23, ఫిబ్రవరి 2025, ఆదివారం

అంకము

 🙏🙏🙏అంకము 

 శ్రవ్య కావ్య విభాగములను ఏర్పరచుటకంటె, నాటకమును అంకములుగా విభజించుటలో నియమములెక్కువ. అలంకార శాస్త్రములో 

ఈ అంక నిర్మాణాత్మకమైన నియమ లక్షణము ఈ విధముగా ఉండును: 


ఇతి వృత్త వృత్తాంతములో ఒకరోజు జరిగిన సంఘటనమునే అంకము 

నందు ప్రదర్శింపవలెను . కథ ఎంత దీర్ఘ కాల వృత్తమైనను కావచ్చును, కాని 

ఒక అంకము నందు ఆ దీర్ఘ కాలములో ఒక దినమున జరిగిన దానిని మాత్రమే 

 స్వీకరింపవలెను.” ఇది ముఖ్య నియమము.


శాకుంతలములోని కథ మూడు సంవత్సరములు జరిగినది ఆ నాటక 

ములోగల ఏడంకములలో ఏడు దినముల కథ మాత్రమే గ్రహింపబడినది. 

అయినను కథలో వెలితియున్నదని గాని ఇది ఏడు దినముల కథయే అనిగాని 

మనసునకు గోచరింపదు. ఇది కవియొక్క ఇతివృత్త సన్నివేశ చాతుర్యఫలితము. 

శకుంతలాదర్శనము మొదలుకొని పుత్ర సంతాన ప్రాప్తి వరకునుగల దుష్యంతుని 

చరితలో ఆయువుపట్లని చెప్పదగిన దినములు ఏడింటిని గ్రహించి ఆ దినము 

లలో జరిగిన చరిత్రను ఏకతా సంఘటించి మిగిలిన బహుదినములకు సంబంధిచిన 

చరిత్రమును కాళిదాను మనకు అవగత మగునట్లు చేసెను . ఈ సన్నివేశములో కథ 

యెచ్చటను విచ్చిన్న మైనట్టు కానరాదు. ఏ ఉత్తమ నాటక మైనను ఇట్లే యుండును 


ప్రతి అంకము లోని కథయంతయు ఒక నాయకుని అపేక్షిత ప్రయోజన పరాయణముగానే ఉండవలెను, సాధ్యమైనంతవరకు అన్ని అంకములలోను నాయకుని ప్రవేశము ఉండవలెను, లేదా ఆతని ప్రస్తావన అయినా పురస్కరించుకొనియే ఆయంకము  

నడవ వలెను,. 

అంకగతమైన కథ ఒకటిరెండు కాక పెక్కు పాత్రల ప్రవేశమునకు తగిన విస్తృతి కలదిగా నుండవలెను.సంస్కృతమున బహుశబ్దమునకు 

అధమము మూడు అని యర్థము. వ్యాకరణమున ఏకవచన, ద్వివచన, బహు 

వచనములు అన్నచోట ఆ 'బహు” శబ్దమునకు అర్థమిదియే.ఒకటి రెండు పాత్రలతో విష్కంభాదులుగా చెప్పబడెడి కథాసూచనలు మాత్రమే నిర్వహింపబడును. 

అంకములో అట్లు కుదరదు.


మరియు అంకమునందలి కథ బీజానుగుణముగా, బిందు వ్యాప్తి 

పురస్కృతముగా ఉండవలెను. ప్రతి కథకును ఆది మధ్యాంతములనెడి మూడు 

దశలుండును. ఈ మూడును క్రమముగా బీజ, బిందు, వ్యాప్తి కార్యములని ఈ శాస్త్ర 

పరిభాషలో చెప్పబడెను, ఏ ప్రయోజనాపేక్ష చే కవి కథను ప్రారంభించునో, 

ఆ ఫలమును ఇచ్చుటకు సమర్థమైన ఉపకరణ నకు 'బీజము' ఆని పేరు 

పుష్ప, ఫల సమన్విత మైన వృక్షముగా వృద్ధి చెందుటకు ఎట్టి శక్తి మంతమైన బీజమును నాటవలెనో, అట్టి శక్తి మంతమైన బీజముతోనే, 

కథా వికాసమునకు వ్యాప్తికి ఆనుగుణమైన దానితో కథను ఉపక్రమించవలెను, శక్తివంత 

మైన ఆ ఉపక్రమణముబట్టియే కథావిశృతి మరియు వికాసములు కలుగును , ఆ వికాస 

మునకు బీజమునందలి శక్తి యొక్క వ్యాప్తియే కారణము. దీనినే ఈ లక్షణమునే బిందువు' అందురు. అంకము బీజానుగుణముగా, 

బిందువ్యాప్తీ పురస్కృతముగా ఉండవలెను ఈ ధర్మమును పాటించినపుడు ప్రతి అంకమునందలి ఇతివృత్తాంశమును తత్పూర్వాంకమున 

కంటె ఎక్కువ వ్యాప్తి యగుచుండును. అంకమునకు అంకమునకును ఓండొంటికి 

అవిచ్చిన్న మైన సంబంధముండవలెను పూర్వాం కములోని కధాంశము ఉత్తరాంక 

కథాంశ మునకు కారణభూతమగుచుండును, అంకములన్నిటను ప్రదర్శనీయ మైన కథాభాగమే ఉండవలెను, ప్రదర్శింపరానివియు , ప్రదర్శింప వీలు లేనివియు, ప్రదర్శింపకూడనివియు (అయోగ్య, అసంభావ్య, అనావశ్యక) అగు ఘట్టములను అవసరమగుచో ఆర్దోపక్షేపకములందు సూచింతురు. ఆంకమున దృశ్య కథాభాగము మాత్రమే ఉండవలెను . అంకాంతమున రంగమునందలి పాత్రలన్నియు నిష్క్ర మింపవలెను

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: