*స్వామివారి సమాధి ముచ్చట..(2వ భాగం).*
శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చుని వున్నారు..వారికెదురుగా నాన్నగారు, మీరాశెట్టి గారు కేశవులు గారు కూర్చుని వున్నారు.."నాకు అన్నం తెచ్చేది కాక, ఇలా మిమ్మల్ని తీసుకొచ్చే పని కూడా ప్రసాదు కే పెట్టారా మీరు?.." అని నాన్నగారిని స్వామివారు అడిగారు.."ముసలయ్య రాలేదు స్వామీ..అందుకని వీడిని పిలిచాను.." అన్నారు నాన్నగారు..స్వామివారు నా వైపు చూసి..తన దగ్గరకి రమ్మని పిలిచి..తన ప్రక్కనే కొద్దిగా ఎడంగా కూర్చోమని చెప్పారు..ఒక ప్రక్కగా కూర్చున్నాను..
"సమయం తక్కువగా ఉంది శ్రీధరరావు గారూ..మీరు ముగ్గురూ శ్రద్ధగా వినండి..ఎక్కువలో ఎక్కువ ఐదారు నెలలు అంతే..మీరు మనసు స్థిర పరచుకొని జీవసమాధి చేయండి.." అన్నారు..
"మేము ముగ్గురమూ కనబడితే..నువ్వు సమాధి చేయమని అడుగుతావు..ఇంకేమీ మాట్లాడవా?.." అన్నారు మీరాశెట్టి గారు..(మీరాశెట్టి గారొక్కరే..మొదటినుంచీ శ్రీ స్వామివారిని ఏక వచనం తో పిలిచేవారు..అది వారికి అలవాటు..) స్వామివారు పెద్దగా నవ్వి.."మీరాశెట్టీ..ఇక నాకు మిగిలింది మోక్షమే నయ్యా..దాని గురించే నేను పదే పదే మీకు చెప్పాలి..నా తపస్సు చివరిదశకు వచ్చేసింది.." అన్నారు..
"స్వామీ..మీరు కొన్నాళ్లపాటు జీవించి వుండి..మాలాంటి వారికి జ్ఞానబోధ చేయాలి..ఇంత చిన్న వయసులో మీరు మోక్షం అని చెప్పి..ప్రాణత్యాగం చేయడం సరైన పద్ధతి కాదు..మరొక్కసారి ఆలోచించండి..సమాజానికి మీలాంటి సాధకుల అవసరం ఎంతో ఉన్నది.." అన్నారు నాన్నగారు..
"శ్రీధరరావు గారూ..సమాజహితం కొఱకు నేను జీవించే ఉండనక్ఖరలేదు..ఇది తపోభూమి..నా సాధన, తపస్సు తాలూకు శక్తి నా సమాధి లోనూ నిక్షిప్తమై ఉంటాయి..ఆ సందేహం మీకు వద్దు..నా ఆయుష్షు ను నేను పొడిగించుకోలేను..అది నా చేతుల్లో లేదు..కాకుంటే..మాలాంటి అవధూతలకు వుండే ఒక సౌకర్యం ఏమిటంటే..మేము మా ఆయుష్షు తీరే సమయానికి మా ఇష్టప్రకారం ఇచ్చామరణాన్ని పొందవచ్చు..అదొక్కటే నా చేతుల్లో ఉంది..ఇలా చెపితే మీకు అర్ధం కాకపోవచ్చు..కానీ ముందు ముందు మీరే కళ్లారా చూసి..నిర్ధారణకు వస్తారు.."
"మీరు మహానుభావులు..ఒక యోగికి సేవ చేసుకుంటున్నాము అని మేము ఎంతో ఆనందపడుతున్నాము..మీరేమో ఇలా అర్ధాoతరంగా శరీరం విడిచిపెట్టి మోక్షానికి వెళతామని చెపుతున్నారు..కాస్త ఆలోచించండి స్వామీ.." అన్నారు కేశవులు గారు..
"కేశవులు గారూ నేనెంత చెప్పినా..మీకు అసలు విషయం ఇంతవరకూ అర్ధం కాలేదు..నాకు ఆయుష్షు ఎక్కువ కాలం లేదు..ఆ ఒక్కమాట మీకు అర్ధం అయితే చాలు.." అన్నారు..
"మా చేతులతో నిన్ను సమాధి చేయడం మా వల్ల అయ్యే పనేనా..మా తో కాదు.." అని మీరాశెట్టి గారు ఖరాఖండిగా తేల్చేశారు..స్వామివారు నవ్వి.."ముసలయ్య రాలేదని ప్రసాద్ బండి కట్టుకొని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు..అలానే ఆరోజు కూడా ఇలాంటి వాళ్ళు వుండకపోతారా..." అంటూ నా భుజం తట్టి..లేచి నిలబడ్డారు..నాన్నగారితో సహా మిగిలిన ఇద్దరూ కూడా లేచి నిలుచున్నారు..
"మీరు బాగా ఆలోచించుకోండి..ఇంకా కొద్దినెలలు సమయం ఉంది..నా సాధన చరమదశకు చేరుతున్నది..ముందు ముందు తీవ్ర సాధన చేయాలి..మిమ్మల్ని పదే పదే కలవడం కూడా కుదరదు..ఇక వెళ్ళిరండి.." అని చెప్పి, శ్రీ స్వామివారు వరండా మెట్లు దిగి పందిరిలో నిలబడ్డారు..
స్వామివారి సమాధి ముచ్చట చివరి భాగం రేపు చదువుకుందాం..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి