20, ఆగస్టు 2020, గురువారం

గోవిందా! గోవింద!

జైశ్రీమన్నారాయణ - జైశ్రీహనుమాన్

సందేహం;- తిరుమల వేంకటేశ్వరుని దర్శించే యాత్రీకులు గోవిందా! గోవిందా అని అంటారెందుకు?

సమాధానం;- నైమిశారణ్యవాసులగు కొందరు మహర్షులు శుక మహర్షి ద్వారా శ్రీవేంకటాచల మహిమను విని, తమ తిరుమల యాత్రలో గోవిందా! అనే నామాన్నే మాటిమాటికి ఎలుగెత్తి పలికారని శ్రీవరాహపురాణంలో ఉంది.

గోవింద పదం వరాహస్వామిని, శ్రీకృష్ణుని, వేంకటేశ్వరుని తెలుపుతుంది. హిరణ్యాక్షునిచే పాతాళంలో ముంచి వేయబడిన భూమిని ఉద్ధరించినది వరాహావతారంలోనే కదా! అందుకే ఆయన గాం విందతి గోవిందః భూమిని  పొందినవాడు గోవిందుడయ్యాడు.

మరల గోవర్థన పర్వతమునెత్తి గోపాలకులను, గోవులను కాపాడినపుడు ఇంద్రుడు గోవింద పట్టాభిషేకం చేశాడు కనుక శ్రీకృష్ణుడు గోవిందుడయ్యాడు.

తర్వాత కలియుగ వైకుంఠమైన తిరుమలలో వేంచేసిన శ్రీనివాసుడు కూడా శ్రీకృష్ణుడే అని భగవద్గీతలోని చరమశ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య అర్థమును, తన దివ్యహస్తములలోని ముద్రలతో ప్రకాశింపజేయుచున్నాడని పెద్దలు చెబుతున్నారు.

అందువల్ల గోవిందా! అని పిలిచే భక్తుల ప్రయాణంలో అలసటను ఆర్తిని శ్రీవేంకటేశ్వరుడు తొలగిస్తున్నాడు. గోవిందా! అని పిలిస్తేచాలు శ్రీవరాహస్వామి, శ్రీకృష్ణుడు, శ్రీనివాసుడు ముగ్గురు ఒకేసారి పలికి కటాక్షాన్ని భక్తులపై కురిపిస్తున్నారు.

గోవింద నామం మరువాం మరువాం అని భక్తులనడానికి కారణం ఇదే. ప్రహ్లాదుడు, ద్రౌపది, గోదాదేవి మున్నగువారు తమ ఆర్తిని గోవింద నామ స్మరణతోనే వెలిబుచ్చి రక్షణ పొందారు.

గోవిందా! గోవింద!
***************

కామెంట్‌లు లేవు: