27, డిసెంబర్ 2020, ఆదివారం

ధైర్యవచనం

 అంతర్యామి - *ధైర్యవచనం*


మనిషికి ఓటమి గొప్ప పాఠం నేర్పుతుంది. మంచి ప్రయత్నానికి, మరింత పట్టుదలకు పురిగొల్పుతుంది. గెలుపు, ఓటమి మధ్య పోటీ పెడితే ఓటమే ఓ అడుగు ముందుఉంటుంది. అయినా, ధైర్యవంతుడు భయపడడు. భయమనేది సజీవ మృత్యువై రోజూ హింసిస్తూనే ఉంటుందన్న సత్యాన్ని గ్రహించినవాడు కనుక- బెదరడు.


చెలమను తవ్వుతుంటే చేతికి ముందు ఇసుకే అంటుతుంది. దానికి భయపడో, నిరాశ చెందో తవ్వడం మానేస్తే తియ్యటి జలం ఎలా పొందగలం? ధీరత్వం శ్రీరాముడి ముఖ్య లక్షణం. అందుకే ఆయన్ని ధీరోదాత్తుడన్నారు. పుట్టినవాడు మరణించక తప్పదన్న పరమ సత్యాన్ని తెలుపుతూనే వాసుదేవుడు అర్జునుడిని యుద్ధానికి ప్రోత్సహిస్తూ సంసిద్ధుణ్ని చేస్తాడు.


దీపాన్ని తలకిందులుగా వెలిగించినా, జ్వాల పైకే లేస్తూ వెలుగుతుంది. ధైర్యవంతుడూ అంతే! దేనికీ బెదరడు, వెరవడు. పాల సముద్రాన్ని మధిస్తున్నప్పుడు హాలాహలం పుట్టినా భీతిల్లక లక్ష్యంపైన దృష్టి సారించడం వల్ల ఎన్నో అమూల్యమైన వాటిని పొందగలిగారు దేవతలు. లోకకల్యాణ కారకులై జోతలందుకున్నారు. యమధర్మరాజు పాశబద్ధుడై ప్రాణాలు హరించడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు అప్రమేయ ధైర్యంతో, భక్తి ప్రపత్తులతో వెళ్లి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని దీర్ఘాయుష్మంతుడయ్యాడు. సమయోచిత నిర్ణయంతో, విజ్ఞతతో ప్రవర్తించడమే విజేతకు ఉండవలసిన లక్షణం.


తప్పు చెయ్యనివాడు ధీమాగా ముందుకు సాగుతాడు. అపరాధి అడుగడుగునా భయపడుతూనే ఉంటాడు. అటువంటివాడికి విజయం కనుచూపు మేరలోనైనా కనపడదు. మనసులో ద్వేషం పెంచుకునేవాడిలో భయం విషవృక్షమై పెరుగుతూనే ఉంటుంది.


హరిని ద్వేషించి హిరణ్య కశిపుడు అలాగే అంతమయ్యాడు. సత్యస్వరూపుడు శ్రీమన్నారాయణుని స్మరించిన ప్రహ్లాదుడు ధైర్యంతో చిత్రహింసలన్నింటినీ ఆనందంగా భరించాడు. శుకుడి నుంచి భాగవత కథలను వినడం వల్లనే పరీక్షిత్తుకు అంత ధైర్యం కలిగింది. ముందు నడవబోయే మార్గం గడిచిన కంటకమయమైన దారికన్నా మంచిదనుకుంటేనే ముందడుగు వేయగలం. వివేకంతో, తెగింపుతో ముందుకు వెళ్ళేవాడు ఏదైనా సాధించగలుగుతాడు. ఎందరో తాపసోత్తములు, ఆచార్యులు, ప్రవచనకర్తలు సాహసంతో సంకటాలను ఎదుర్కొని, ఆటంకాలను అవరోధించి, గమ్యం చేరుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎందరో కష్టాలు, పరాజయాలు ఎదుర్కొని, ఎన్నో ఆవిష్కరణలు చేసి, పరిశోధనలు సాగించి మానవజాతికి సౌఖ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించారు. వారిలో చాలామంది ప్రాథమిక పరీక్షల్లో ఎంపికల్లో వైఫల్యం పొందినవారే!


అనుమానంతో, అపనమ్మకంతో పనిచేసేవాణ్ని ఓటమి వెంటాడుతూనే ఉంటుంది. ధైర్యశాలి ముందు ఓటమి చేతులు కట్టుకుని నిలబడుతుంది. ‘సులభంగా, దొడ్డిదారిన అందే విజయాలు శాశ్వత సుఖాన్ని, కీర్తిని ఇవ్వలేవు... జీవితంలో విజయాన్ని సాధించాలనుకుంటే మెట్ల వైపు చూస్తూ ఉండకుండా, ఆ మెట్లు ఎక్కుతూపోవాలి’ అనేవారు బాపూజీ. శిల్పం అందాలను సంతరించుకోవాలంటే ఉలిదెబ్బలు తప్పవు. వేలు వంకరగా పెట్టనిదే వెన్న రాదు. కవ్వంతో పెరుగు చిలక్కపోతే మీగడ వెన్నగా మారదు. గునపాలతో తవ్వకపోతే ఖనిజాలు వెలువడవు. గెలుపూ అంతే! పిలిస్తే వచ్చేది కాదు గెలుపు. ఎంతో సాధన, కృషి, పట్టుదల కావాలి.


శీతోష్ణాలు, రాత్రింబవళ్లు ఎంత సహజమో జయాపజయాలూ అంతే సహజమని గ్రహించేవాడు సర్వదా సాహసవంతుడే. సదా విజేతే! జీవితమనే నదికి గెలుపు, ఓటమి రెండు తీరాలు. ఈ తీరాలే జీవన సౌఖ్య సూత్రాలు. ఈ సత్యం తెలుసుకున్నవాడే స్థితప్రజ్ఞుడు, సంపూర్ణ మానవుడు!


- చిమ్మపూడి శ్రీరామమూర్తి

కామెంట్‌లు లేవు: