29, మార్చి 2025, శనివారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*


*331 వ రోజు*


*అర్జునాదులు కౌరవసేనలతో పోరుట*


భీమ సాత్యకులు అర్జునుడి వద్దకు చేరగానే అలంబసుడు అనే రాజు వారిని చేరుకున్నాడు. సాత్యకి, అలంబసుడు ఘోరంగా చేస్తున్నాడు. ఒకరి విల్లు ఒకరు విరిచారు. కవచాలను చీల్చుకున్నారు. సాత్యకి కోపించి అలంబసుని రధసారధిని, హయములను చంపి ఒక అర్ధచంద్ర బాణంతో అలంబసుని తల తెగనరికాడు. ఇంతలో నీ కుమారులు అందరూ దుశ్శాసనుడిని ముందుంచుకుని సాత్యకిని ఎదుర్కొన్నారు. సాత్యకి దుశ్శాసనుని హయములను చంపి రధము మీదకు దూకబోయాడు. అది చూసి త్రిగర్త సైనికులు అతడిని ఎదుర్కొన్నారు. సాత్యకి వారిని ఎదుర్కొని వెంటనే ఏభై మందిని చంపాడు. అది చూసి మిగిలిన సైనికిలు పారిపోయారు. సాత్యకి శూరసేనదేశాధీశుని వెంబడించాడు. కళింగ సైనికులను నాశనం చేసాడు. అతడి బలపరాక్రమము చూసిన కృష్ణుడు " అర్జునా ! అటు చూడు నీ శిష్యుడు సాత్యకి నీ పేరు నిలబెడుతున్నాడు. ద్రోణుడు అంతటి వాడిని జయించి లోపలకు వచ్చాడు. ధర్మరాజు మీద భక్తి, నీతోటి మైత్రి అతడిని ఇంత వరకు తీసుకు వచ్చింది " అని ప్రశంసించాడు. అర్జునుడు " కృష్ణా ! నేను సాత్యకిని ధర్మరాజుకు రక్షణగా ఉండమన్నాను. నా మాట వినక ఇక్కడకు వచ్చాడు. అక్కడ ధర్మజుని పరిస్థితి ఎలా ఉందో కదా! అతడు ద్రోణుని బారిన పడ్డాడు. ఇక్కడ నేను సైంధవుడిని ఇంకా చంప లేదు. పొద్దు వాలి పోతుంది. సాత్యకి కృపాచార్యుడు, కృతవర్మ మొదలైన యోధులను ఎదిరించి అలసిపోయాడు. భూరిశ్రవసుడు అతడితో తలపడుతున్నాడు. సాత్యకి ఎలా యుద్ధం చేస్తాడో ఏమో ! ద్రోణాచార్యుడు పక్షి కొరకు ఎదురు చూస్తున్న డేగవలె మా అన్నయ్య ధర్మజుని కొరకు ఎదురు చూస్తున్నాడు అని ధర్మజునికి ఎందుకు అర్ధం కాలేదు " అని మనసులో పరితపిస్తున్నాడు. ఇంతలో సోమదత్తుని కుమారుడు భూరిశ్రవసుడు సాత్యకిపై విరుచుకు పడ్డాడు. ఇరువురి నడుమ పోరు ఘోరమైంది. ఒకరి మీద ఒకరు బాణవర్షం కురిపించారు. ఒకరి రధాశ్వములను ఒకరు చంపారు. ఒకరి రధసారధిని ఒకరు చంపుకున్నారు. రధము దిగి నేల మీద కత్తి సాము చేస్తున్నారు. అవి కూడా వదిలి మల్ల యుద్ధము చేయసాగారు. చివరకు భూరిశ్రవసుడిదే పైచేయిగా ఉండటము చూసి కృష్ణుడు చూసి " అర్జునా! ఏమిటి అలాచూస్తున్నావు నీకు సాయంగా వచ్చిన సాత్యకి భూశ్రవసునితో యుద్ధమ చేసి అలసి ఉన్నాడు. సత్వరమే రక్షించు " అన్నాడు. అప్పుడు భూరిశ్రవసుడు సాత్యకిని కింద పడ వేసాడు. అది చూసిన కృష్ణుడు " అర్జునా! ఇది న్యాయం కాదు నీకు సాయం చేయడానికి వచ్చిన నీశిష్యుడు ఆపదలో ఉన్నాడు సతరం రక్షించడం నీ కఎర్తవ్యం " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! మల్లయుద్ధం చేసుకుంటున్న ఇరువురి నడుమ నేను బాణ ప్రయోగం చేయడం ధర్మం కాదు అయినా నా మిత్రుడిని నేను రక్షిస్తాను " అన్నాడు. అర్జునుడు అలా అంటుండగా భూశ్రవసుడు సాత్యకిని నేలపై వేసి గొండెలపై కాలు వేసి సాత్యకి తల నరకడానికి కత్తి తీసుకుని చేయి పైకెత్తాడు. అది చూసిన కృష్ణుడు " అర్జునా! ఇక ఆలస్యం చేయకు బాణ ప్రయోగం చెయ్యి " అన్నాడు. అర్జునుడు గాండీవం ఎక్కు పెట్టి ఒకే ఒక బాణంతో ఎత్తిన భూశ్రవసుడి చేయి నరికాడు. భూరిశ్రవుసుడి చేయి తెగి పడింది వెంటనే భూరిశ్రవడు " అర్జునా ! ఇంతటి అన్యాయానికి పాలు పడతావని అనుకోలేదు. సాత్యకితో యుద్ధం చేస్తున్న నా చేయి నరకడం న్యాయమా, ధర్మమా ! ఇంటటి నీచ రాజ నీతిని నీకు నీరువు ద్రోణుడు నేర్పాడా ! నిన్ను పుట్టించిన ఇంద్రుడు నేర్పాడా ! పాశుపతం అందించిన శివుడు నేర్పాడా! నీ పక్కన కూర్చుని శ్రీకృష్ణుడు ఇది చూసి ఎలా సహించాడు " అన్నాడు. అర్జునుడు ఆ మాటలకు నవ్వి భూరిశ్రవసా! నీవు నాకు నీతులు నేర్పే వాడివా యుద్ధరంగమున యుద్ధం చేస్తున్న వీరులను వారి బంధువులు కాపాడరా ! అలసి పోయి నిరాయుధుడైన సాత్యకిని చంపబూనడం ధర్మమా ! అతడిని నేను రక్షించండం అధర్మమా! మీరంతా కలసి బాలుడైన అభిమన్యుని వధించడం మాత్రం అధర్మమం కాదా! " అన్నాడు. చేయి తెగిన భూరిశ్రవసుడు బాణములను భూమి మీద పరచి వాటిపై కూర్చుని ప్రాయోపవేశం చేసాడు. ఇది చూసి సాత్యకి భీమసేనుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు వారిస్తున్నా వినక భూరిశ్రవుసుడి తల నరికి వారించిన వారిని అభిమన్యుని చంపిన వారిని ఇలా చంపడం అధర్మము కాదని సమర్ధించుకున్నాడు " అని సంజయుడు చెప్పగా


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: