8, జనవరి 2025, బుధవారం

తిరుప్పావై 24వ పాశురం*

 *తిరుప్పావై 24వ పాశురం*

🕉🌞🌏🌙🌟🔥


🕉🌞🌏🌙🌟


*24.పాశురం*

*ॐॐॐॐॐॐॐॐॐॐ*


      *అన్ణి వ్వులగ మళన్దాయ్! ఆడిపొత్తి;*

        *చ్చేన్ణజ్ఞ తైన్నిలజ్ఞేశేత్తాయ్! తిఱల్ పొత్తి;*

        *పోన్ణ చ్చగడ ముద్దైత్తాయ్! పుగళ్ పొత్తి;*

        *కన్ఱుకుడై యావేడుత్తాయ్! గుణమ్ పొత్తి;*

        *వెన్ణుపగై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పొత్తి;*

        *ఎన్ణెన్ణున్ శేవగమే యెత్తిప్పఱై కోళ్వాన్* 

        *ఇన్ఱి యామ్  వన్దొన్  ఇరజ్గేలో రెమ్బావామ్!!*

    


*భావం* 


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమునంతను వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలచిన మీ దివ్య పాదారవిందములకు మంగళము. 


రావణుడు సీతమ్మను అపహరించుకొనిపోగా ఆ రావణుండు లంకకేగి సుందరమగు భవనములు కోటయు గల దక్షిణదిశన ఉన్న లంకలోనున్న రాక్షసులను చెండాడిన మీ బాహుపరాక్రమమునకు మంగళము. 


శ్రీకృష్ణుడు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళం. 


వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగచెట్టుపైన ఆవేశించిన అసురుని చంపుటకై ఒడిపెలరాయి విసిరినట్లుగా వెలగచెట్టుపైకి దూడను విసురునపుడు ముందు - వెనుకలకు పాదములుంచి నిలచిన మీ దివ్యపాదములకు మంగళం. 


ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసెనను కోపముచే రాళ్ళవాన కురియగా గోపాలురకు, గోవులకు బాధకలుగుచుండునట్లు గోవర్ధన పర్వతమును గొడుగువలె ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. 


శత్రువులను సమూలముగా పెకలించి విజయమును ఆర్జించి ఇచ్చెడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము. 


ఈ ప్రకారముగా నీ వీరే చరిత్రములనే కీర్తించి పరయనెడి వ్రతసాధనము నందగ మేము ఈనాడు వచ్చినారము అనుగ్రహింపుము. 


అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా! నీ రెండు పాదములకును మంగళము!


 సీతమ్మను అపహరించిన దుష్టడగు రావణుని లంకను గెల్చిన ఓ శ్రీరామా! నీ ధీరతకు మంగళము! బండి రూపంలో శకటాసురుడనేరాక్షసుడు నిన్ను చంపప్రయత్నింపగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము! దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని.


వెలగచెట్టుగా దారికి ప్రక్కన నిల్చిన కపిత్డాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము! దేవేంద్రుడు రాళ్ళ వర్షమును కురిపించగా గోవర్దనగిరిని గోడుగుగా నెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళమగుగాక! శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళ మగుగాక!


 ఇట్లు నీ వీర గాధలన్నేన్నింటినో నోరార సుత్తించును నీ నుండి మా నోమునకు కావాల్సిన పరికరములను పొందుటకై మేము నేడు యిచ్చటకు వచ్చి యున్నాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము. అని గోపికల్లెలరు స్వామిని వేడుకొన్నారు.


 *అవతారిక*


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


ఈనాడు గోపికలు 'శయనాగారము నుండి ఇటు నడచివచ్చి సింహాసనమును అధిరోహింపుము.' అనుటతోడనే ఆశ్రిత సులభుడగు శ్రీకృష్ణుడు వారిమాట మీరలేక తన మంచము నుండి దివ్య సింహాసనము వరకు నడచి వచ్చెను. నీళాదేవియు ద్వారభూమి వరకు మంగళాశాసనము చేయుచు అనుసరించినది. గోపికలు నడచి వచ్చుచున్న స్వామిని చూచినారు.


స్వామి నీళాదేవితో కూడా వచ్చి, దివ్య సింహాసనమును అధిరోహించిరి. ఒక పాదమును పాదపీఠంపై నుంచి రెండవ పాదమును తొడపైనిడుకొని కూర్చుండిన సన్నివేశమును చూడగానే, శ్రీకృష్ణుని దివ్యపాదముల ఎర్రదనము గోపికల కంటపడినది


తాము కోరిన ప్రకారము నడుచుట చేతనే పాదములు కందినవని గోపికల హృదయము కలతచెందింది. వెలుపలికి వచ్చి సింహాసనమున కూర్చొని మేము వచ్చిన కార్యమును పరిశీలించుమని అర్థించిన గోపికలు 'పఱ' అను వాద్యమును కోరుతు మరచి మంగళము పాడుటకు ఉపక్రమించిరి. 


ఈ పాశురమున గోపికలు శ్రీకృష్ణపరమాత్మ వలన తమ కార్యము నెరవేర్ప జూచినవారై, ఆ ప్రభువు నడచివచ్చి ఆసనముపై కూర్చుండగానే ఆ పాదముల ఎర్రదనము చూచి తాము చేసిన అపచారమునకు ఖిన్నులై మంగళము పాదనారంభించిరి.


ప్రవత్తి చేసిన వారికి పరమ సులభుడు పరమాత్మ! ఆశ్రితులకు కొంగు బంగారమే! గోపికలంతా తన్ను తన తిరుమాళిగనుంచి వీరసింహము వోలె నడిచివచ్చి సింహాసనాన్నదిష్టి౦పమని కోరినట్లే స్వామి చేశాడు. స్వామి యందు భక్తులకు ప్రేమ అధికమైనపుడు భక్తసులభుడైన స్వామి వారేది చెపితే అదే చేస్తాడుకద!


 అలా సింహగమనంతో వచ్చిన స్వామిని చూచిన గోపికలు 'అయ్యో! స్వామికెంత శ్రమ కలిగినదో!' అని అందోళన పడి అత్యంత భక్తీ ప్రవత్తులతోను, వాత్సల్యంతోను స్వామి పాదాలకు మంగళా శాసనం చేయడానికి సిద్ధపడి, తాము వచ్చిన పనిని మరచిపోయారు. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించిన ఆనందంతో మంగళాసనం పాడారు యీ (పాశురంలో)


 

*షణ్ముఖప్రియరాగము _ అదితాళము*


    ప ..     మంగళమగుగాక! జయమంగళం !!


అ...ప..    మంగళమగుగాక! శ్రీ పాదములకు!!

    

1.    చ..    లోకములలనాడు గొలిచిన పదములకు 

        లంక గెల్చిన యట్టి రాముధీరతకు

        శకటాసురుని గూల్చు నీ యశః ప్రభలకు 

        అకట వత్సాసురుని విసిరినా పడమూలకీల!!


2.    చ...    గోవర్దనాద్రినిన్ గొడుగుగా నెత్తిన 

        అవతారుడ! నీ కృపా రసమునకు

        అవని శాత్రవుల నవలీలగా ద్రుంచు

        దివ్యాయుధమును నిత్య మంగళము!!    

    

3.    చ....    ఈ విధిన్ మంగళాశాసము జేసి 

        నీ వీర గాథలే పాడి. కొనియాడి    

        నీ వోసగు వరములకు నిను జేరితమి నేడు.

        ఆ వాద్య మొసగుమా! దాసుల బ్రోవుమా!!


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*స్వామికి మగళం*

*ఆండాళ్ తిరువడిగళే శరణం*


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


నిన్న మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారుకదా, స్వామి వస్తుంటే ఆయనపాదాలను చూసారు అవి కంది పోయినట్లు అనిపించింది. 


పాదాలు స్వతాహా గులాబి రంగులో ఉంటాయి కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపికి స్వామి నడిచి వచ్చినందుకు కంది పోయాయి అనుకుంటున్నారు. వీళ్ళేమి కోరి రాలేదు కదా. కేవలం శ్రీకృష్ణుణ్ణి చూసి అనందిద్దామని వచ్చారు. 


ఆయన సింహాసనం పై కూర్చొని, చిలిపి వాడు కదా, వీళ్ళను ఏడిపిద్దాం అన్నట్లుగా ఒక కాలు క్రింద పెట్టి *“సవ్యం పాదం ప్రసార్య”* ఎడమకాలు ప్రసరింపచేసాడు, *“శ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా”* దానిపై కుడి కాలు ఉంచి వీళ్ళకు తన పాదాలు కనిపించేలా అడిస్తూ కూర్చున్నాడు.


ముఖారవిందం పదారవిందం అన్నీ అరవిందములవలే సుకుమారము, సౌగంద్యము, కోమలత్వము కల్గినవి కదా, ఆయన పాదాలని చూసి అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ మేం కూడా నీ పాదాలు కందిపోయేలా చేసామే అంటూ భాదపడ్డారు. వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని  మంగళం పాడుతున్నారు.


ఈ రోజు పాశురాన్ని మంగళాశాసన పాశురం అంటారు. భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయి మొదటిది జ్ఞాన దశ, రెండోది ప్రేమ దశ. జ్ఞాన దశలో భగవంతుడు ఎట్లాంటివాడో, తనూ ఎట్లాంటివాడో  తెలుసుకోవడం.


భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం. చేతనో ఏ జ్ఞానం లేనివాడు, భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసు కుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది.


 ఈ దశలో భగవంతుని కున్న శక్తిని మరచి ఆయన కున్న సౌకుమార్యం సౌశీల్యం అనే గుణాలనే చూస్తాడు. ఇక తను అజ్ఞానిని అని మరచి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు. ఒకనాడు జ్ఞానం కల్గినప్పుడు భగవంతుడు  తనని రక్షించేవాడని భావించే అతను, భక్తితో ఈ నాడు తాను భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్నట్టుగా మారుతాడు.


 ఏదైన ఒక వస్తువు విలువైనది అని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అట్లానే. అందుకే మనం ఆలయాల్లో తలుపులు, తాళం అని ఇలా చేస్తుంటాం, జగత్ రక్షణ చేసే వాడికి మనం రక్షణ ఏంటి కనుక. అది ప్రేమచే చేస్తాం. దృష్టిదోషం తొలగుగాక అని, కర్పూరం ఎట్లా అయితే హరించుకు పోతుందో అట్లా దోషాలన్ని హరించుగాక అని మంగళం పాడుతాం. 


గోదాదేవి కి ఈ విషయం వాళ్ళ నాన్న గారు తెలిపారు. విష్ణుచిత్తులవారు మధురానగరం వెళ్ళి పాండ్య రాజ్య సభలో భగవత్ తత్వాన్ని నిరూపిస్తారు. అందుకు వారిని ఏనుగుపై అంబారీ చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు. వీళ్ళ కంటికి నీవు కనపడితే నీకు దృష్టి దోషం తగులును అని మంగళం పాడారు.

 పల్-ఆండు అనేక సంవత్సరాలు, పల్-ఆండు అనేక సంవత్సరాలు  పలకోటి నూరు- ఇలా కోట్ల సంవత్సరాల వరకు నీకు మంగళం, శంఖానికి, చక్రానికి, పక్కన అమ్మకి అంటూ ఇలా మంగళం పాడారు. శ్రీరామాయణంలో కూడా రాముని పరాక్రమం తెలిసినవారుకూడా రామునికి ఎన్నో సార్లు మంగళం పాడారు.


 జగత్ కారణ తత్వం దేవకీ గర్భంలో ఉందని తెలిసి కూడా, ఆ చతుర్ హస్తాల్లో ఉన్న కృష్ణుడిని చూసి కంసునికి తెలిస్తే నీకే ఉపద్రవం వస్తుందోనని అన్నీ వెనక్కి దాచేసుకో అని దేవకీ అంటుంది. ఇవి ప్రేమతో చేసేవి. మన ఆలయాల్లో హారతి ఇచ్చే సంప్రదాయం కూడా ఇలా వచ్చిందే. అయితే హారతిని కళ్ళకు హద్దుకోరాదు.


హారతిని ఆర్పి పక్కన పెట్టి, ఎవరికైతే దృష్టిదోషం తీస్తామో వారికి కళ్ళు, పాదాలు కడిగి ఆచమనం చేయిస్తాం.  నీకు మంగళం అవుగాక అనేదే దీని అర్థం. ఈ జగత్తుకు పరమాత్మ వేరు కదా ,ఆయన క్షేమంగా ఉంటే లోకం అంతా క్షేమం, ఇక ఆయనను కోరాల్సిన అవసరం ఏంటి కనుక. 


ఆండాళ్ ఏనాడో ఆయన నడిచివచ్చినందు పాదాలు కందిపోయాయని మంగళం పాడుతుంది. వీళ్ళకు కాలంతో ప్రమేయం లేదు, ఎందుకంటే కాలం అనేది కూడా ఒక గాజు గోడ లాంటిదే. వీరి ముందేనా అంతా జరుగుతున్నది అని పరమ భక్తులు భావిస్తారు.


 *"అన్ఱివ్వులగమ్"* ఆనాడు వామనుడై లోకాలను *"అళందాయ్"* కొలిచిన, ఒక్కసారి అంతలా పెరిగినందుకు నీ పాదాలు ఎంత కందిపోయాయే!   *"అడి"* ఆ పాదాలకు *"పోత్తి"* మంగళం.


*"శెన్ఱ్"* వెళ్ళి *"అంగు"* అక్కడ ఉన్న *"త్తెన్-ఇలంగై"* దక్షిణ దిక్కున అందంగా ఉన్న లంకా నగరాన్ని పాలించే రావణాసురున్ని *"శెత్తాయ్"* సంహరించిన *"తిఱల్"* నీ భుజ భలానికి *"పోత్తి"* మంగళం.


*"పొన్ఱ"* తారుమారు అయ్యేలా *"చ్చకడం"* శకటాసురున్ని *"ఉదైత్తాయ్"* తన్ని అంతమొందిచ్చావు, ఏడు నెలల బాలుడవి, *"పుగర్"* నీ కీర్తికి *"పోత్తి"*  మంగళం.


*"కన్ఱు"* దూడ రూపంలో ఉన్న వత్సాసురున్ని *"కుణిలా"*


కర్రలా మార్చి వెలగ పండులో దాగిఉన్న కపిత్తాసురునిపై *"వెఱిందాయ్"* గిరగిరా తిరిగి విసిరిపాడేసి *"కరిల్"* నీ పాదానికి *"పోత్తి"* మంగళం.


*"కున్ఱు"* పర్వతాన్ని *"కుడైయా"* గొడుగులా  *"వెడుత్తాయ్"* ఎత్తి పట్టి అందరిని దరిన చేర్చుకున్న నీ *"కుణమ్"* సౌశీల్య గుణానికి *"పోత్తి"* మంగళం.


ఆండాళ్ స్వామిచేసిన ఇన్ని కార్యాలను కీర్తించిందికదా, ఎక్కడైనా దృష్టిదోషం తగులుతుందేమోనని, ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు అన్నట్లుగా *"వెన్ఱు"* గెలిచి *"పకై కెడుక్కుమ్"* విరోదభావం లేకుండా చేసే *"నిన్ కైయిల్"*  నీ హస్తంలో ఉన్న *"వేల్"* శూలాయుదానికి, తండ్రి నందగోపుడి వద్ద ఉన్న ఆయుదం *"కూర్వేల్"*   ఇదేకదా, ఆ శూలానికి *"పోత్తి"* మంగళం.


*"ఎన్ఱెన్ఱ్"* ఎల్లప్పుడు *"ఉమ్ శేవకమే"* నీ చరితమునే *"యేత్తి"* కీర్తించేలా *"ప్పఱై"* ఆ వాయిద్యాన్ని *"కొళ్వాన్"* తీసుకుంటాం. *"ఇన్ఱు"* ఈ రోజు *"యాం"* మెం ఎందుకు *"వందోం"* వచ్చామో *"ఇరంగ్"*  తెలుసుకొని అనుగ్రహించు అంటూ ఈరోజు స్వామిని అడుగుతున్నారు.


నిన్న స్వామిని లేపి ఆసనంపై కూర్చోబెట్టారు, ఈ రోజు దృష్టి దోషం తొలగటానికి మంగళం పాడుతున్నారు.  విగ్రహ రూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవ జరుగుతుంది .ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు విగ్రహం అంత శక్తి కలది, ఇది మన ఆండాళ్ మనకు తెలుపుతుంది.


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*తిరుప్పావై 24 వ పాశురము తెలుగు పద్యానువాదము*

*రచన*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి* 

*ॐॐॐॐॐॐॐॐॐॐ*


 *సీసమాలిక*.

*మంగళమని పాడ ముంగిట నిలబడి* 

       *బలి గర్వ మణచిన వామనునకు*

*సీతమ్మ తల్లిని చెరబట్టిన వాడు* 

          *బాహు బలము చూసి పతనమయ్యె*

*శకటాసురుని శక్తి ప్రకటించ నీయక*

        *నేలపై కూల్చెను కాలు సాచి*

*మూడడుగుల చేత ముల్లోకముల యందు*

        ,*విక్రమ రూప త్రివిక్రముండు*

,*గోవర్ధన ధరుడై గోవుల రక్షించె*

        *గోపల్లె వారల గోవులెల్ల*

*రాళ్ళ వర్షము నుండి రక్షింప నెంచెను*

        *గోవర్ధనోద్ధారి గోటి చేత*

*వత్సాసురుని లీల వారింపగా నెంచి* 

      *వడిసెల రాయిగా పారవేసె*

*మంగళమ్ము యనుచు మగువ లెల్లను గూడి*

        *స్వామి చెంతను చేరి సన్నుతింప*

*స్వామి నిద్రను వీడి స్వాగతింపడు యేల*

,*కృష్ణ! పరను మాకు కృపను చేయు!!*

 

*తే.గీ. భండనంబున వ్రేటు ప్రచండ రీతి* 

*బెదర గొట్టెను భీతితో బెదురు నట్లు*

*స్వామి గుణముల నెదిరింప సాధ్య పడక*

*మరలి రాలేక మరణమే శరణమనిరి*

*శ్రద్ధ భక్తిని కల్గించి బుద్ధి నిమ్ము*

*శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!*


🕉🌞🌎🌙🌟

కామెంట్‌లు లేవు: