27, జనవరి 2026, మంగళవారం

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*633 వ రోజు*

అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము

యజ్ఞములకు మూలము

భీష్ముడు " ధర్మనందనా ! ఒకసారి వ్యాసుడి కుమారుడైన శుకుడు గోవుకు సమానమైనది ఈ లోకంలో మరేదీ లేదు. యాగములకు మూలకారణం గోవు. ప్రారంభంలో ఆవులకు కొమ్ములు లేవు. బ్రహ్మదేవుడు " గోవులు పరమపవిత్రములు. యజ్ఞముకు గోవులు మిక్కిలి అవశ్యము. గోవును చూసినంతనే దురితములు తొలగి పోతాయి. ఎవరైతే గోవును పూజిస్తారో వారు స్వర్గసౌఖ్యములు పొందగలరు. కుమారా ! ఆవు ఔషదులకు నిలయము. గోవు పంచితమును ఆవుపాలు, ఆవునెయ్యి, ఆవుపేడతో కలిపి మూడు దినములు సేవించిన సకలరోగములు నశిస్తాయి. తరువాత మూడు దినములు ఉపవాసము చేసి ఆవుగిట్టలతో తొక్కించిన యవలతో కాచిన గంజి సేవించిన తేజోవంతులు ఔతారు. ఈ విధంగా సేవించి దేవతలు రాక్షసులను గెలిచారు. ఆవునెయ్యిని సేవించడం వలన ఉదాత్తుడు ఔతాడు. ఆవు నెయ్యిని దానం చేసిన ఎంతో పుణ్యము వస్తుంది. ప్రతి రోజు ఆచమనం చేసి గోవుల మధ్య గోమతి మంత్రం జపించిన అంతఃకరణ శుద్ధి బాహ్య శుద్ధి ఏర్పడుతుంది. ఈ గోమతి మంత్రమును అగ్ని కార్యము, గోవులసమక్షము, బ్రాహ్మణుల ఎదుట చదివిన కోరిన కోరికలు సిద్ధిస్తాయి. అందు వలన గోవును మించిన వస్తువు ఈ లోకములో లేదు " చెప్పాడు. ధర్మనందనా విన్నావు కదా ! గోవుల మాహాత్మ్యము " అని భీష్ముడు చెప్పాడు.

గోలోకము

ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! ఈ మూడు లోకములకు బ్రహ్మదేవుడు అధిపతి. బ్రహ్మలోకమును గోలోకము అంటారట ఎందుకు " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము విశ్వకర్మ గొప్ప తపస్సు చేసాడు. అమృత రూపిణి కామరూపి అయిన సురభి అనే కన్యని మానస పుత్రిగా సృష్టించాడు. ఆమెతో పాటు మహా తేజోవంతుడైన ఒక పురుషుడిని కూడా సృష్టించాడు. ఆ పురుషుడు ఆ కన్యను చూసి మోహించి ఆమె కొరకు పరితపించ సాగాడు. అది చూసిన బ్రహ్మ "మార్తోభవ " (నీ పరితాపము ఉపశమించు కాక) అని దీవించాడు. అతడికి మార్తాండుడు అని పేరు పెట్టి అతడికి సురభిని ఇచ్చి వివాహము జరిపించి " మీ రిరువురికి పుట్టిన సంతానం యజ్ఞయాగాదులకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సమకూరుస్తాయి " అని చెప్పాడు. వారిరువురికి గోవులు సంతానంగా జన్మించాయి. ఆ గోవులు కూడా మానవులకు, దేవతలకు కోరినవి ఇస్తూ వారి చేత పూజలు అందు కుంటున్నాయి " అని భీష్ముడు చెప్పాడు.

సురభి మార్తాండుడు

ధర్మరాజు " పితామహా ! సురభి మార్తాండులకు కలిగిన సంతానం గురించి వివరించండి " అని అడిగాడు. ధర్మనందనా ! ముందుగా సురభి మార్తాండులకు పదకొండు మంది ఉద్భవించారు. వారే బ్రాహ్మణులకు మూల పురుషులు. వారే ఏకాదశ రుద్రులు. వారి పేర్లు అజపాదుడు, అహిర్బుధ్న్యుడు, త్రయంబకుడు, వృషాకపి, శంభుడు, కాపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు. ఈ ఏకాదశరుద్రులను లోకమంతా పూజించారు. ఏకాదశ రుద్రుల తరువాత గోసమూహం పుట్టింది. ఆ ఆవుల ముఖంలో కొమ్ములలో నాలుకలో ఇంద్రుడు, మలద్వారము మూత్రములో వాయుదేవుడు, మూపురంలో శివుడు, పాదాలలో దేవతలు, కడుపులో అగ్నిదేవుడు, ఆవుపాల పొదుగులో సరస్వతి, ఆవు పేడలో లక్ష్మీదేవి, ఆవు పంచితంలో కీర్తి, రక్తంలో చంద్రుడు కొలువై ఉన్నారు. గోవు హృదయంలో భగుడు అనే దేవత, పాలలో బ్రహ్మదేవుడు, వెంట్రుకలలో అనుష్ఠానములు, తోకలో యమధర్మరాజు, ఆవు కన్నులలో సూర్యుడు, చర్మములో తపస్సు, తేజము అధిష్ఠాన దేవతలుగా ఉన్నారు. ఆవు కాళ్ళలో ఉన్న కీళ్ళలో సిద్ధులు కొలువై ఉన్నారు. సమస్త దేవతలకు ఆలవాలమైన గోవు మాహాత్మ్యము ఏమని వర్ణింపగలము.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: