4, జనవరి 2026, ఆదివారం

*ఆత్మ స్తుతి… పరనింద*

  *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*

  *ఓం నమో భగవతే వాసుదేవాయ*

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁




          *ఆత్మ స్తుతి… పరనింద* 


*కురుక్షేత్ర యుద్ధం భీకరంగా సాగుతోంది. దుర్యోధనుడి ప్రాణమిత్రుడు, మహా పరాక్రమవంతుడు అయిన కర్ణుడి ధాటికి పాండవ సైన్యం నిలువలేకపోతోంది. సైనికులు చాలామంది మరణిస్తున్నారు. పాండవ యోధులకు ఏమీ తోచడంలేదు. కర్ణుణ్ని ఎదుర్కొనే వీరుడెవరు అని ఆలోచిస్తున్న ధర్మరాజుకు ఆ శక్తి ఒక్క అర్జునుడికే ఉందని తెలుసు. కానీ అర్జునుడు కర్ణుడితో తప్ప అందరితోనూ యుద్ధం చేస్తున్నాడు. ఇది ధర్మరాజుకు నచ్చలేదు, అందుకే అర్జునుణ్ని కర్ణుడి మీదకి ఉసిగొల్పాలని అనుకున్నాడు.*


*యుద్ధ ధర్మం ప్రకారం రోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే పోరాడాలి. అలా ఒకరోజు యుద్ధం ముగిసిన వెంటనే మర్నాడు అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తున్నారు పాండవులు. అప్పుడు ధర్మరాజు అర్జునుడి వంక చూస్తూ ‘నువ్వు గొప్ప పరాక్రమవంతుణ్ని అనుకుంటున్నావు కానీ ఒట్టి పిరికివాడివి. కర్ణుణ్ని ఎదుర్కొనే ధైర్యం లేక నీ ప్రతాపాన్ని బలహీనులైన సైనికుల మీద చూపిస్తున్నావు. శివుణ్ని మెప్పించి శక్తిమంతమైన పాశుపతాస్త్రాన్ని పొందావు, గాండీవధారి అనిపించుకోవడమే తప్ప దాన్ని ప్రయోగించడం నీకు తెలియదా లేక అది కేవలం అలంకరించుకోవడానికే పనికొచ్చేదా?’ అంటూ కావాలనే అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. ఆ మాటలకు అర్జునుడికి చాలా కోపం వచ్చింది. శివుడి దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని పొందిన నాడే ఒక శపథం చేశాడు అర్జునుడు. ఎవరైనా తన పాశుపతాస్త్రాన్ని అవమానిస్తే వారిని సంహరిస్తానని. కానీ ఇప్పుడు సాక్షాత్తు తన సోదరుడే గాండీవాన్ని అవమానించాడు. ఏం చేయాలో తెలియక తన సమస్యను కృష్ణుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ‘చిన్నవాళ్లు పెద్దవాళ్లని శిక్షించాల్సిన పరిస్థితుల్లో వారిని దుర్భాషలాడితే సరిపోతుంది. ఎందుకంటే అది వారికి మరణంతో సమానం’ అని సలహా ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్లి ‘మీవల్లే మాకీ పరిస్థితులు వచ్చాయి, మీరు వ్యసనానికి లోనై, రాజ్యాన్ని పోగొట్టారు, మమ్మల్ని అందరినీ పణంగా పెట్టి ఓడిపోయారు, బానిసల్ని చేశారు, ఇదంతా కేవలం మీ వల్లే జరిగింది’ అంటూ అన్నదమ్ములందరి ఎదుట ధర్మరాజుపై నానా నిందలు మోపాడు.*


*అనడం అయితే అనేశాడు కానీ పెద్దవాడు, ధర్మం తప్పనివాడు అయిన అన్నని నిందిస్తూ మాట్లాడటాన్ని అర్జునుడు జీర్ణించుకోలేకపోయాడు. తీవ్రమైన మనస్తాపంతో మళ్లీ కృష్ణుణ్నే ప్రాయశ్చిత్తం అడిగాడు. అప్పుడాయన ‘నిన్ను నువ్వు పొగుడుకో, నలుగురిలో నీ గురించి నీవే గొప్పగా చెప్పుకో. అదే నీకు ప్రాయశ్చిత్తం. ఎందుకంటే ఆత్మస్తుతి కూడా మరణంతో సమానమే’ అంటూ నవ్వుతూ చెప్పాడు. కాబట్టి ఊరికే ఎవరినీ నిందించకుండా, ఆత్మస్తుతి చేసుకోకుండా నలుగురితో కలిసికట్టుగా పయనించేవారే... సంఘజీవి అనిపించుకుంటారు.*

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁

*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*

🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

కామెంట్‌లు లేవు: