4, జనవరి 2026, ఆదివారం

*శ్రీ సూర్య ఉపాసన

 *శ్రీ సూర్య ఉపాసన*


*सूर्य आत्मा जगतस्तस्दुषश्च* అని శ్రుతివాక్యం. సూర్యభగవానుడు జగత్తంతా వ్యాపించియున్నాడని చెప్తుంది. సూర్యోపాసన చాలా విధాలుగా చేయవచ్చు. సూర్యుని పరబ్రహ్మగా భావించి ఉపాసిస్తే, ఉపాసకుడు బ్రహ్మయే అవుతాడు.

असावादित्यो ब्रह्मेति |

ब्रह्मैव सन्ब्रह्माप्येति |

అదే శ్రుతి సూర్యు భగవానుడిని వేద స్వరూపునిగా భావించి పూజించమంది. అంటే సూర్యమండలాన్ని ఋగ్వేదంగా, సూర్యతేజస్సును సామవేదంగా, చైతన్యాన్ని లేదా రూపాన్ని యజుర్వేదంగా భావించి ఉపాసించమని మహానారాయణోపనిషత్తులో

आदित्यो वा एष एत न्मण्डल स्तपति అనే అనువాకంలో చెప్పబడింది. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో కూడ సూర్యోపాసనను ప్రస్తుతించారు.

రామాయణంలో అగస్త్య మహర్షి సూర్యుడిని ఆరాధించమని శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. మహా భారతంలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు యుధిష్ఠిరునికి సూర్యుడు ఒక అక్షయపాత్రను ప్రసాదించాడు. దానివలన రోజూ వేలమంది అతిథులకు ధర్మరాజు ఆతిథ్యమివ్వగలిగాడు. ప్రతివారూ చక్కటి ఆరోగ్యాన్ని కోరుకుంటారు. అలా కోరుకునే వారు సూర్యుని ఆరాధించాలని చెప్పారు.

आरोग्यं भास्करात् इच्छेत्

మంచి ఆరోగ్యం కోసం సూర్యుని ఎలా ఆరాధించాలో కూడ చెప్పారు. नमस्कार प्रियो भानुः సూర్యునికి నమస్కారములు స్వీకరించటం ఇష్టమన్న మాట. అందువలననే సూర్యనమస్కారాలు చేయటం అనే సంప్రదాయం అనాదికాలంగా మనదేశంలో వస్తున్నది.

సూర్యోపాసన చేసేవారందరికీ సకల విధముల మంచి జరుగుగాక. 

नमस्सवित्रे जगदेक चक्षुपे जगत्प्रसूति स्थिति नाशहेतवे |

त्रयी मयाय त्रिगुणात्मधारिणे विरिंचि नारायण शंकरात्मने ||

జగత్సాక్షీ, జగత్సృష్టి, స్థితి నాశ కారకుడూ వేదస్వరూపుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మ స్వరూపుడు, త్రిగుణాత్మధారి అయిన సూర్యునకు నమస్కారములు.


*-- జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు*

కామెంట్‌లు లేవు: