఠకులారా! వర్ణించే తీరును బట్టి ఎంతటి పాత చరిత్రనైన ప్రస్తుత తరానికి రుచించే ప్రజ్ఞ కనుక ఉంటే, ఖచ్చితంగా యువతరం మన సంస్కృతిని ఎంతో చక్కగా అందిపుచ్చుకుంటారు. ఒక్కసారి, మన మోగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జీవనాన్ని నిశితంగా పరిశీలిస్తే, శ్రీ స్వామి వారు జన్మించిన తేదీ మే 6, 1944 అలానే శ్రీ స్వామి వారు సిద్ధిపొందిన తేదీ మే 6, 1976. అంటే శ్రీ స్వామి వారు వారి మోక్ష సాధన అనే లక్ష్యాన్ని ఖచ్చితంగా 32 ఏళ్లకు అందుకున్నారు. కనీసం ఒక్క రోజు అటు ఇటు కాకుండా. శ్రీ స్వామి వారు వారి జీవనయానంలో ఎన్నో ప్రదేశాలలో సంచరించారు, ఎంతో మందికి సద్బోధలను చేశారు కానీ వారి సాధనని మాత్రం రవ్వంత కూడా ఆలస్యం చెయ్యలేదు. ఏ ప్రాంతములో ఉన్న, ఎంత మంది మధ్యలో ఉన్న వారు ఒక సమయానికి చేరుకోవాల్సిన ఘట్టాలని అదే సమయానికి చేరుకున్నారు. ఎక్కడా ఏమరుపాటు లేదు అలానే ఎక్కడ కంగారు కూడా లేదు. 


ఇప్పుడు అర్థమయిందా పాఠకులారా! ఎందుకని మాలకొండ మీద నుంచి శ్రీధరరావు దంపతులు ఎంత వారిస్తున్నా "ఇది దైవ నిర్ణయం మీకు అర్థం కాదు" అని పట్టుబట్టి మరీ మాల్యాద్రి మీద నుంచి కిందకు వచ్చేసారో. ఎందుకని, ఉదయం 3.00 గంటలకు నేను ఇక ఇక్కడ ఉండకూడదు అని సాధనస్థలికి వెళ్లిపోయారో. ఆరోజు అయితే, శ్రీధరరావు గారు కనీసం ఒక్క రోజు గడువన్న ఇస్తే ఆ సాధనా స్థలిలో ఒక పాక వెయిస్తాను అంటే, కుదరదు గాక కుదరదు అని పట్టుబట్టి బయలుదేరిపోయారు. అలానే, కొంతమందితో సమయం గడిపారు, కొంతమందితో ఎక్కువ సేపు గడపలేదు. మరికొంతమందికి, శ్రీ స్వామి వారి దర్శన భాగ్యము కూడా కలుగలేదు. ఈ ప్రవర్తన వెనుక ఉన్న అసలు నిజం ఇదే, మనం మన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మనకి అనేక అవాంతరాలు వస్తాయి, అనేక ఆకర్షణలు కనిపిస్తాయి కానీ, వాటికి లోబడితే ఇక ఆలస్యం జరిగిపోయి, ఏనాడు అందవల్సిన ఫలితం ఆనాడు అందదు. 


చివరి రోజులలో అయితే, శ్రీ స్వామి వారు మరీ చిక్కిపోయినప్పుడు ప్రభావతి గారు, "ఎం నాయనా సరిగ్గా తినటంలేదా?" అని అడిగితే, శ్రీ స్వామి వారు చెప్పిన సమాధానం, "లేదు తల్లీ అంత సమయం కూడా వృద్ధా చేయడంలేదు" అని. జన్మరాహిత్యము కోరుకునే వారు మోక్షం పైన అంతటి వ్యామోహాన్ని అలానే అంతటి సమయపాలనను చూపిస్తారు కనుకనే పరమాత్మలో వారు లీనం కాగలుగుతారు.


కాబట్టి పాఠకులారా! మనం కూడా శ్రీ స్వామి వారిలాగా మన పూర్తి సమయాన్ని వెచ్చించలేకపోయినా మనం మనకున్న పరిధిలో నిశ్చయించుకున్న ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకోవాలి అంటే, మనం ప్రతిరోజులో రోజులో ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమని పెట్టుకున్న సమయాన్ని ఎంతటి అవాంతరాలు, ఆకర్షణలు వచ్చిన కానీ మనం సమయపాలన చేయగలిగితే ఈనాడు కాకపోయినా ఏదొక నాడు మనం కూడా మన చిట్టచివరి గమ్యానికి తప్పక చేరుకుంటాము.


సర్వం,

శ్రీ దత్త కృప

ధన్యోస్మి

పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు : 

పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699

----

ఇంతటి మహానుభావుని దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : 


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ

-----


*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :


Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632


---

కామెంట్‌లు లేవు: