27, జనవరి 2026, మంగళవారం

కర్మ ఫలం..

 *కర్మ ఫలం..........!!*



కర్మ ఫలం..తప్పదు ఎవరికైనా అనుభవించక..!

మన పాప కర్మే గ్రహ రూపంలో వచ్చి బాధిస్తుంది..!

కర్మ బలీయమైనది..!


రాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు. 

కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు - మంత్రవేత్త రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు 

ఇంకోకవైపు నుంచి - దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.


తక్షకుడు కూడా బ్రహ్మణవేషధారియై, కశ్యపుని చూసి "మహామహితాత్మా! తమరెవరు? 

ఎచ్చటికీ పయనం?" అని అడిగాడు.

"ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, 

నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను" అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.


"అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో - బురద పామో అనుకుంటున్నావా? 

సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు - తక్షకుడే స్వయంగా అయితేనో?" 


"తక్షకుడైనా కానిమ్ము! 

అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! 

నా దగ్గర ఉన్నదిగారడీ వాడి పాము మంత్రమో - 

విషకీటక మంత్రమో అనుకుంటున్నావా?" 

అని ప్రశ్నించాడు కశ్యపుడు.


అంతగొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని" అని నిజరూపం చూపించాడు తక్షకుడు. 


సర్పరాజా! నీకిదే నా ప్రణుతి! 

దీనితోపాటే నా వినతి కూడా విను! 

మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, 

దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విషహరమంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. 

ఇది నా దృఢ విశ్వాసం" ఆని  అన్నాడా కశ్యపుడు.


తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! 

దీని ఊడలు ఏవో - మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! 

లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. 

దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విష శక్తి చూడు!" అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు. 


కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో ఆవంతయినా అబద్ధంలేదు.  

ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి "అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు!" 

అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశినుంచే తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్ర జపం చేసి అభిమంత్రించి ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు. 


చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహా వృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. 

అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది. వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని "మహామంత్ర ద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసిన నా అజ్ఞానాన్ని మన్నించండి! 

తమకు తెలుసో - లేదో! నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మ మూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. 

త్వరలో కలి ప్రవేశం జరగబోతోంది. 

అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, 

తక్షణం పరీక్షీతుని అంకం పరిసమాప్తం కావాలి! 

ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు. 

ఇంతకూ మీకు కావలసింది...." అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా "ధనమయ్యా! ధనం" అన్నాడు నాలాంటి బీద భాస్కర బ్రాహ్మణుడు.


"అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! 

ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను" అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపేశాడు.


ఇంత వరకూ కథ బాగుంది.....

ఇక్కడనే మనం అర్థం చేసుకోవాల్సినది చాలా వున్నది...

మన తల వ్రాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు...

ఓక వేళ నాబోటి వాడు బయలుదేరినా వాడిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం. 

అదే మనం చేసుకొన్న పాపం....

పాప కర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, 

ఆఖరాకి భగవంతుడు కూడా....

వాడి కర్మ కలిసిరావాలి.....

కౌశికుడు బయలుదేరినా,  

పరీక్షిత్తు యొక్క పాప కర్మ అడ్డు పడినది....

ఏమిటి ఆ పాప కర్మ?  

ఓక ముని మీద చచ్చిన పామును వేయడం. 

మహా సాధువులతో చెలగాడటం....

కోరి కోరి తన మృత్యువును అహంకారంతో తెచ్చుకొన్నాడు.......

ముని శాపం వలన, తక్షకుడి కాటు వలన చనిపోలేదు, తన కర్మ చేత చనిపోయినాడు పరీక్షిత్తు ......

గ్రహముల వలన కీడు జరగలేదు....

ఇక్కడ తక్షకుడు ఎంత నిమిత్తమాత్రుడో, 

అంతే విధముగా మానవునికి కర్మ ఫలము నొసగడంలో గ్రహముల యొక్క ప్రమేయం వుంటుంది.....

మన పాపములు గ్రహముల రూపములో మనల్ని అనుభవింప జేస్తాయి....

నిజానికి ఏ గ్రహమూ మనల్ని ఏమీ చేయదు.....

మన పాప కర్మే గ్రహ రూపంలో వచ్చి బాధిస్తుంది...

కర్మ బలీయమైనది....

కామెంట్‌లు లేవు: